Jagan Meet Ram Madhav Fact Check: సీఎం జగన్ బీజేపీ నేత రామ్‌మాధవ్‌ను కలిశారా ? ఇదిగో ఫ్యాక్ట్ చెక్
Fact Check: సీఎం జగన్ రామ్ మాధవ్ ను కలిశారంటూ ఓ ఫోటో వైరల్ అయింది. కానీ ఇది పాత ఫోటోగా తేలింది.
Fact Check Jagan Meet Ram Madhav : వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బీజేపీతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తన్నారని చెప్పేందుకు సోషల్ మీడియాలో పాత ఫోటోలను కొత్తగా వైరల్ చేస్తున్నారు. బీజేపీలో కొన్నాళ్ల క్రితం కీలక పాత్ర పోషించిన రామ్ మాధవ్ తో జగన్ దిగిన ఫోటోను కొన్ని సోషల్ మీడియా హ్యండిల్స్ వైరల్ చేశాయి. టీడీపీ, జనసేనతో బీజేపీ పొత్తులు పెట్టుకున్నప్పటికీ బీజేపీకి దగ్గరగా ఉండేందుకు వైసీపి అధినేత జగన్ ప్రయత్నిస్తున్నారన్నది ఆ పోస్టుల సారాంశం. ఇదేమీ జగన్ కు మద్దతిస్తున్న ముస్లిం వర్గాలకు కనిపించదా అని కూడా పోస్టులు పెట్టిన వారు ప్రశ్నించారు.
అయితే ఈ అంశంపై నిజం మాత్రం వేరుగా ఉంది. జగన్ మోహన్ రెడ్డి, రామ్ మాధవ్ ను కలిసిన మాట నిజమే కానీ.. అది ఇప్పుడు కాదు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పుడు సీఎం జగన్ రామ్ మాధవ్ ను కలిశారు. అప్పటి ఫోటోను ఇటీవల భేటీ జరిగినట్లుగా కల్పిత కథ సృష్టించి ప్రచారం చేస్తున్నారు.
రామ్ మాధవ్ ఆరెస్సెస్ నుంచి బీజేపీలోకి వచ్చారు. కొన్నాళ్లు కీలక బాధ్యతలు నిర్వహించిన తర్వాత ఆయన బీజేపీ నుంచి వైదొలిగారు. ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఆయన పూర్తిగా ఆరెస్సెస్ కార్యక్రమాలకే పరిమితమయ్యారు. బీజేపీ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్పన్పుడు ఆయన స్వరాష్ట్రం ఏపీ కాబట్టి.. ఏపీ విషయాలను ఆయన పట్టించుకునేవారు. ఈ క్రమంలో ఎన్నికల ఫలితాల తర్వాత జగన్ .. ఆయనతో సమావేశమయ్యారు.
ఎన్నికల సమయంలో ఓటర్లను గందరగోళ పరిచి..ఎన్నికలను ప్రభావితం చేయడానికి ఎన్నో రకాల ఫేక్ న్యూస్‌లను వివిధ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఇందులో నిజానిజాలను .. వైరల్ అయ్యే ఫేక్ న్యూస్ గురించి పాఠకులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడానికి ఫ్యాక్ట్ చెక్ బృందాలు నిరంతరంగా శ్రమిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. బీజేపీ కూటమికి వ్యతిరేకంగా వైసీపీ పోరాడుతోంది. ఏపీలో రాజకీయ పార్టీలన్నీ సోషల్ మీడియా సైన్యాలను పెట్టుకుని పోటాపోటీగా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నాయి.