Bappi Lahiri: బప్పి లహిరి మెడలో అంత బంగారమెందుకు? వాటి బరువు, ధర ఎంతో తెలుసా?
ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు బప్పి లహిరి మెడలో అంత బంగార ఎందుకు వేసుకుంటారంటే...
ప్రముఖ సంగీత దర్శకుడిగానే కాదు బప్పి లహిరికి ‘గోల్డ్ మ్యాన్’గా కూడా గుర్తింపు ఉంది. ఆయన మెడనిండా బంగారు గొలుసులతో, చేతికి ఉంగరాలతో, ముంజేతి కంకణాలతో కళకళలాడిపోతుంటారు. నిండైన విగ్రహంలా కదిలే అతని రూపం ఎంతో మందికి ఇష్టం. ఆ రూపానికి మరింత ప్రత్యేకతను తెచ్చేవి ఈ బంగారు ఆభరణాలే. ఆడవారికి బంగారం మీద ప్రేమ ఉండడం సహజమే, మరి బప్పి లహరికి ఎందుకొచ్చింది? ఆ విషయం అతను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
అతనే స్పూర్తి...
బంగారం ధరించే విషయంలో అమెరికన్ పాప్ స్టార్ ఎల్విస్ ప్రెస్లీ తనను ప్రభావితం చేశారని చెప్పారు బప్పీ లహిరి. ఎల్విస్ ఓ షోలో పెద్ద బంగారు గొలుసు వేసుకున్నారని, ఆ లుక్ తనకు చాలా నచ్చిందని చెప్పారు. అప్పటికి ఇంకా తాను సెలబ్రిటీ అవ్వలేదని, ఎప్పటికైనా కెరీర్‌లో విజయం సాధించాక సొంత ఇమేజ్‌న క్రియేట్ చేసుకోవాలని అనుకున్నట్టు తెలిపారు. అలా ఆరోజు పుట్టిన ఆలోచనతో సెలెబ్రిటీగా మారాక బంగారుగొలుసులు అధికంగా వేసుకోవడం ద్వారా సొంత స్టైల్‌ను సృష్టించుకున్నానని చెప్పారాయన. ఇలా బంగారు ఆభరణాలు వేసుకున్నాక తనకి బాగా కలిసి వచ్చిందని కూడా అన్నారు.
ఎంత బంగారం ఉంది?
2014లో లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ టికెట్ పై పోటీ చేశారు బప్పీ లహిరి. ఆ సమయంలో ఎన్నికల అఫిడవిట్లో ఆస్తుల వివరాలు సమర్పించారు. అందులో తన దగ్గర ఉన్న బంగారం వివరాలను కూడా పొందుపరిచారు. దాని ప్రకారం బప్పి లహరి దగ్గర 2014 నాటికి 75 తులాల బంగారం ఉంది, అలాగే అతడి భార్య పేరు మీద 96 తులాల బంగారం ఉంది. అలాగే బప్పీ పేరు మీద 4.62 కిలోల వెండి, భార్య పేరున 8.9కిలోల వెండి ఉంది. నాలుగులక్షల విలువ చేసే వజ్రాలు కూడా ఉన్నాయి. మొత్తం ఆస్తుల విలువ 20 కోట్ల రూపాయలుగా చూపించారు. 2014 తరువాత ఆయన మరింత బంగారం కొనే అవకాశం ఉంది.
బప్పి లహిరి గతేడాది కోవిడ్ బారిన పడ్డారు. అప్నట్నించి తీవ్రంగా అనారోగ్యం పాలయ్యారు. నడవలేక వీల్ ఛైర్‌కే పరిమితమయ్యారు. కొన్నిరోజులుగా ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఫిబ్రవరి 16న మరణించారు. ఆయన తెలుగులో కూడా కొన్ని సినిమాలకు పనిచేశారు.
View this post on Instagram