Lokesh Kangaraj: సూర్య, కార్తీలతో పవన్ కళ్యాణ్ చిత్రం రీమేక్ - విక్రమ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ వెల్లడి
"విక్రమ్" సినిమా హిట్ తో డైరెక్టర్ లోకేష్ కనగరాజు టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోయారు.
‘విక్రమ్’ సినిమా హిట్‌తో డైరెక్టర్ లోకేష్ కనగరాజు టాప్ డైరెక్టర్స్ లిస్ట్‌లో చేరిపోయారు. సినిమా అద్భుతంగా తీశావంటూ మమ్ముట్టి, మోహన్ లాల్, రామ్ చరణ్, ‘కేజియఫ్’ హీరో యష్ లోకేష్‌కు ఫోన్ చేసి ప్రత్యేకంగా అభినందించారు. పలువురు హీరోలు ఆయనతో సినిమా చేసేందుకు చాలా ఆసక్తి కూడా చూపిస్తున్నారు. ప్రస్తుతం లోకేష్‌కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన ‘అయ్యప్పనుమ్ కోషియం’ సినిమాను రీమేక్ చెయ్యాలని అనుకుంటున్నారట. ఇటీవల కోలీవుడ్ కి చెందిన ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లోకేష్ తన మనసులో మాట బయట పెట్టేశారు.
తమిళ సోదరులు సూర్య, కార్తీలతో ఈ సినిమా తీయాలని అనుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు. ‘‘కమల్ సార్‌తో ఎప్పటి నుంచో కలిసి పని చెయ్యాలని అనుకున్నాను. ‘విక్రమ్’ సినిమాతో అది నెరవేరింది. ఇటీవలే ‘అయ్యప్పనుమ్ కోషియం’ చూశాను. చాలా బాగా నచ్చింది. దీన్ని తమిళంలో రీమేక్ చెయ్యాలని అనుకుంటున్నా. ఈ సినిమాలో పృథ్వీరాజ్ పాత్రలో కార్తీ, బిజూమేనన్‌గా సూర్యను చూడాలనుకుంటున్నా’’ అని తెలిపారు. ప్రస్తుతం తన ఫోకస్ అంతా తళపతితో చేస్తున్న ప్రాజెక్ట్ “విజయ్ 67”, కార్తీ “ఖైదీ 2” మీదే ఉందని అన్నారు.
2019లో కార్తీ ప్రధాన పాత్రగా వచ్చిన ‘ఖైదీ’ సినిమాతో లోకేష్ కనగరాజ్ పేరు బయటికి వచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. దీంతో విజయ్, కమల్ హాసన్ వంటి స్టార్ హీరోలతో పని చేసే అవకాశం దక్కింది. ‘విక్రమ్’ సినిమాలో కమల్ హాసన్‌ను చూపించిన తీరు అద్భుతంగా ఉంది. ఇందులో సూర్య చివరి నిమిషంలో కనిపించి అందరినీ సర్ ప్రైజ్ చేశారు. ఈ సినిమాలో సూర్య విలన్ పాత్ర పోషించారు.
మలయాళంలో సూపర్ హిట్ సొంతం చేసుకున్న అయ్యప్పనుమ్ కోషియం సినిమాను తెలుగులోను రీమేక్ చేశారు. పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పత్రాలు పోషించారు. పవన్‌కు జోడీగా నిత్యా మీనన్ నటించగా, రానా సరసన సంయుక్తా మీనన్ నటించారు. సితార ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. సాగర్ చంద్ర దర్శకత్వం వహించగా, త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, సంభాషణలు అందించారు. తమన్ అదిరిపోయే సంగీతం ఇచ్చారు. త్రివిక్రమ్ అందించిన అద్బుతమైన డైలాగ్స్ సినిమాని మరో స్థానంలో నిలబెట్టాయి. ఇప్పుడు మలయాళం సినిమాను విక్రమ్ డైరెక్టర్ తమిళంలో తీస్తే ఏ రేంజ్‌లో ఉంటుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Also Read : ఇంతకు ముందు ఎప్పుడూ చేయనటువంటి పాత్రలో నందమూరి బాలకృష్ణ
Also Read : అదీ రాజమౌళి రేంజ్, హాలీవుడ్ దర్శకులతో కలిసి - దర్శక ధీరుడికి అరుదైన గౌరవం
View this post on Instagram