Suma Kanakala: యాంకర్ సుమ మంచి మనసు - 100 పడకల వృద్ధాశ్రమం నిర్మాణం, అండగా ఉంటానంటూ హామీ!
Suma Kanakala: యాంకర్ సుమ చేసే సామాజిక సేవల గురించి చాలా తక్కువమందికి తెలుసు. తాజాగా తను చేసే ‘సుమ అడ్డా’ షోలో వృద్ధులకు తను చేసిన సాయం గురించి బయటపడింది.
Suma Kanakala Help To Old Age Homes: బుల్లితెరపై లేడీ యాంకర్ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు సుమ కనకాల. సినిమాల్లో నుంచి బుల్లితెరపై యాంకర్‌గా వచ్చిన సుమ.. ఎన్నో ఏళ్లుగా యాంకరింగ్‌లో తన సత్తా ఏంటో చూపిస్తూ టాప్ 1 స్థానాన్ని దక్కించుకుంది. అయితే సుమ.. ప్రొఫెషనల్ లైఫ్ గురించి తప్పా పర్సనల్ లైఫ్ గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. ఎక్కువగా ఈవెంట్స్‌లో, షోలలోనే తన సమయం గడిపేస్తుందని చెప్తుంది తప్పా తన ఖాళీ సమయాల్లో ఏం చేస్తుందో ఎవరితో ఎక్కువగా షేర్ చేసుకోలేదు సుమ. తాజాగా తను చేసే సోషల్ వర్క్ గురించి బయటకొచ్చింది. సుమ ఒక వృద్దాశ్రమం నిర్మాణం కోసం ఎంత సాయం చేసిందో బయటపడింది.
వృద్దాశ్రమ నిర్మాణం..
తాజాగా ‘సుమ అడ్డా’ షోలో ‘ఓం భీమ్ బుష్’ టీమ్ సందడి చేసింది. అదే సమయంలో సుమ బర్త్ డే కూడా ఉండడంతో తనకొక సర్‌ప్రైజ్ అంటూ వృద్దాశ్రమం నుంచి కొంతమంది వృద్ధులను స్టేజ్‌పైకి పిలిపించాడు హీరో శ్రీ విష్ణు. అసలు వారంతా ఎవరు అని ప్రేక్షకులకు పరిచయం చేసింది సుమ. ‘‘అరుణ గారు నెస్ట్ ఓల్డ్ ఏజ్ హోమ్‌ను నడిపిస్తారు. మేమందరం కలిసి 100 పడకలు ఉండే వృద్దాశ్రమాన్ని నిర్మించాం’’ అంటూ వ్రద్దాశ్రమాన్ని నడిపించే అరుణ అనే మహిళను అందరికీ పరిచయం చేసింది సుమ. ఆ తర్వాత అరుణ వచ్చి వృద్దాశ్రమం కోసం సుమ ఎంత సాయం చేశారో చెప్పుకొచ్చారు.
రుణం తీర్చుకోలేం..
‘‘105 మందికి నివాసం ఉండే సదుపాయం, 125 మందికి పని మా దగ్గర ఉంది. ప్రస్తుతం ఆశ్రమంలో105 మంది ఉన్నారు. దీనికి మేము ఎంత కృష్టిచేశామో సుమ కూడా అంతే కృషిచేశారు. అందుకే అది సుమ గారి హోమే అని గర్వంగా చెప్తున్నాను. విమలమ్మ (సుమ వాళ్ల అమ్మ)కు కూడా ధన్యవాదాలు. ఒకప్పుడు ఆమె మా హోమ్‌కు రెగ్యులర్‌కు వస్తుండేవారు. సుమ గారిని ఒకసారి తీసుకురండి అని అడుగుతూ ఉండేదాన్ని. నేను అడిగినప్పుడు టైమ్ వచ్చినప్పుడు కచ్చితంగా వస్తుంది అని అన్నారు. ఆ టైమ్ సుమ గారి రూపంలో ఇచ్చారు. ఆమె మా అందరికీ నీడను కల్పించారు. మా అందరి ఆశీర్వాదం ఆమెకు ఎప్పుడూ ఉంటుంది. మేము ఏం చేసినా ఆమె రుణం తీర్చుకోలేం’’ అని సుమ గురించి గొప్పగా మాట్లాడారు.
అదే మా ఆశ..
ఆ తర్వాత తను నడిపిస్తున్న మరో ఎన్‌జీఓ గురించి కూడా సుమ బయటపెట్టింది. ‘‘మేము ఫెస్టివల్స్ ఆఫ్ జాయ్ అనే ఒక ఎన్‌జీఓను రన్ చేస్తున్నాం. పండగలు అంటే మన ఇంట్లో సరదాగా జరుపుకోవడం మాత్రమే కాదు.. ఇంకో నలుగురి జీవితాల్లోనూ ఆనందం నింపడానికే రెండేళ్ల క్రితం ఈ ఫెస్టివల్స్ ఆఫ్ జాయ్‌ను ప్రారంభించాం. నాతో స్ట్రాంగ్‌గా నిలబడిన నా టీమ్‌కు చాలా థ్యాంక్స్. మేము వీరికి సాయం కావాలని పిలుపునిచ్చినప్పుడు చాలామంది ముందుకు వచ్చి సాయం చేశారు. వాళ్లకి కూడా థ్యాంక్స్. నా తపనకు అందరూ తోడుగా నిలబడ్డారు’’ అంటూ తన బర్త్ డేను ఆ వృద్ధులతో సెలబ్రేట్ చేసుకుంది సుమ. ‘‘చాలా ఎక్కువ ఓల్డ్ ఏజ్ హోమ్స్ రావాలన్నది కాదు మా ధ్యేయం. వాటి అవసరమే రాకూడదు. అందరూ వాళ్ల తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి అనేది మా ఆశ’’ అంటూ తన కోరికను చెప్పింది.
Also Read: రకుల్ తమ్ముడితో సీరత్ కపూర్ ఎంగేజ్మెంట్ - అసలు సంగతి ఇదీ!