Shyamala: బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, భయంగా ఉంది - ఎట్టకేలకు స్పందించిన శ్యామల
Shyamala: ఏపీ ఎన్నికల్లో తాను సపోర్ట్ చేసిన వైసీపీ పార్టీ ఘోరంగా పరాజయం చవిచూసిన తర్వాత శ్యామల బయటికి రావడం మానేసింది. తాజాగా దీనిపై స్పందిస్తూ ఒక వీడియో మెసేజ్ విడుదల చేసింది.
Anchor Shyamala: ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో వైఎస్ జగన్‌ను, వైసీపీ పార్టీని సపోర్ట్ చేయడానికి యాంకర్ శ్యామల ముందుకొచ్చింది. ప్రచారకర్తగా ప్రచారాల్లో చాలా యాక్టివ్‌గా పాల్గొంది. అంతే కాకుండా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ వైసీపీ సపోర్ట్‌గా మాట్లాడుతూ.. ఇతర పార్టీలపై, పార్టీ నాయకులపై బురదజల్లే ప్రయత్నం చేసింది. ఇక ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోగానే శ్యామల అసలు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా కనిపించడం లేదు. దీంతో ఏమైపోయావు అంటూ శ్యామలను ట్యాగ్ చేస్తూ తనపై ట్రోల్స్ మొదలుపెట్టారు నెటిజన్లు. ఫైనల్‌గా ఈ పరాజయంపై స్పందించడానికి శ్యామల ముందుకొచ్చింది.
ధన్యవాదాలు..
‘‘ప్రియమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నమస్తే.. జరిగిన ఎన్నికల్లో ఏపీ ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. క్షేత్ర స్థాయిలో జరిగిన ఎన్నికల్లో కచ్చితంగా ప్రజలదే అంతిమ తీర్పు. మీ తీర్పును స్వాగతిస్తున్నాను, గౌరవిస్తున్నాను. ముఖ్యంగా అఖండ విజయాన్ని మూటగట్టుకున్న కూటమికి ధన్యవాదాలు. పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురందేశ్వరి గారికి, బీజేపీ సభ్యులు అందరికీ కూడా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం కష్టపడిన ప్రతీ కార్యకర్తకు, వైసీపీ కుటుంబం మొత్తానికి కూడా పేరుపేరునా ధన్యవాదాలు’’ అని ఎన్నికల్లో ప్రజల తీర్పుపై స్పందించింది శ్యామల.
ఎప్పటికీ జగనన్నతోనే..
‘‘అవును ఓడిపోయాం. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గెలిచిన రోజు విజయగర్వంతో విర్రవీగలేదు. ఓడిపోయినప్పుడు కృంగిపోలేదు. అలాగే ఈసారి కూడా మన జగన్ మోహన్ రెడ్డిగారు మరింత బలాన్ని పుంజుకొని, మనం అందరం కలిసి జగనన్నతో నడిస్తే కచ్చితంగా మళ్లీ ఒక మంచి ప్రభుత్వంగా మనం ఏర్పాటవుతాం. దేవుడిపై నమ్మకం ఉంచి ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటూ ఎప్పటికీ జగనన్నతోనే ఉంటాను. అందరం కలిసి నడుద్దాం. మంచి చేద్దాం. ప్రజలకు మంచి జరగడమే ముఖ్యం. ఈ అయిదేళ్లలో కూడా ఆంధ్రప్రదేశ్‌కు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని ఎప్పటికీ తాను వైసీపీ సపోర్టర్‌నే అని క్లారిటీ ఇచ్చింది.
బెదిరింపు కాల్స్..
తనకు వచ్చే బెదిరింపు కాల్స్‌పై కూడా శ్యామల స్పందించింది. ‘‘చాలా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. చాలా బెదిరిస్తున్నారు. నాకు కూడా భయంగానే ఉంది. ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. మీకు నచ్చనిది నాకు నచ్చిందని చెప్పి మీరు బ్రతకడానికే వీలు లేదు అంటే ఇది చాలా అన్యాయం. నేను వ్యక్తిగతంగా ఎవరిపైనా విమర్శలు చేయలేదు. ఎప్పటికీ చేయను కూడా. ఎవరన్నా కూడా నాకు చాలా గౌరవం. దయజేసి మీరు కూడా ఏదీ వ్యక్తిగతంగా తీసుకోవద్దు. ఒక పార్టీని గెలిపించే ప్రయత్నంలో ఎంత చేయాలో అంత చేశాను. ఉన్నదే చెప్పాను.. లేనిది ఎక్కడా మాట్లాడలేదు. దాన్ని మీరు అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను’’ అని వీడియోలో రిక్వెస్ట్ చేసింది శ్యామల. ఇక శ్యామల విడుదల చేసిన ఈ వీడియో మెసేజ్‌తో అయినా తనపై విమర్శలు ఆగుతాయేమో అని కొందరు భావిస్తున్నారు.
Also Read: ఎన్టీఆర్‌పై బాబు గోగినేని షాకింగ్ కామెంట్స్ - అంత మాట అనేశాడేంటీ? తారక్ ఫ్యాన్స్ గుర్రు