Prema Entha Madhuram December 29th Episode: రౌడీలతో చెడుగుడు ఆడిన ఆర్య.. అను, ఆర్యలకు ముడి వేసే ప్రయత్నంలో సుగుణ!
Prema Entha Madhuram Today Episode: ఉష అను, ఆర్యలని కలపాలి అనే తన అభిప్రాయాన్ని సుగుణకు చెప్తుంది. దాంతో సుగుణ వాళ్ళిద్దరినీ కలుపుతుందా లేదా అనే ఉత్కంఠత కథలో ఏర్పడుతుంది.
Prema Entha Madhuram Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో స్వామియే శరణమయ్యప్ప అని అనుకుంటూ రౌడీలు అందరూ అయ్యప్ప మాలలో పూజ గది లోకి ప్రవేశిస్తారు.
పూజారి పూజలు చేస్తూ పిల్లలిద్దరి నుదుటిమీద అయ్యప్ప స్వామి యొక్క నలుపు గుడ్డను పెడతారు. పిల్లలిద్దరినీ దండలు వేసి అలంకరిస్తారు.
పూజారి: అయ్యప్ప స్వామికి నాట్యం అంటే చాలా ఇష్టం అందరూ నాట్యం ఆడండి అని అనగా అక్కడ పిల్లలు, అయ్యప్పలు, అయ్యప్ప మాల వేసుకున్న రౌడీలు అందరూ నాట్యం చేస్తూ నాట్యంలో మునిగిపోతారు. అయితే అలా నాట్యం చేస్తూ ఉండగా ఆ రౌడీలు అభయ్ అక్కిలను వాళ్ళ భుజాల మీద పెట్టుకొని ఊగుతూ ఉంటారు. ఇంతలో ఒక రౌడీ ఊగుతూ తన కత్తిని కింద పాడేస్తాడు, ఆ కత్తిని ఆర్య చూస్తాడు.
పూజారి: మణిద్వీపం వెలిగించే సమయం వచ్చింది లైట్లు అన్ని ఆపేయాలి అని అనగా లైట్లు అన్ని ఆపేస్తారు.
అప్పుడు ఆర్యకి వింత వింతగా అభయ్ అక్కి అని అరుపులు వినిపిస్తూ ఉంటాయి. దాంతో ఆర్య కంగారు పడతాడు.
పూజారి ఆ మణిద్వీపాలను వెలిగిస్తూ ఉండగా అరుపులు ఎక్కువయి ఎవరో ఎవర్నో కొడుతున్నట్టు శబ్దాలు వినిపిస్తాయి. లైట్లు వేసి చూసేసరికి ఆర్య అక్కడ ఉన్న రౌడీల అందరి అంతు చూసి అభయ్, అక్కిలను కాపాడుతాడు. అప్పుడు యాదగిరి విజిల్ వేస్తాడు.
యాదగిరి: పిల్లల్ని కాపాడ్డానికి మీరు ఉన్నారు వీళ్ళందర్నీ కాపాడ్డానికి ఎవరున్నారు? అని ఆర్య ని పొగుడుతూ ఉంటారు.
ఆరోజు రాత్రి సుగుణ తన ముగ్గురు పిల్లలతో పాటు గదిలో కూర్చుని ఉంటుంది. అందరూ నిశ్శబ్దంగా ఆలోచనలో పడిపోతారు. అంతలో అక్కడికి అను వస్తుంది. వాళ్లని చూసిన అను తన పని తాను చేసుకుంటూ ఉంటుంది.
సుగుణ: వచ్చిన వాళ్ళు ఎవరు? అసలు నీకు ఎవరితోనైనా ఏమైనా శత్రుత్వాలు ఉన్నాయా? ఎందుకు వాళ్ళు పిల్లలను చంపాలనుకుంటున్నారు?
అను: ఈ విషయాలు అన్నీ మీకు ఎలా చెప్పాలి ఆంటీ అని మనసులో అనుకుంటుంది.
సుగుణ: నీ భర్తకి నీకు ఏమైనా గొడవలు ఉన్నాయా? వాళ్ల తరపున వాళ్ళు ఎవరైనా పిల్లల కోసం వచ్చారా?
అను: అలా ఏమీ అయ్యి ఉండదు ఆంటీ. ఎలా జరిగిందో నాకే అర్థం కావడం లేదు ఒకవేళ తెలిస్తే మీతోనే కదా నా బాధ చెప్పుకుంటాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అను.
దివ్య: వీళ్ళు రాకముందు వరకు ఇల్లు ప్రశాంతంగా ఉండేది. వస్తూ వస్తూ ఎన్ని సమస్యలను తెచ్చారో అనుకుంటూ జ్యోతి ని తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది దివ్య.
ఉష: అమ్మా, పాపం కదా రాధ గారు. ఈరోజు అన్నయ్య, పిల్లలు ఇద్దరినీ కాపాడకపోయి ఉంటే వాళ్ళు మనకి దక్కే వారు కాదు.
సుగుణ: రాధ కి ఎప్పుడు బాధలే ఉన్నాయి. సూర్య ఉండడం వల్ల ఈరోజు ఏ అపాయం కలగలేదు.
ఉష: అన్నయ్య ప్రతిసారి ఉండడు కదమ్మా అందుకే రాధ గారిని అన్నయ్యని ఒకటి చేస్తే పిల్లలకు అన్నయ్య చేదోడు వాదోడుగా ఉంటాడు. అయినా రాధ గారు అన్నయ్యని అర్థం చేసుకున్నంతగా మరెవరు అర్థం చేసుకోలేరేమో!
సుగుణ: అసలేం మాట్లాడుతున్నావే?
ఉష: ఏమమ్మా ఇద్దరు పిల్లలకు తల్లి అని చెప్పి అన్నయ్యకు సరిపోరు అని అనుకుంటున్నావా? అన్నయ్య సంబంధాలకని వెళ్తే ఒక్కొక్కరు ఎన్ని మాటలు అన్నారో గుర్తుంది కదా! ఇంట్లో వాళ్ళనే పోషించలేని వాడు తన భార్యనెలా పోషిస్తాడు అని అన్నారు. అన్నయ్యని బాగా అర్థం చేసుకున్నారు రాధ గారు. ఎందుకో వాళ్ళిద్దరే ఒకటవుతారు అని అనిపిస్తుంది అని చెప్తుంది ఉష. ఆ మాటలకు ఆలోచనలను పడుతుంది సుగుణ.
ఆ మరుసటి రోజు ఉదయం యాదగిరి హడావిడిగా అందరినీ పిలుస్తాడు.
యాదగిరి: జ్యోతి త్వరగా తయారయ్యారా అక్కడ ముహూర్తం దాటిపోతుంది!
జ్యోతి: అబ్బబ్బా.. ఎప్పుడో తయారయిపోయాము మీదే లేటు
యాదగిరి: ఎప్పుడో తయారు అయిపోతే ఇప్పటివరకు ఎందుకు కూర్చున్నారు పదండి అని చెప్పి దివ్యని కూడా తీసుకొని వెళ్తాడు. మరోవైపు ఉష సుగుణ తో మాట్లాడుతుంది
ఉష: నేను చెప్పిన విషయం గురించి ఏం చేశావు అమ్మ?
సుగుణ: ఇది వెంటనే తీసుకునే నిర్ణయం కాదు మనం అనుకుంటే సరిపోదు కదా. వాళ్ళిద్దరి జాతకాలు కూడా కలవాలి
ఉష: నీ దగ్గర అన్నయ్య జాతకం ఉంది కదా, రాధ గారి గురించి జాతకం గుడికి తెచ్చేటట్టు మనం చేద్దాం అప్పుడు వాళ్ళిద్దరిది జాతకం కలుస్తుందో లేదో పంతులుగారు చెప్తారు అని చెప్పి సుగుణ వెళ్ళిపోయిన వెంటనే, నా జాతకం కూడా పట్టుకుంటాను మళ్ళీ ఎగ్జాన్స్ లో పాస్ అవుతానో లేదో చూడాలి అని అనుకుంటుంది ఉష.
తర్వాత సుగుణ అను గది దగ్గరికి వెళ్తుంది.
సుగుణ: మనం వెళ్తున్న పూజారి గారు జాతకాలను బాగా చెప్తారట అందుకే మా అందరి జాతకాలు తీసుకెళ్తున్నాము. పనిలో పనిగా నీది కూడా తీసుకొని రా రాధ.
అను: ఇప్పుడు ఎందుకులెండి ఆంటీ మరెప్పుడైనా చూద్దాము.
సుగుణ: మరెప్పుడో ఎందుకు ఎలాగో వెళ్తున్నాం కదా ఇప్పుడే చూపిద్దాము అని అనగా అను బీరువాలో నుంచి తన జాతకాన్ని తీసి సుగుణకు ఇస్తుంది.
ఆ తర్వాత కుటుంబ సభ్యులందరూ గుడిలోకి వెళ్తారు. అక్కడ దివ్య, సురేష్ కూర్చొని ఉంటారు వాళ్లకి చుట్టూ కుటుంబ సభ్యులందరూ నించొని ఉండగా పూజారి గారు జాతకం చూస్తూ ఉంటారు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.