Tollywood Stars: ''స్టార్ డైరెక్టర్ అయితే మాకేంటి..?''
ఇండియా సినిమా చరిత్రలో తనకంటూ ఓ అధ్యాయాన్ని లిఖించుకున్నారు దర్శకుడు మణిరత్నం.
ఇండియా సినిమా చరిత్రలో తనకంటూ ఓ అధ్యాయాన్ని లిఖించుకున్నారు దర్శకుడు మణిరత్నం. ఆయనలో మంచి కథకుడు ఉన్నాడు. ఆయన సినిమాల్లో ఛాన్స్ వచ్చిందంటే చాలు ఎగిరిగంతేస్తారు తారలు. కెరీర్ లో ఒక్కసారైనా ఆయనతో కలిసి పని చేయాలని చాలా మందికి ఓ కల. కానీ మన తెలుగు తారల్లో కొంతమంది అలాంటి ఆఫర్ ను రిజెక్ట్ చేశారు. స్టోరీ నచ్చకనో లేక డేట్స్ అడ్జస్ట్ చేయలేకనో ఆయన సినిమాలైతే రిజెక్ట్ చేశారు. అలా మణిరత్నం సినిమాలు మిస్ చేసుకున్న మన స్టార్లు ఎవరో ఇప్పుడు చూద్దాం!
వెంకటేష్ :
అరవింద్ స్వామి, మధుబాల జంటగా రూపొందించిన 'రోజా' సినిమా ఒక క్లాసిక్. ఇందులో పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. ఈ సినిమాతో అరవింద్ స్వామి రేంజ్ పెరిగిపోయింది. అయితే ఈ సినిమా స్టోరీని ముందుగా వెంకటేష్ కి వినిపించారట మణిరత్నం. ఆయన కూడా సినిమా చేయాలనే అనుకున్నారు. కానీ డేట్స్ క్లాష్ అవ్వడంతో కుదరలేదు. ఆ తరువాత అరవింద్ స్వామిని తీసుకున్నారు.
మహేష్ బాబు :
మన సూపర్ స్టార్ మహేష్ బాబుతో చాలా సార్లు సినిమా చేయాలనుకున్నారు మణిరత్నం. ఆయన తీసిన 'నవాబ్' సినిమాలో ఓ రోల్ మహేష్ బాబుకి ఆఫర్ చేశారు. అలానే మణిరత్నం తీస్తోన్న కొత్త సినిమా పొన్నియన్ సెల్వన్' కథ ముందుగా మహేష్ కి వినిపించారు. అది కూడా మహేష్ బాబు రిజెక్ట్ చేశారు.
రామ్ చరణ్ :
దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా నటించిన 'ఓకే బంగారం' సినిమా మణిరత్నంకి కమ్ బ్యాక్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. ఈ సినిమాతో ఆయన మంచి హిట్ అందుకున్నారు. ఈ జెనరేషన్ కి నచ్చే ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమా యూత్ కి బాగా కనెక్ట్ అయింది. ఈ సినిమా కథను ముందుగా రామ్ చరణ్, నానిలకు చెప్పారు మణిరత్నం. కానీ వాళ్లు రిజెక్ట్ చేయడంతో ఈ ప్రాజెక్ట్ దుల్కర్ సల్మాన్ చేతికి వెళ్లింది. అయితే ఈ సినిమా తెలుగు వెర్షన్ లో హీరో పాత్రకి మాత్రం నాని డబ్బింగ్ చెప్పగలిగారు.
సమంత :
గౌతమ్ కార్తీక్ ని హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన 'కడలి' సినిమాలో హీరోయిన్ గా ముందుగా సమంతను అడిగారట. కానీ అదే సమయంలో సమంతకి ఆరోగ్య సమస్యలు రావడంతో ఆమె ఈ సినిమాలో నటించలేకపోయారు. ఆ తరువాత నటి రాధా రెండో కూతురు తులసిని హీరోయిన్ గా తీసుకున్నారు.
నాగార్జున :
మణిరత్నం తెరకెక్కించిన 'నవాబ్' సినిమాలో అరవింద్ స్వామి పోషించిన పాత్ర కోసం ముందుగా నాగార్జునను సంప్రదించారట. కానీ ఆయన రిజెక్ట్ చేశారు.
పూజాహెగ్డే :
'ఓకే బంగారం' సినిమాలో ముందుగా పూజాహెగ్డేను హీరోయిన్ గా అనుకున్నారు. దుల్కర్ సల్మాన్ పక్కన ఆమె కనిపిస్తే సినిమాకి ఫ్రెష్ లుక్ వస్తుందని భావించారు. కానీ పూజా కొన్ని కారణాల వలన ప్రాజెక్ట్ ను రిజెక్ట్ చేసింది.
నాని :
మణిరత్నం నానితో రెండు సార్లు సినిమా చేయాలనుకున్నారు. 'ఓకే బంగారం'తో పాటు 'నవాబ్' స్టోరీ నానికి వినిపించారు. కానీ డేట్స్ అడ్జస్ట్ చేయలేక నాని ఈ రెండు సినిమాలు రిజెక్ట్ చేశారు.