Tollywood Producers: సమ్మెకి దిగనున్న నిర్మాతలు - షూటింగులు బంద్?
కొన్నిరోజుల క్రితం వరకు 24 క్రాఫ్ట్స్ లో పనిచేసే కార్మికులు వేతనాలు పెంచకపోతే బంద్ చేస్తామని నిర్మాతలను బెదిరించారు. ఇప్పుడు నిర్మాతలే సమ్మెకి దిగాలనుకోవడం హాట్ టాపిక్ గా మారింది.
టాలీవుడ్ నిర్మాతలు బంద్ కు పిలుపునివ్వాలనుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. కొన్నిరోజుల క్రితం వరకు 24 క్రాఫ్ట్స్ లో పనిచేసే కార్మికులు వేతనాలు పెంచకపోతే బంద్ చేస్తామని నిర్మాతలను బెదిరించారు. ఇప్పుడు నిర్మాతలే సమ్మెకి దిగాలనుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఈ మధ్యకాలంలో సినీ నిర్మాణం కారణంగా ప్రొడ్యూసర్స్ కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు. అందుకే ప్రొడక్షన్ లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నారు.
తెలుగు సినిమాల ప్రొడక్షన్ కాస్ట్ రోజురోజుకి పెరిగిపోతుంది. బడ్జెట్ అనేదానికి లిమిట్ లేకుండా పోతుంది. హీరోలు, దర్శకులు రెమ్యునరేషన్స్ పేరుతో కోట్లు వసూలు చేస్తున్నారు. దర్శకుడు పెర్ఫెక్షన్ పేరుతో రీషూట్స్ చేయడం నిర్మాతలకు అదనపు భారంగా మారింది. ఇంత కష్టపడి సినిమా చేసి హిట్ కొట్టినా.. నిర్మాతలకు పెద్దగా ఏమీ మిగలడం లేదట. ఇక ప్లాప్ అయితే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది.
ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్స్.. నిర్మాతలకు కష్టమొచ్చినప్పుడు సపోర్ట్ చేయకపోతే ఇంక కష్టపడి సినిమాలను ఎందుకు నిర్మించాలని ప్రశ్నిస్తున్నారు టాలీవుడ్ ప్రొడ్యూసర్స్. ప్రొడక్షన్ విషయంలో కొన్ని కీలక మార్పులు చేయాలనుకుంటున్నారు. ఈ విషయంలో బాలీవుడ్ స్టయిల్ ని ఫాలో అవ్వాలనేది కొందరి ఆలోచన. అక్కడ ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు ఒక కాల్షీట్ గా లెక్కపెడతారు. కానీ మన దగ్గర ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ఒక కాల్షీట్. టైం దాటిపోతే కొత్త కాల్షీట్ గా లెక్క వేయాల్సి ఉంటుంది. పోనీ సరిగ్గా 6 గంటలకే షూటింగ్ మొదలవుతుందా అంటే చెప్పలేం. కొందరు ఆర్టిస్ట్ లు కూడా ఆ సమయానికి రారు.
అందుకే టైమింగ్స్ మార్చాలని చూస్తున్నారు. అలానే లంచ్ విషయంలో బఫె సిస్టమ్ అమలు చేయాలనుకుంటున్నారు. లైట్ బాయ్ నుంచి హీరో వరకు ప్రొడక్షన్ లో అందరికీ ఒకే భోజనం అందించాలని భావిస్తున్నారు. ఒకవేళ అక్కడి ఫుడ్ నచ్చకపోతే సొంత ఖర్చులతో భోజనం తెప్పించుకోవాలి. దానికి నిర్మాతలకు ఎలాంటి సంబంధం ఉండకూడదనేది గిల్డ్ ప్రొడ్యూసర్స్ డిమాండ్. లేదంటే ఒక్క సినిమాకి కేవలం హోటల్ ఫుడ్ ఖర్చే లక్షల్లో అవుతుందట. ఈ పద్ధతి మార్చాలనుకుంటున్నారు.
ఇక హీరోలు తమ రెమ్యునరేషన్స్ కనీసం పాతిక శాతం వరకు తగ్గించుకుంటే తప్ప వర్కవుట్ అవ్వదని భావిస్తున్నారు నిర్మాతలు. అలానే దర్శకులు చెప్పిన సమయానికి సినిమాను పూర్తి చేసేలా అగ్రిమెంట్ రాయించుకోవాలని.. అంతకుమించి డేట్స్ ఎక్స్టెండ్ చేయకూడదనేది మరో ఆలోచన. బడ్జెట్ కూడా దాటకూడదు. ఈ నిర్ణయాలన్నింటినీ హీరోలు, డైరెక్టర్స్, టెక్నీషియన్స్ ముందు పెట్టాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారట. మరి దీనికి అందరూ ఒప్పుకుంటారా..? లేదా..? అనేది చూడాలి. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఓకే లేదంటే షూటింగులను బంద్ చేసి తమ నిరసనను తెలియజేలనుకుంటున్నారు నిర్మాతలు.
Also Read: శ్రీనువైట్లకు షాక్ - విడాకులకు అప్లై చేసిన భార్య!
Also Read: రామ్ చరణ్ సినిమాతో శంకర్ ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తారా?