Tollywood: బ్రేకింగ్ న్యూస్ - ఆగిపోనున్న సినిమాల షూటింగ్స్!
ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్మాతల నిర్ణయం.. ఆగిపోనున్న అగ్ర హీరోల సినిమాల షూటింగ్స్
టాలీవుడ్ నిర్మాతలు బంద్ కు పిలుపునివ్వాలనుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. కొన్నిరోజుల క్రితం వరకు 24 క్రాఫ్ట్స్ లో పనిచేసే కార్మికులు వేతనాలు పెంచకపోతే బంద్ చేస్తామని నిర్మాతలను బెదిరించారు. ఇప్పుడు నిర్మాతలే సమ్మెకి దిగాలనుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఈ మధ్యకాలంలో సినీ నిర్మాణం కారణంగా ప్రొడ్యూసర్స్ కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు. అందుకే ప్రొడక్షన్ లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నారు.
ఈ క్రమంలో టాలీవుడ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఈరోజు కీలక సమావేశం నిర్వహించింది. అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ మీటింగ్ జరిగింది. ఈ సమావేశానికి గిల్డ్ సభ్యులైన యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అందరూ హాజరయ్యారు. ఆగస్టు 1వ తేదీ నుంచి సినిమా నిర్మాణాలు అన్నీ ఆపాలనే కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
గిల్డ్ లో ఉన్న నిర్మాతలంతా యాక్టివ్ గా సినిమాలను నిర్మిస్తున్నవారే. వీరంతా కలిసి నిర్ణయం తీసుకున్నారంటే.. ఎక్కడి సినిమాలు అక్కడ ఆగిపోయినట్లే. అలా చూసుకుంటే.. ఆగస్టు నెలలో సెట్స్ పైకి వెళ్లాల్సిన మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమా.. అలానే 'పుష్ప2' ఇలా చాలా పెద్ద సినిమాలు షూటింగ్స్ అనుకున్న సమయానికి మొదలుకావు. అలానే విదేశాల్లో షూటింగ్స్ నిర్వహించాలనుకున్న సినిమాలు కూడా హోల్డ్ లో పడడం ఖాయం.
మరోపక్క తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సంస్థ ఓటీటీ రిలీజెస్, సినిమా టికెట్స్ రేట్ల గురించి కొన్ని నిర్ణయాలు తీసుకుంది. భారీ బడ్జెట్ సినిమాలను పది వారాల తరువాతే ఓటీటీకి ఇవ్వాలని.. చిన్న బడ్జెట్ సినిమాలను నాలుగు వారాల తరువాత ఇవ్వొచ్చని తెలిపాయి. రూ.6 కోట్ల లోపు బడ్జెట్ సినిమాలపై ఫెడరేషన్ తో చర్చించిన తరువాత తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపాయి.
ఇక సినిమా టికెట్ రేట్ల గురించి చెబుతూ.. నగరాల్లో, పట్టణాల్లో సాధారణ థియేటర్లు, సి క్లాస్ సెంటర్స్ లో రేటు రూ.100, రూ.70గా ఉంచాలని ప్రతిపాదించారు. మల్టీప్లెక్స్ లో జీఎస్టీతో కలిపి రూ.125 ఉండేలా ప్రతిపాదనలు చేశారు. మీడియం బడ్జెట్, మీడియం హీరో సినిమాలకు రూ.100 ప్లస్ జీఎస్టీ ఉండాలని, సి సెంటర్స్ లో జీఎస్టీతో కలిపి రూ.100 ఉండాలని.. మల్టీప్లెక్స్ లలో రూ.150 ప్లస్ జీఎస్టీతో ఉండేలా ప్రతిపాదించారు.
Also Read: ఈ వారం విడుదల కానున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే!
Also Read: నాని సినిమాలో ఇంటెన్స్ లవ్ స్టోరీ - ప్లస్ అవుతుందా?