Chandrababu Tollywood: చంద్రబాబుతో టాలీవుడ్ పెద్దల భేటీ వాయిదా - షూటింగ్‌లతో తీరిక లేకుండా ఉన్నారని సమాచారం
Tollywood: చంద్రబాబుతో టాలీవుడ్ పెద్దల భేటీ వాయిదా పడింది. షూటింగ్‌లతో చాలా మంది తీరిక లేకుండా ఉన్నందున వాయిదా పడినట్లుగా టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

Tollywood Meeet With Chandrababu Naidu : తెలుగు సినీ పరిశ్రమ పెద్దల అమరావతి పర్యటన వాయిదా పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో అమరావతిలో జరగాల్సిన తెలుగు సినిమా ప్రతినిధులు సమావేశం జరగడం లేదు. నిర్మాతలు, దర్శకులు, నటులు, “మా” ప్రతినిధులతో ఆదివారం సాయంత్రం సిఎం క్యాంప్ కార్యాలయంలో సమావేశం జరగాల్సి ఉంది. చంద్రబాబు ఇప్పటికే అపాయింట్ మెంట్ ఖరారు చేశారు. అయితే ఇ్పపుడు భేటీ వాయిదా పడినట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. భేటీకి రావాల్సిన వారిలో ఎక్కువ మంది షూటింగ్ ల రీత్యా ఇతర ప్రాంతాల్లో ఉండడంతో సమావేశం వాయిదా వేయాలని టాలీవుడ్ ప్రతినిధులు కోరారని.. సినిమా రంగంలోని పలు విభాగాల్లోని ముఖ్యమైన వారు అందుబాటులో లేకపోవడంతో మీటింగ్ రద్దు చేస్తున్నట్లుగా తెలిపింది.
షెడ్యూల్ ప్రకారం ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో సినీ ప్రముఖులు చంద్రబాబుతో సమావేశం కావాల్సి ఉంది. ఇప్పటికే ఓ లిస్ట్ తయారు చేసుకుని అందరూ రెడీ అయ్యారని ప్రచారం జరిగింది. అయితే ఎందుకు హఠాత్తుగా వాయిదా పడిందన్నది మాత్రం సస్పెన్స్‌గా మారింది. ఏపీ సీఎం చంద్రబాబు మీటింగ్ ను చివరి నిమిషంలో.. మాకు షూటింగులు ఉన్నాయని పోస్టు పోన్ చేసుకునేంత సాహసం టాలీవుడ్ పెద్దలు చేయరని అనుకుంటారు. ప్రభుత్వం వైపు నుంచి సమయం లేదని మరోసారి కలుద్దామని చెప్పారన్న ప్రచారం జరుగుతోంది.
టాలీవుడ్ సమస్యల మీద చర్చ!
'హరిహర వీరమల్లు' విడుదల వాయిదా పడటానికి ముందు థియేటర్స్ బంద్ చేయాలని కొంత మంది ఎగ్జిబిటర్లు తెర వెనుక పావులు కదిపారని ప్రచారం జరిగింది. దానిపై విచారణ చేయాలని ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఆదేశించారు. వాట్సాప్ గ్రూపులో వీరమల్లుకు వ్యతిరేకంగా కొందరు చేసిన డిస్కషన్ పవన్ వరకు చేరిందని 'బన్నీ' వాసు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. దాంతో పవన్ కొంచెం ఘాటుగా స్పందించారు. తనకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ స్వీకరిస్తున్నానని, ఏపీ డిప్యూటీ సీఎంవో కార్యాలయం నుంచి వచ్చిన లేఖలో పేర్కొన్నారు. ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు టాలీవుడ్ ప్రముఖుల్లో కదలిక వచ్చింది. ఏపీ సీఎంతో సమావేశం కావాలని నిర్ణయించుకున్నరాు.
పవన్ సూచించిన మార్పులతోపాటు టాలీవుడ్ సమస్యల మీద ప్రధానంగా చర్చించాలని అనుకున్నారు. పవన్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు వీరమల్లు విడుదల మీద 'ఆ నలుగురు' కుట్ర చేశారని బలంగా ప్రచారం జరిగింది. ఆ నలుగురిలో తాను లేనని అల్లు అరవింద్ తెలిపారు. ఆ వెంటనే 'దిల్' రాజు కూడా సమావేశం ఏర్పాటు చేసి తాను కూడా ఆ నలుగురులో లేనని చెప్పారు. జూన్ 20వ తేదీన తాను నిర్మించిన 'కుబేర' విడుదలకు సిద్ధం అవుతుండగా థియేటర్లు బంద్ చేయడానికి తాను ఎందుకు ప్రోత్సహిస్తానని సునీల్ నారంగ్ కూడా ఆ కుట్రలో తాను భాగంగా లేనన్నారు. అయితే సురేష్ బాబు ఎటువంటి విలేకరుల సమావేశం నిర్వహించలేదు.వీరంతా చంద్రబాబుతో సమావేశానికి వస్తారనుకున్నారు కానీ.. ఇప్పుడు వాయిదా పడటం హాట్ టాపిక్ అవుతోంది.





















