Tollywood: మహేష్, త్రివిక్రమ్ సినిమా ఫస్ట్ డే గ్లింప్స్ - 'గాడ్ ఫాదర్' నుంచి కొత్త సాంగ్!
ఈరోజు టాలీవుడ్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మీకోసం..
మహేష్, త్రివిక్రమ్ సినిమా ఫస్ట్ డే గ్లింప్స్:
సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టైమ్ రానే వచ్చింది. దాదాపు 12 సంవత్సరాల తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, మహేశ్ బాబు కలిసి తీయబోతున్న సినిమాకు సంబంధించి చిత్ర బృందం సూపర్ అప్డేట్ ఇచ్చింది. SSMB28 సినిమా షూటింగ్ స్టార్ అయినట్టు తెలుపుతూ సెట్స్ లో త్రివిక్రమ్, మహేష్ కూర్చున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
అలానే ఓ గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేశారు. ఫస్ట్ డే షూటింగ్ కు సంబంధించిన ఈ వీడియో వైరల్ అవుతోంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ సెట్ లో హైవోల్టేజ్ యాక్షన్ సీన్స్ ని చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో సినిమా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.
'గాడ్ ఫాదర్' నుంచి కొత్త సాంగ్:
మెగాస్టార్ చిరంజీవి.. మోహన్ రాజా దర్శకత్వంలో 'గాడ్ ఫాదర్'(God Father) అనే సినిమాలో నటిస్తున్నారు. మలయాళ 'లూసిఫర్'కి రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో నయనతార(Nayanthara), సత్యదేవ్(Satyadev) లాంటి తారలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే సినిమా టీజర్ ని వదిలారు. ఇప్పుడు సినిమాలో ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నారు. సెప్టెంబర్ 14న ఫస్ట్ సింగిల్ రాబోతుంది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. మెగాస్టార్ సతీమణి కొణిదెల సురేఖ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
First Single Update tmrw mrng 😍#GodFather
— Mohan Raja (@jayam_mohanraja) September 12, 2022
'పొన్నియిన్ సెల్వన్' ఓటీటీ రైట్స్ కి క్రేజీ డీల్:
కోలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సినిమా 'పొన్నియిన్ సెల్వన్'. సెప్టెంబర్ 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. ఈ సినిమా తెరకెక్కించడానికి ఆయన చాలా కష్టపడ్డారు. లైకా ప్రొడక్షన్స్ సహాయంతో తన సొంత బ్యానర్ లో ఈ సినిమాను నిర్మించారు మణిరత్నం. రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కూడా వచ్చింది. తమిళంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమాకి క్రేజీ ఓటీటీ డీల్ సెట్ అయినట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ 'పొన్నియిన్ సెల్వన్ 1,2' పార్ట్ లకు సంబంధించిన డీల్ కుదుర్చుకుందట. దీనికోసం రూ.125 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది.