రెండు ప్రభుత్వాలకూ ‘నంది’ అవార్డులపై ఆసక్తి లేదు: నిర్మాత ఆది శేషగిరిరావు వ్యాఖ్యలు
తెలుగు రాష్ట్రాల్లో సినీ సెలబ్రెటీలకు అందజేసే 'నంది అవార్డు'లపై మరో సారి చర్చ మొదలైంది. నంది అవార్డులపై తాజాగా స్పందించిన నిర్మాత ఆది శేషగిరిరావు.. ప్రభుత్వాలకు అనుకూలంగా ఉన్నవారికే ఇస్తున్నారన్నారు.
Nandi Awards: తెలుగు సినీ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 'నంది అవార్డులు' ఇటీవలి కాలంలో వార్తల్లో నిలుస్తున్నాయి. గత కొన్ని రోజుల క్రితమే ఎపీ ఎఫ్‌డీసీ చైర్మన్, నటుడు పోసాని కృష్ణమురళీ వివాదాస్పద వ్యాఖ్యలను మర్చిపోకముందే సినీ నిర్మాత ఆది శేషగిరి రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాలకు అనుకూలంగా ఉన్న వారికే నంది అవార్డులను ప్రదానం చేస్తున్నారంటూ కామెంట్స్ చేశారు.
మే31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా 'మోసగాళ్లకు మోసగాడు' సినిమాను రీరిలీజ్ చేయనున్నట్టు ఆది శేషగిరి రావు వెల్లడించారు. ఈ సినిమాను 'పద్మాలయా స్టూడియో' విడుదల చేయనున్నట్లు ప్రకటించిన ఆయన.. ఎన్నిసినిమాలొచ్చినా ఈ మూవీ ఎప్పటికీ ప్రత్యేకమని చెప్పుకొచ్చారు. ఈ సినిమా తీసేందుకు ఎన్టీఆర్ స్ఫూర్తి అని, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ స్థాయికి వెళ్లాలనే ఉద్దేశంతోనే పద్మాలయా ఏర్పాటు చేశామని ఆది శేషగిరి రావు వెల్లడించారు.
'నంది అవార్డు'లపై కీలక వ్యాఖ్యలు
తెలుగు రాష్ట్రాలు విడిపోయాక 'నంది అవార్డు'లకు ప్రాధాన్యత తగ్గిపోయిందని ప్రొడ్యూసర్ ఆది శేషగిరిరావు ఆరోపించారు. రెండు తెలుగు ప్రభుత్వాలకు ఈ అవార్డు ఇవ్వడంపై ఆసక్తి లేదన్న ఆయన.. 'నంది అవార్డు'ల కంటే 'సంతోషం’ అవార్డులు ఘనంగా నిర్వహిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఒకప్పుడు 'నంది అవార్డు'లకు చాలా ప్రాధాన్యత ఉండేదని.. ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదని విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. అసలు తన ఉద్దేశంలో 'నంది అవార్డు'లకు ప్రాముఖ్యతే లేదంటూ ఆయన సంచలన కామెంట్స్ చేశారు.
అప్పట్లో పోసాని కృష్ణమురళి ఆగ్రహం
గతంలో పోసాని కృష్ణ మురళి కూడా నంది అవార్డులపై అసహనం వ్యక్తం చేశారు. ‘‘సినీ పరిశ్రమలో నంది అవార్డులకు ఎంతో ప్రత్యేకత ఉంది. గతంలో ఈ రెండు ప్రాంతాలకు ఈ రెండు, ఆ రెండు ప్రాంతానికి ఆ రెండు అవార్డులను ఇవ్వాలని అనుకునేవారు. దీనిపై నేను అప్పుడే ప్రశ్నించా. అందుకే పోసానికి నంది ఇవ్వకూడదు అనుకున్నారు. కొంత మంది రైటర్ లు, ఆర్టిస్టులు నందులను పంచుకునేవారు. అప్పట్లో ఓ సారి నంది అవార్డ్స్ ని అనౌన్స్ చేశారు. కానీ ఇవ్వలేదు. నాకు ‘టెంపర్’ మూవీకి నంది అవార్డు వచ్చింది. తప్పదు అన్నట్టుగా ఇచ్చారు. కానీ, తాను నందిని తిరస్కరించా. నాకు అది కమ్మ అవార్డు లాగా అనిపించింది. అందుకే దాన్ని తిరిగిచ్చేశా’’ అని అప్పట్లో వెల్లడించారు. నంది అవార్డుల అంశంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని, పాత వాళ్లకు ఇవ్వాలా? లేదా కొత్త వారితో కొత్తగా స్టార్ట్ చేయాలా? అనే విషయంపై త్వరలోనే చర్చించి నిర్ణయం తీసుకుంటామని కృష్ణమురళీ చెప్పుకొచ్చారు.
నంది అవార్డులపై గతంలోనూ పలువురు సినీ ప్రముఖులు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిభను కాకుండా.. కేవలం ప్రభుత్వాలకు అనుకూలంగా ఉన్న వారికే అవార్డుల పంపకాలు జరిగాయని విమర్శలు చేశారు. తాజాగా నిర్మాత ఆది శేషగిరిరావు కూడా ఈ తరహా కామెంట్సే చేయడంతో.. ఆయన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.