(Source: ECI/ABP News/ABP Majha)
The Life Of Muthu Movie Teaser : సామాన్యుడు ఎదురు తిరిగితే - శింబుతో మాయ చేసిన మీనన్
శింబు, గౌతమ్ మీనన్ కలయికలో రూపొందిన తాజా సినిమా 'ది లైఫ్ ఆఫ్ ముత్తు'. ఈ నెల 15న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నేడు టీజర్ విడుదల చేశారు.
కోలీవుడ్ యంగ్ స్టార్ శింబు (Simbu) కథానాయకుడిగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన తాజా సినిమా 'ది లైఫ్ ఆఫ్ ముత్తు' (The Life of Muthu Telugu Movie). ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ రోజు సినిమా టీజర్ విడుదల చేశారు.
'ది లైఫ్ ఆఫ్ ముత్తు' సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. తమిళంలో వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై ఇషారి. కె. గణేష్ భారీ ఎత్తున నిర్మించారు. సక్సెస్ ఫుల్ ప్రొడక్షన్ హౌస్ శ్రీ స్రవంతి మూవీస్ తెలుగులో ఈ సినిమాను విడుదల చేస్తోంది. 'ది లైఫ్ ఆఫ్ ముత్తు' టీజర్ (The Life of Muthu Telugu Movie Teaser) విషయానికి వస్తే... శింబును చాలా సామాన్య యువకుడిగా చూపించారు గౌతమ్ మీనన్ చూపించారు.
ఊరిలో, మంటల్లో కర్ర పట్టుకుని పరుగు తీయడం నుంచి సిటీలో ఒక హోటల్‌లో పని చేయడం వరకూ... ప్రతి సన్నివేశంలో ఎక్కడా శింబు కనిపించలేదు. తానొక స్టార్ అనేది మర్చిపోయి సామాన్య యువకుడిలా కనిపించారు. ఆ తర్వాత ఎదురు తిరగడం, వరుసపెట్టి హత్యలు చేయడం... ఎందుకు? అనే ఆసక్తి కలిగించింది. మొత్తం మీద శింబుతో కలిసి గౌతమ్ మీనన్ మాయ చేశారు. ముత్తు ప్రపంచంలోకి తీసుకు వెళ్లారు. ఏఆర్ రెహమాన్ సంగీతంలో పాట కూడా బావుంది.
'ది లైఫ్ ఆఫ్ ముత్తు' సినిమా గురించి 'స్రవంతి' మూవీస్ అధినేత రవి కిశోర్ మాట్లాడుతూ ''నేను తమిళ ట్రైలర్ చూశా. నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. చాలా పాజిటివ్‌గా ఉందని అనిపించింది. అందుకని, తెలుగులో విడుదల చేయడానికి హక్కులు తీసుకున్నా. తెలుగు టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది. శింబు నటన గురించి, దర్శకుడు గౌతమ్ మీనన్ టేకింగ్ గురించి, ఏఆర్ రెహమాన్ సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దర్శకుడితో పాటు శింబుకి సైతం తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇంతకు ముందు మా 'స్రవంతి' సంస్థలో 'నాయకుడు' , 'పుష్పక విమానం' , ' రెండు తోకల పిట్ట', రఘువరన్ బీటెక్' చిత్రాలు అనువదించి విడుదల చేశాం. అవి సంచలన విజయాలు సాధించాయి. ఆ జాబితాలో 'ది లైఫ్ ఆఫ్ ముత్తు' కూడా చేరుతుందని ఆశిస్తున్నాం. ఈ సినిమాతో అసోసియేట్ కావడం చాలా ఆనందంగా ఉంది. తెలుగు ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చే కాన్సెప్ట్ ఇది. ఈ నెల 15న భారీ ఎత్తున విడుదల చేస్తున్నాం'' అని తెలిపారు.
ఇటీవల కోలీవుడ్ సినిమాలు తెలుగులో తమిళ టైటిల్స్‌తోనే ఎక్కువగా విడుదల అవుతున్నాయి. తెలుగులో ఎటువంటి అర్థం లేకపోయినా... ఆ టైటిల్స్‌ను ఉంచుతున్నారు. కానీ, ఈ సినిమాకు టైటిల్ మార్చడం విశేషం. ముత్తు జీవితం అని అర్థం వచ్చేలా 'ది లైఫ్ ఆఫ్ ముత్తు' అని టైటిల్ పెట్టడం మంచి విషయమే.
శింబుకు తమిళనాట మాత్రమే కాదు... తెలుగులో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక, గౌతమ్ వాసుదేవ్ మీనన్ గురించి చెప్పనవసరం లేదు. తెలుగు ప్రేక్షకులలో సైతం తనకంటూ స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న దర్శకులలో ఆయన ఒకరు. తమిళంలో వీళ్ళిద్దరిది సూపర్ హిట్ కాంబినేషన్. ఇద్దరూ కలిసి రెండు సినిమాలు చేశారు. అక్కినేని నాగ చైతన్య హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన 'ఏ మాయ చేసావె', 'సాహసం శ్వాసగా సాగిపో' తమిళ వెర్షన్స్‌లో శింబు హీరో. 'ది లైఫ్ ఆఫ్ ముత్తు' సినిమా తమిళంలో గౌతమ్ మీనన్‌తో శింబు చేసిన మూడో సినిమా 'వెందు తనిందదు కాడు' (Vendhu Thanindhathu Kaadu) అన్నమాట.
శింబు సరసన సిద్ధీ ఇద్నాని (Siddhi Idnani) కథానాయికగా నటించిన ఈ సినిమాలో హీరో తల్లి పాత్రను రాధికా శరత్ కుమార్ చేశారు. ఈ చిత్రానికి కథ: బి. జయమోహన్, సంగీతం: ఏఆర్ రెహమాన్.