Tollywood OTT : తారల ఓటీటీ ఎంట్రీ.. హిట్టు కాదు ఫట్టే!
వెండితెరపై సత్తా చాటిన చాలా మంది స్టార్లు ఓటీటీలో మాత్రం డిజాస్టర్లను చవి చూశారు.
లాక్ డౌన్ పుణ్యమా అని ఓటీటీలకు డిమాండ్ బాగా పెరిగింది. పెద్ద పెద్ద సినిమాలు సైతం ఓటీటీలకు వస్తుండడంతో అందరి దృష్టి ఓటీటీలపైనే పడింది. స్టార్ హీరోలు, హీరోయిన్లు కూడా డిజిటల్ ఎంట్రీకి సిద్ధమవుతున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని 'ది ఫ్యామిలీ మ్యాన్ 2'తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకుంటుంది. అయితే సమంత కంటే ముందు కాజల్, తమన్నా, జగపతిబాబు లాంటి స్టార్స్ ఓటీటీలో ఎంట్రీ ఇచ్చారు కానీ దారుణంగా ఫెయిల్ అయ్యారు. వెండితెరపై సత్తా చాటిన చాలా మంది స్టార్లు ఓటీటీలో మాత్రం డిజాస్టర్లను చవి చూశారు. ఇలా ఓటీటీలో ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను నిరాశ పరిచిన తారలెవరో ఇప్పుడు చూద్దాం!
కాజల్ అగర్వాల్ :
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ 'లైవ్ టెలికాస్ట్' అనే సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చింది. దర్శకుడు వెంకట్ ప్రభు తెలుగు-తమిళ భాషల్లో ఈ సిరీస్ ను తెరకెక్కించారు. దర్శకుడిగా వెంకట్ ప్రభుకి మంచి పేరు ఉండడంతో ఈ సిరీస్ ఓ రేంజ్ లో ఉంటుందని ఆశించారు. కానీ ఈ లైవ్ టెలికాస్ట్ అంచనాలను రీచ్ అవ్వలేకపోయింది. కాజల్ కి ఈ డిజిటల్ డెబ్యూ నిరాశనే మిగిల్చింది.
ప్రియదర్శి :
కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసిన ప్రియదర్శి 'ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్' అనే సిరీస్ లో నటించారు. కథ మొత్తం ఆయన చుట్టూనే తిరుగుతుంది. రిలీజ్ కు ముందు చాలా హైప్ ను క్రియేట్ చేయగలిగారు. కానీ కంటెంట్ లో సత్తా లేకపోవడంతో ఈ సిరీస్ కి డిజాస్టర్ టాక్ వచ్చింది. ప్రియదర్శి నటన పరంగా ఆకట్టుకున్నప్పటికీ కథ ఆకట్టుకునే విధంగా లేకపోవడంతో ప్లాప్ అయింది.
తమన్నా :
తెలుగు-తమిళ భాషల్లో తెరకెక్కిన 'నవంబర్ స్టోరీ' సిరీస్ స్టోరీ లైన్ బాగానే ఉన్నప్పటికీ.. లాజిక్స్ మిస్ అవ్వడంతో సిరీస్ ప్లాప్ అయిపోయింది. హాట్ స్టార్ యాప్ లో ఈ సిరీస్ ను విడుదల చేశారు. దీనికంటే ముందు తమన్నా 'ఆహా' యాప్ కోసం 'లెవెన్త్ అవర్' అనే సిరీస్ లో నటించింది. అది కూడా నిరాశనే మిగిల్చింది.
జగపతిబాబు :
తెలుగులో ముందుగా వచ్చిన వెబ్ సిరీస్ 'గ్యాంగ్ స్టర్స్'. మహానటి చిత్ర నిర్మాతలు దీన్ని నిర్మించడంతో మంచి హైప్ వచ్చింది. జగపతిబాబు, నవదీప్, శ్వేతా బసు, జేడీ చక్రవర్తి లాంటి స్టార్స్ ఈ సిరీస్ లో నటించారు. అయినప్పటికీ కంటెంట్ సరిగ్గా లేకపోవడంతో సిరీస్ ప్లాప్ అయింది.
ఈషారెబ్బ, శృతిహాసన్ :
నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన ఆంథాలజీ కాన్సెప్ట్ 'పిట్టకథలు'లో ఈషారెబ్బ, శృతిహాసన్ లాంటి తారలు నటించారు. కానీ ఈ కథలు ఈ ఇద్దరు భామలకు సక్సెస్ ను తీసుకురాలేకపోయాయి.
శ్రీకాంత్ :
హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసిన శ్రీకాంత్ కూడా ఓటీటీపై దృష్టి పెట్టాడు. ఈ క్రమంలో ఆయన 'చదరంగం' అనే సిరీస్ తో ఎంట్రీ ఇచ్చారు. కానీ అది కాస్త ప్లాప్ అయింది. రీసెంట్ గా మెగాస్టార్ డాటర్ సుష్మిత కొణిదెల ప్రొడక్షన్ లో వచ్చిన 'షూట్ అవుట్ ఎట్ ఆలేర్' అనే సిరీస్ లో శ్రీకాంత్ నటించారు. కానీ ఇది కూడా ప్లాప్ అయి శ్రీకాంత్ ను నిరాశ పరిచింది.