Tamil Nadu: ముఖ్య నేతలతో వరుస భేటీలు- పొలిటికల్ ఎంట్రీపై విజయ్ కీలక చర్చలు!
తమిళ హీరో విజయ్ దళపతి రాజకీయాల్లోకి వచ్చే దిశగా అడుగు పడుతున్నాయి. ఇందులో భాగంగానే ముఖ్య నాయకులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు.
తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి ఎన్నో అద్భుత సినిమాల్లో నటించి టాప్ హీరోగా కొనసాగుతున్నారు. దేశం అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోలలో ఒకరిగా నిలిచారు. ఇంతకాలం తన సినిమాల ద్వారా ప్రేక్షకులను అలరించిన ఆయన, ఇకపై రాజకీయాల ద్వారా ప్రజా సేవ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే తన అభిమాన సంఘాలను విజయ్ ప్రజా సంఘాలుగా మార్చారు. వీటి ద్వారా పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం పలువురు ముఖ్యనాయకులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం తమిళ రాజకీయ వర్గాల్లో విజయ్ హాట్ టాపిక్ గా మారారు.
అభిమాన సంఘం నాయకులతో విజయ్ భేటీలు
తాజాగా చెన్నై శివారు ప్రాంతం పనైయూరులో తన అభిమాన సంఘం ‘విజయ్ మక్కల్ ఇయ్యక్కం’కు చెందిన జిల్లాల చీఫ్ లతో ఆయన సమావేశమయ్యారు. మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. తొలి రోజున తిరువళ్ళూరు, అరియలూరు, పెరంబలూరు, దిండిగల్, సేలం, తేని జిల్లాలకు చెందిన నిర్వాహకులతో పలు అంశాల గురించి చర్చించారు. ఈ సమావేశం తర్వాత మక్కల్ ఇయ్యక్కం సభ్యులు కీలక విషయాలు వెల్లడించారు. “రాజకీయాల్లోకి వస్తే సినిమాల్లో నటించడం మానేస్తానని విజయ్ చెప్పారు. పూర్తిస్థాయిలో రాజకీయాలపైనే దృష్టి సారిస్తానన్నారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తున్నాం. ఆయన రాజకీయాల్లోకి వస్తే, కలిసి పని చేసేందుకు సిద్ధం ఉంటాం” అని తెలిపారు.
విద్యార్థులకు నగదు బహుమతులు అందించిన విజయ్
రాజకీయాలపై ఫోకస్ పెట్టిన విజయ్ ఇటీవల 10, 12వ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థులను సన్మానించారు. నియోజకవర్గస్థాయిలో మొదటి మూడుస్థానాల్లో నిలిచిన విద్యార్థులకు విజయ్ మక్కల్ ఇయ్యక్కం తరపున నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రాలు అందించారు. యువతీ యువకులు రేపటి పౌరులని, వారు జాగ్రత్తగా ప్రజా ప్రతినిధులను ఎంచుకోవాలని చెప్పారు. ఓటుకు నోటి విధానం అస్సలు మంచిది కాదన్నారు. ఈ సన్మాక కార్యక్రమం అప్పట్లో సంచలనం కలిగించింది. రాజకీయ వర్గాల్లోనూ, టీవీ ఛానల్లో పెద్ద డిబేట్ జరిగింది. ఇపుడు అన్ని నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నేతలతో వరుసగా భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
తమిళ సమస్యలపై లోతుగా చర్చ
తాజా సమావేశాల్లో విజయ్ తమిళనాడులోని పలు అంశాలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ జరుగుతున్న పరిణామాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి కూలంకషంగా చర్చించినట్లు సమాచారం. అంతేకాదు, రాజకీయాల్లోకి అడుగు పెడితే తీసుకోవాల్సిన రాజకీయ పరమైన అంశాల గురించి లోతుగా చర్చించారట. ఇప్పటి వరకు ఈ సమావేశాల్లో 15 జిల్లాలకు చెందిన విజయ్ ప్రజా సంఘం నిర్వాహకులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. వరుస భేటీల నేపథ్యంలో విజయ్ పొలిటికల్ ఎంట్రీ పక్కా అనే టాక్ తమిళ నాట జరుగుతోంది. త్వరలోనే తన పొలిటిక్ ఎంట్రీపై విజయ్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు.
Read Also: ‘ధైర్యమే జయం’ అంటూ ‘మహావీరుడు’ని ముందుకు నడిపిస్తున్న రవితేజ!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial