Super Star Krishna Passes Away : కృష్ణ భోజనప్రియుడు - ఆయనకు ఇష్టమైన వంటలు ఏవో తెలుసా?
Actor Krishna Favorite Food : సూపర్ స్టార్ కృష్ణ భోజన ప్రియుడని అందరూ అంటారు. కానీ, విజయ నిర్మల మాత్రం వేరుగా చెప్పారు. ఆయనకు ఇష్టమైన వంటలు ఏవో తెలుసా? ఫుడ్ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకునే వారంటే?
సూపర్ స్టార్ కృష్ణ (Super Star Krishna) భోజన ప్రియుడు అని, ఆయన ఆహారాన్ని ఆస్వాదిస్తూ తింటారని తెలుగు చిత్రసీమలో ప్రముఖులు చెబుతుంటారు. కానీ, అది అబద్దమని సతీమణి విజయ నిర్మల (Vijaya Nirmala) ఓ సందర్భంలో తెలిపారు.
అన్నం తక్కువ...
కూరలు ఎక్కువ!
''నిజం చెప్పాలంటే... కృష్ణ భోజన ప్రియులు కాదు. ఆయన అసలు అన్నం ఎక్కువ తినరు. కూరలు మాత్రం ఇష్టంగా తింటారు'' అని విజయ నిర్మల పేర్కొన్నారు. కృష్ణ కథానాయకుడిగా పరిచయమైన 'తేనె మనసులు' విడుదలై 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కృష్ణ గురించి ఈ విషయాలు చెప్పుకొచ్చారు.
కృష్ణకు ఇష్టమైన వంటలు
Tollywood Actor Krishna Favourite Food : కృష్ణకు తందూరీ చికెన్ అంటే మహా ఇష్టం. ఆయన ఎక్కువ తినే కూరల్లో ఫిష్ (చేపలు) ఒకటి. తందూరీ చికెన్ అంటే హోటల్స్ నుంచి ఆర్డర్ చేసేవారని అనుకుంటారేమో!? ఇంటిలో ప్రత్యేకంగా వంట చేయించేవారు. కృష్ణకు ఉన్న అలవాట్లలో మరొకటి... ఇంటి భోజనం! ఆయన బయట ఫుడ్ అసలు తినరు. షూటింగ్స్ కోసం అవుట్ డోర్ వెళ్ళినప్పుడు కూడా తన కోసం ప్రత్యేకంగా వంట చేయించుకునేవారు.
కృష్ణ కోసం మొదలై...
యూనిట్ అందరికీ!
అమెరికాలో 'హరే కృష్ణ... హలో రాధా', రాజస్థాన్ ఎడారిలో 'కురుక్షేత్రం' సినిమాలు షూటింగ్స్ జరిగినప్పుడు కృష్ణను తాను స్వయంగా వంట చేసి పెట్టానని విజయ నిర్మల తెలిపారు. అప్పుడు ఆమె చేతి వంట తిన్న ఇతర ఆర్టిస్టులు కూడా రుచికి అలవాటు పడటమే కాదు... 'మాకు కూడా కొంచెం వండి పెట్టండి' అని అడిగిన సందర్భాలు ఉన్నాయని ఆమె వివరించారు.
Also Read : కొన్నేళ్ళుగా కృష్ణ దినచర్య ఇదే - ఆయన ఆరోగ్య రహస్యం ఏంటంటే?
కృష్ణ ఫుడ్ విషయంలో చాలా స్ట్రిక్ట్ డైట్ ప్లాన్ ఫాలో అయ్యేవారని సన్నిహితులు చెప్పేవారు. గత పదేళ్ళుగా ఆయన ఉదయం పూట ఒకటి లేదా రెండు ఇడ్లీలు, రాగి జావ... మధ్యాహ్నం కొద్దిగా భోజనం... రాత్రి పూట సగం చపాతీ, పళ్ళ రసాలు తీసుకునే వారు. తాను తినడం మాత్రమే కాదు... యూనిట్ సభ్యులకు, ఇతర ఆరిస్టులకు కూడా ఆప్యాయంగా కృష్ణ ఫుడ్ వడ్డించమని చెప్పేవారు.
ఎప్పుడూ సంతోషంగా...
కృష్ణకు డల్‌గా ఉండటం తెలియదు. ఆయన ఎప్పుడూ సంతోషంగా, నవ్వుతూ ఉండేవారు. పాత జోకులు చెబుతూ ఇతరుల్ని నవ్వించేవారు. సినిమా, స్టూడియో విషయాలను ఎప్పుడూ ఇంటి వరకు తీసుకు రావడం ఆయనకు అలవాటు లేని పని అని... ఆయనది స్వచ్చమైన, నిర్మలమైన మనసు అని కుటుంబ సభ్యులు తెలిపారు.
జాతకాలు నమ్మరు!
కృష్ణకు మూఢ నమ్మకాలు లేవు. ఆయన జాతకాలు, రాహుకాలం వంటి పట్టింపులు కూడా లేవు. ఎప్పుడైనా ఎక్కడైనా వెళ్తున్న సమయంలో ఎవరైనా రాహుకాలం అని చెప్పినా పట్టించుకునేవారు కాదు. ఆఖరికి పత్రికలలో ఆ కాలమ్ కూడా చదివే వారు కాదు. ఆయన అవార్డుల కోసం ఏనాడు ప్రయత్నించలేదు. నంది అవార్డులు, పద్మ అవార్డులలో ఆయనకు అన్యాయం జరిగిందని అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. కానీ, ఆయన వాటిని పట్టించుకోలేదు.
Also Read : ఓ తరం వెళ్ళిపోయింది - ఎన్టీఆర్, ఏయన్నార్, శోభన్ బాబు, కృష్ణంరాజు, ఇప్పుడు కృష్ణ