Mahesh Babu: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో మూవీ.. షెడ్యూల్ ఫిక్స్ చేసుకుంటున్న మహేష్ బాబు...
సంవత్సరాల తరబడి షూటింగ్స్ సాగుతున్న ఈ రోజుల్లో.... కేవలం 75 రోజుల్లో చిత్రీకరణ పూర్తిచేయడం సాధ్యమేనా.. లో బడ్జెట్ సినిమా కాదు....చిన్న హీరో సినిమా కాదు...మేం చెబుతున్నది పెద్ద ప్రాజెక్టు గురించి....
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం...ఈ కాంబినేషన్ చెప్పగానే ప్రేక్షకుల మొహంపై చిరునవ్వు వికసిస్తుంది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అతడు, ఖలేజా ఇప్పటికీ బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉన్నాయి. కాస్తంత చికాకులో ఉన్నప్పుడు అతడు, ఖలేజా సినిమాలు చూస్తే రిలాక్సైపోతాం అనే సగటు ప్రేక్షకుల సంఖ్య ఏక్కువే. అందుకే హిట్టా-ఫట్టా మాట పక్కనపెడితే ఈ కాంబినేషన్ సినిమా వస్తే చాలని ప్రేక్షకులు ఎదురుచూస్తుంటారు.
ఎప్పటి నుంచో మహేశ్-త్రివిక్రమ్ మూవీపై వార్తలొచ్చినా... ఈ మధ్యే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా కోసం స్క్రిప్టు వర్క్ పూర్తిచేసేశాడట మాటల మాంత్రికుడు. అటు మహేశ్ బాబు సర్కారువారి పాట షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ చిత్రీకరణ సెప్టెంబరు చివరినాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత వెంటనే త్రివిక్రమ్ సినిమాకు క్లాప్ కొట్టబోతున్నట్లుగా సినీ ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
ఇక్కడ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే... త్రివిక్రమ్ మూవీ కోసం 75 రోజుల పాటు మహేష్ బాబు వర్క్ చేయబోతున్నాడట. ఇందులో వింతేముంది అనుకోవద్దు... 75 రోజులు డేట్స్ ఇవ్వడం అన్నది విశేషం కాదు. కానీ విరామం లేకుండా 75 రోజులపాటు వరుసగా షూటింగ్‌లో పాల్గోంటారనదేది చర్చనీయాంశంగా మారింది. ఈ లెక్కన అక్టోబర్‌లో సినిమాను పట్టాలెక్కించి వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలోగా పూర్తి చేసి, సమ్మర్ కానుకగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ముచ్చటగా మూడోసారి త్రివిక్రమ్‌తో ప్రాజెక్ట్ చేస్తున్న మహేశ్ బాబు... హీరోయిన్ విషయంలోనూ అదే సెంటిమెంట్ పాటిస్తున్నాడని టాక్. ఇప్పటికే అతడు, సైనికుడులో త్రిషతో రొమాన్స్ చేసిన మహేశ్ బాబు.... త్రివిక్రమ్ మూవీకోసం మరో చెన్నై బ్యూటీని తీసుకోవాలని చూస్తున్నారట. సాధారణంగా మాటల మాంత్రికుడి మూవీలో ఇద్దరు హీరోయిన్లుంటారు... అందుకే పూజాహెగ్డే, త్రిష ఇద్దర్నీ ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఈ వార్తలపై మహేశ్ బాబు అభిమానులు ఒకింత టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే మహేశ్ బాబు-త్రిష కాంబినేషన్లో వచ్చిన అతడు ఓ మోస్తరుగా ఆడినా, సైనికుడు మాత్రం అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది. సక్సెస్ లేకపోవడంతో మళ్లీ ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందేమో అని మనసులో మాటను సోషల్ మీడియాలో కామెంట్ల రూపంలో చూపిస్తున్నారు.
ఆ సంగతంతా సరేకానీ.. ఎప్పుడూ లేనంతగా త్రివిక్రమ్ మూవీకి ఇంత హడావుడి ఎందుకంటారేమో... అందుకు మరో కారణం ఉంది. త్వరలోనే రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు నటించనున్నాడట. అందుకే వచ్చే సంక్రాంతికి సర్కారువారి పాట... వెంటనే సమ్మర్లో త్రివిక్రమ్ మూవీతో వచ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడట. ఎందుకంటే జక్కన్నతో మూవీ అంటే... సినిమా పూర్తి కావడానికి ఎంతకాలం పడుతుందో చెప్పలేం. పైగా మహేశ్ బాబు-రాజమౌళి కాంబినేషన్లో ఫస్ట్ మూవీ అంటే....హైప్ ఓ రేంజ్ లో ఉంటుంది. ఆ అంచనాలను అందుకోవాలంటే జక్కన్న ఏ రేంజ్‌లో తీస్తాడోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.