Srinivasa Murthy Death: మూగబోయిన ‘సింగం’ గొంతు - ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాసమూర్తి మృతి
ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్టు శ్రీనివాస మూర్తి కన్నుమూశారు. గుండెపోటుతో చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
సినిమా పరిశ్రమలో వరుస విషాదాలు కొనసాగుతున్నాయి. ఇటు సీనియర్ నటి జమున మరణ విషాదంలో టాలీవుడ్ మునిగిపోగా, అటు ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్టు శ్రీనివాస మూర్తి చనిపోయారు. చెన్నైలోని ఆయన నివాసంలో తుది శ్వాస విడిచారు. గుండెపోటుతో కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచారు.
వాయిస్ తో శ్రీనివాస మూర్తి మ్యాజిక్
తెలుగు, తమిళ సినిమా పరిశ్రమల్లో ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్టుగా శ్రీనివాస మూర్తి కొనసాగుతున్నారు. సినిమా పరిశ్రమలో డబ్బింగ్ ఆర్టిస్టుగా ఏండ్ల తరబడి ఆయన సేవలు అందిస్తున్నారు. ఎంతో మంది తమిళ స్టార్ హీరోలకు ఆయన తెలుగులో డబ్బింగ్ చెప్పారు. సూర్య, అజిత్, మోహన్ లాల్, రాజశేఖర్, విక్రమ్ లాంటి ప్రముఖ హీరోలకు ఆయన తెలుగు డబ్బింగ్ అందించారు. ఆయన వాయిస్ లోని బేస్ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకునేది. హీరోల నటనకు ఈయన వాయిస్ తోడై అద్భుతం పాత్రలు పేలిపోయేవి. ప్రేక్షకులు సైతం ఆయన డబ్బింగ్ కు ఫిదా అయ్యేవారు.
తమిళ స్టార్ హీరోలకు తెలుగు డబ్బింగ్
విక్రమ్ ‘అపరిచితుడు’, సూర్య ‘సింగం’ సిరీస్, ‘24’, మోహన్ లాల్ ‘జనతా గ్యారేజ్’, జయరామ్ సుబ్రమణియన్ ‘అల వైకుంఠపురంలో’ సినిమాలకు అద్భుతంగా డబ్బింగ్ చెప్పారు. హీరో రాజశేఖర్ నటించిన ఎన్నో సినిమాలకు ఆయన డబ్బింగ్ అందించారు. ఎన్నో గొప్ప సినిమాలు, ఎందరో స్టార్ హీరోలకు శ్రీనివాసమూర్తి వాయిస్ అందించారు. పాత్రకు తగ్గ వేరియేషన్ తో తన వాయిస్ తో మెస్మరైజ్ చేసే వారు. తన డబ్బింగ్ తోనే క్యారెక్టర్ కు సగం బలం అందించే వారు. ఆయన చెప్పే వాయిస్ చాలా నేచురల్ గా అంతకు మించి గాంభీర్యంగా ఉంటుంది. ఆయన వాయిస్ చెప్పిన చాలా సినిమాలు అద్భుత విజయాలను అందుకున్నాయి.
శ్రీనివాసమూర్తి మృతి పట్ల తెలుగు, తమిళ సినీ ప్రముఖుల దిగ్భ్రాంతి
శ్రీనివాసమూర్తి మృతి పట్ల తెలుగు, తమిళ సినిమా పరిశ్రమ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన లాంటి గొప్ప డబ్బింగ్ ఆర్టిస్ట్ కోల్పోవడం బాధగా ఉందన్నారు. చిన్న వయసులోనే గుండెపోటుతో చనిపోవడం పట్ల తోటి డబ్బింగ్ ఆర్టిస్టులు విచారం వ్యక్తం చేస్తున్నారు. శ్రీనివాస మూర్తిలాంటి గొప్ప డబ్బింగ్ ఆర్టిస్ట్ సినీ పరిశ్రమకు మళ్లీ దొరకడం కష్టమంటున్నారు. ఆయన మృతి పట్ల అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంచు కంఠంతో ఆయన చెప్పే డబ్బింగ్ ఇకపై సినిమాల్లో వినిపించబోదని బాధపడుతున్నారు. కళామతల్లి బిడ్డ ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు.
చెన్నైలోనే శ్రీనివాసమూర్తి అంత్యక్రియలు!
అటు శ్రీనివామూర్తి అంత్యక్రియల గురించి ఆయన కుటుంబ సభ్యులు ఎలాంటి విషయాలు వెల్లడించలేదు. ఇవాళ, లేదంటే రేపు చెన్నైలోనే తన అంతిమ సంస్కారాలు నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పిస్తున్నారు. పలువురు సినీ అభిమానులు సైతం ఆయన నివాసానికి చేరుకుని భౌతిక కాయానికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు.
Read Also: సీనియర్ నటి జమున మృతిపై సినీ ప్రముఖుల నివాళి