Sarkaaru Noukari Movie: డైరెక్షన్ చేయడానికి రెడీ అవుతున్న కాస్ట్యూమ్ డిజైనర్ - 'సర్కారు నౌకరి' రితీష ఇంటర్వ్యూ
Fashion Designer Retheshaa Reddy: ఇంజినీరింగ్ & ఫ్యాషన్ డిజైనింగ్ డిగ్రీ చేసిన రితీషా రెడ్డి... 'సర్కారు నౌకరి'కి కాస్ట్యూమ్ డిజైనర్‌గా వర్క్ చేశారు. తన గురించి చెప్పిన విశేషాలు ఆమె మాటల్లో...
తెలుగు చిత్రసీమకు ప్రముఖ గాయని సునీత కుమారుడు ఆకాష్ గోపరాజు హీరోగా పరిచయం అవుతున్న సినిమా 'సర్కారు నౌకరి'. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు నిర్మాణంలో గంగనమోని శేఖర్ దర్శకత్వం వహించిన చిత్రమిది. నూతన సంవత్సరం కానుకగా జనవరి 1న థియేటర్లలో విడుదల అవుతోంది. ఈ చిత్రానికి రితీషా రెడ్డి కాస్ట్యూమ్ డిజైనర్. హీరో హీరోయిన్లతో పాటు కీలక పాత్రలకు ఆమె కాస్ట్యూమ్స్ రూపొందించారు. సినిమా విడుదల సందర్భంగా రితీష చెప్పిన సంగతులు...
చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే పిచ్చి...
సొంతంగా షార్ట్ ఫిలిమ్స్ డైరెక్ట్ చేశా, నటించా!
సినిమాలపై తనకు ఉన్న ఆసక్తి గురించి రితీష రెడ్డి మాట్లాడుతూ... ''నాకు బాల్యం నుంచి సినిమాలు అంటే పిచ్చి. ఏదో ఒక రూపంలో సినిమా రంగంతో మమేకం అవ్వాలని బలమైన కోరిక ఉండేది. ఒక వైపు బుద్ధిగా చదువుకుంటూ... కాలేజీలో లెక్చరర్లు చెప్పే పాఠాలు తలకెక్కించుకుంటూ... మరోవైపు షార్ట్ ఫిలిమ్స్ మీద వర్క్ చేసేదాన్ని. కర్మమా, ఇట్స్ ఇనఫ్, చెలియా ఒక బహుమతి, ఫేస్ బుక్ ఫెయిల్యూర్, లాంగ్ లి(లీ)వ్... తదితర షార్ట్ ఫిల్మ్స్ స్వయంగా రాసి, డైరెక్ట్ చేశా. వాటిలో కొన్నిటిలో నేను నటించాను కూడా. ఇంట్లో తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా ఉంది. పెళ్ళైన తర్వాత మా ఆయన ప్రోత్సాహం కూడా లభించింది. దాంతో సినిమా రంగం వైపు అడుగులు వేశా'' అని చెప్పారు.
'సర్కారు నౌకరి' అవకాశం ఎలా వచ్చిందంటే?
రాఘవేంద్రరావు నిర్మించిన 'సర్కారు నౌకరి' అవకాశం తనకు ఎలా వచ్చిందనే రితీషా రెడ్డి వివరిస్తూ... ''ఈ చిత్రానికి ప్రముఖ దర్శకులు వి.ఎన్. ఆదిత్య గారు కో ఆర్డినేటర్. నేను తీసిన షార్ట్ ఫిల్మ్స్ కొన్ని ఆయన చూశారు. చాలా ఇంప్రెస్ అయ్యి నా గురించి రాఘవేంద్ర రావు గారికి చెప్పారు. దర్శకేంద్రులు కూడా ఒకటి రెండు చూసి నన్ను మెచ్చుకుని... నాకు డైరెక్షన్ ఛాన్స్ ఇస్తానని మా టీమ్ మీటింగ్‌లో చెప్పడం ఎప్పటికీ మర్చిపోలేను. ఇప్పటికీ ఆయన చెప్పిన మాటలు నమ్మశక్యం కాకుండా ఉన్నాయి. స్వతహాగా నేను రైటర్ కావడం, యాక్టింగ్ & డైరెక్షన్ చేయడం వల్ల కాస్ట్యూమ్ డిజైనర్ జాబ్ ఈజీ అయ్యింది. ఈ సినిమా ద్వారా రాఘవేంద్ర రావు గారి కాంప్లిమెంట్స్ వచ్చాయి. అవి జీవితాంతం గుర్తు పెట్టుకుంటా'' అని చెప్పారు.
Also Read: పాపం కోలీవుడ్ స్టార్ విజయ్... దళపతిని బామ్మ గుర్తు పట్టలేదు
నా తొలి సినిమా సంపూర్ణేష్ బాబు 'బజార్ రౌడీ'
తెలుగు చిత్రసీమలో తన ప్రయాణం గురించి రితీషా రెడ్డి మాట్లాడుతూ ''కాస్ట్యూమ్ డిజైనర్‌గా సంపూర్ణేష్ బాబు 'బజార్ రౌడీ' నా తొలి సినిమా. అందులో హీరోయిన్ మహేశ్వరికి కాస్ట్యూమ్స్ డిజైనర్ చేశా. ఇంకా కొన్ని సినిమాల్లో పాటలకు, పలువురు బిగ్ బాస్ పార్టిసిపెంట్లకు కూడా పని చేశా. ఆ తర్వాత 'సర్కారు నౌకరి' దర్శకుడు గంగనమోని శేఖర్ దర్శకత్వం వహించిన 'పంచతంత్ర కథలు' సినిమాతో పూర్తి స్థాయి కాస్ట్యూమ్ డిజైనర్‌గా మారానుపలువురు సెలబ్రిటీలకు కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తూ... అతి త్వరలో నా దర్శకత్వంలో సినిమా ప్రారంభించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాను'' అని చెప్పారు.
Also Read: ముట్టుకోవద్దని చెప్పాను కదరా... ప్రభాస్‌ను వాడుకున్న పోలీసు
క్యారెక్టరైజేషన్, సన్నివేశానికి తగ్గట్టు కాస్ట్యూమ్స్ డిజైన్ చేయడం తన స్టైల్ అని చెప్పే రితీషా రెడ్డి... ఒక వైపు ఇద్దరు పిల్లలను చూసుకుంటూ, మరో వైపు హైదరాబాద్ సుచిత్ర సర్కిల్‌లో గల 'రితీష రెడ్డి లేబుల్' బొటిక్ నిర్వహిస్తున్నారు.