Samantha: ఈ ఇయర్ బెస్ట్ మూవీ ఇదే, మమ్ముట్టి చిత్రంపై సమంత ప్రశంసలు
Samantha: మమ్ముట్టి, జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం 'కాథల్ ది కోర్’. ఈ సినిమాపై సమంత ప్రశంసల జల్లు కురిపించింది. ఈ ఇయర్ బెస్ట్ మూవీ ఇదే అని వెల్లడించింది.
Samantha On Kaathal The Core Movie: మళయాల మెగాస్టార్ మమ్ముట్టి వరుస హిట్లతో ఫుల్ జోష్ లో కొనసాగుతున్నారు. ‘నాన్ పాకల్ నేరతు మాయక్కమ్’, ‘క్రిస్టోఫర్’, ‘కన్నూర్ స్క్వాడ్’ సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్నారు. తాజాగా ఆయన కోలీవుడ్ నటి జ్యోతికతో కలిసి ‘కాథల్ ది కోర్’ అనే చిత్రంలో నటించారు. స్వలింగ సంపర్కుల పట్ల ఈ సొసైటీ ఎలా ప్రవర్తిస్తుంది అనే అంశాన్ని ఆధారంగా చేసుకుని జియో బాబీ ఈ సినిమాను తెరకెక్కించారు. నవంబర్ 23న విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ తో రన్ అవుతోంది. వసూళ్ల పరంగానూ దూసుకెళ్తోంది.
'కాథల్ ది కోర్’ చిత్రంపై సమంత ప్రశంసలు
తాజాగా ఈ సినిమాను చూసిన సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ప్రశంసల జట్టు కురిపించింది. ఈ ఏడాది బెస్ట్ మూవీ ఇదే అంటూ కొనియాడింది. సోషల్ మీడియా వేదికగా తన రివ్యూను రాసుకొచ్చింది. “‘కాథల్ ది కోర్’ సినిమా చూశాను. చాలా అద్భుతంగా ఉంది. ఈ ఏడాది ఇదే బెస్ట్ మూవీ. అందరు తప్పకుండా చూడాల్సిన సినిమా. మమ్ముటి సర్, మీరు నా హీరో. ఇందులో మీ నటన ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ మూవీ ఫీల్ నుంచి ఇంకా బయటకు రాలేకపోతున్నా. మంచి సినిమా చూస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. లవ్యూ జ్యోతిక’’ అని రాసుకొచ్చింది. అటు ఈ సినిమా దర్శకుడు జియో బాబీని లెజెండ్ అంటూ సమంత ప్రశంసించింది. సమంత పోస్ట్ పై ‘కాథల్ ది కోర్’ నిర్మాణ సంస్థ స్పందించింది. ఆమె రివ్యూకు థ్యాంక్స్ చెప్పింది.
'కాథల్ ది కోర్’ కథ ఏంటంటే?
జార్జ్ (మమ్ముట్టి) బ్యాంకులో పని చేసి రిటైర్ అవుతారు. ఆయన భార్య ఓమన(జ్యోతిక)తో కలిసి తీకోయ్ అనే చిన్న గ్రామంలో జీవిస్తుంటారు. ఆ ఊరిలో ఎలక్షన్స్ వస్తాయి. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలని జార్జ్ నిర్ణయం తీసుకుంటారు. ఎన్నికల్లో నామినేషన్ కూడా వేస్తారు. ఈ సమయంలో ఓమన అతడి నుంచి విడాకులు కావాలని కోర్టుకు వెళ్తుంది. అంతేకాదు, డ్రైవింగ్ స్కూల్ నడిపే ఓ వ్యక్తితో జార్జ్ కు లైంగిక(స్వలింగ) సంబంధం ఉందని ఆరోపిస్తుంది. అందుకే తనకు విడాకులు ఇప్పటించాలని కోర్టును కోరుతుంది. ఈ ఆరోపణలను జార్జ్ తప్పుబడతారు. ఆ తర్వాత ఏం జరిగింది? అనేది సినిమాలో చూపించారు. ఈ సినిమా స్వలింగ సంపర్కాన్ని ప్రోత్సహించేలా ఉందంటూ కువైట్, ఖతార్ దేశాలు ఈ సినిమా ప్రదర్శనకు అనుమతి ఇవ్వలేదు.
ప్రస్తుతం సమంత సినిమాలకు విరామం తీసుకుంది. తన హెల్త్ మీద బాగా ఫోకస్ పెట్టింది. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. తన ఆరోగ్యంతో పాటు సినిమాలకు సంబంధించిన విషయాల గురించి స్పందిస్తుంది. సమంత చివరిసారిగా ‘ఖుషి’ సినిమాలో కనిపించింది. విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు.
Read Also: వింటేజ్ ఫీల్‌తో ‘డెవిల్‘ సెకెండ్ సింగిల్- ‘థిస్ ఇజ్ లేడీ రోజీ’ అంటూ ఎల్నాజ్ అందాల కనువిందు
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply