RRR Oscar Entry: ఆ సమయంలో చాలా నిరాశ చెందా, ‘ఆర్.ఆర్.ఆర్’ ఆస్కార్‌కు ఎంపికపై విజయేంద్ర ప్రసాద్ కీలక వ్యాఖ్యలు
రాజమౌళి తెరకెక్కించిన తాజా సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఈ మూవీ ఈసారి ఇండియా నుంచి ఆస్కార్ కు ఎంట్రీ ఇస్తుందని భావించారు. కానీ, ఆ అవకాశం దక్కపోవడంపై కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు.
రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన తాజా సినిమా ‘ఆర్ఆర్ఆర్’. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకుంది. తాజాగా జపాన్ లో విడుదలైన ఈ సినిమా అక్కడ కూడా వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. పీరియాడికల్ యాక్షన్ మూవీగా తెరకెక్కి ఈ సినిమా ఎన్నో రికార్డులను బ్రేక్ చేసింది. జపాన్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలవబోతోంది. ఇప్పటి వరకు రజనీకాంత్ ‘ముత్తు’ సినిమా మీద ఉన్న ఈ రికార్డును త్వరలోనే ‘ఆర్ఆర్ఆర్’ బ్రేక్ చేయబోతోంది.
ఆస్కార్ ఎంట్రీ దక్కకపోవడంపై నిరాశ చెందాను!
తాజాగా ఈ సినిమా ఆస్కార్ ఎంట్రీపై ‘ఆర్ఆర్ఆర్’ కథా రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆస్కార్ అవార్డు కోసం భారతదేశం నుంచి ఎంట్రీ కోసం ‘ఆర్ఆర్ఆర్’ను కాదని.. పాన్ నలిన్ గుజరాతీ చిత్రం ‘చెల్లో షో’ను ఎంపిక చేశారు. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తీసుకున్న ఈ నిర్ణయం పట్ల తాను చాలా నిరాశ చెందాననని విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. నిరాశకు గురైన మాట వాస్తవం అయినప్పటికీ తాను నిరాశను వ్యక్తం చేయలేనని తెలిపారు.
కనీసం రెండు నామినేషన్లు వచ్చే అవకాశం!
‘ఆర్ఆర్ఆర్’ మూవీ మల్టీపుల్ ఆస్కార్ నామినేషన్ లు పొందుతుందని US సినిమా డిస్ట్రిబ్యూటర్లు భారీగా ప్రచారం చేస్తున్నారు. దానికి తోడుగా న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ లో రాజమౌళి ఉత్తమ దర్శకుడిగా అవార్డు పొందారు. ఈ నేపథ్యంలో విజయేంద్ర ప్రసాద్ మరో ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించారు. 95వ అకాడమీ అవార్డులలో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి కనీసం 2 నామినేషన్లు వస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు.
‘ఆర్ఆర్ఆర్-2’ కథపై చర్చలు
మరోవైపు ‘ఆర్ఆర్ఆర్’ సీక్వెల్ పైనా కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఆర్ఆర్ఆర్-2 రూపొందించేందుకు ఆలోచిస్తున్నట్లు చెప్పారు. తన కొడుకు రాజమౌళి ఈ సినిమాకు తనను కథ రాయాలని కోరినట్లు చెప్పారు. ఇందుకోసం చర్చలు జరుగుతున్నట్లు వెల్లడించారు. త్వరలోనే ఈ సినిమా నిర్మాణంపై ఓ క్లారిటీ వస్తుందని వెల్లడించారు. విజయేంద్ర ప్రసాద్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు ఎన్నో ప్రతిష్ట్మాత్మక సినిమాలకు కథలు అందించారు. ప్రభాస్, రానా, అనుష్క శెట్టి నటించిన బాహుబలి చిత్రాలు, రాంచరణ్, కాజల్ అగర్వాల్ నటించిన ఫాంటసీ యాక్షన్ మగధీర, రవితేజ, అనుష్క శెట్టి నటించిన కాప్ డ్రామా విక్రమార్కుడు సహా తన కొడుకు దర్శకత్వం వహించిన చాలా సినిమాలకు ఆయన కథలు రాశారు. అటు బాలీవుడ్ మూవీస్ కు కూడా కొన్ని కథలు అందించారు. అక్షయ్ కుమార్, సోనాక్షి సిన్హా నటించిన రౌడీ రాథోడ్, సల్మాన్ ఖాన్ ఎమోషనల్ డ్రామా బజరంగీ భాయిజాన్ స్టోరీ రాశారు. కంగనా రనౌత్ పౌరాణిక చిత్రం సీత: ది అవతారం కోసం కూడా స్క్రిప్ట్ రాస్తున్నాడు. అటు విజయేంద్ర ప్రసాద్ ఈ ఏడాది జూలైలో రాజ్యసభకు నామినేట్ అయ్యారు.
Read Also: జపాన్ లో ‘ఆర్ఆర్ఆర్‘ వసూళ్ల సునామీ, రజనీకాంత్ ‘ముత్తు‘ రికార్డును చిత్తు చేసేనా?