RRR Films Making Video : 'ఆర్ఆర్ఆర్' గర్జన.. నెక్స్ట్ లెవెల్ లో!
ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్' గర్జన ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోంది.
'బాహుబలి' లాంటి సినిమా తరువాత దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తోన్న మరో భారీ బడ్జెట్ చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒక్క తెలుగు ప్రేక్షకులే కాకుండా దేశం మొత్తం ఈ యాక్షన్ డ్రామా కోసం ఎదురుచూస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్లు నెట్టింట్లో రికార్డులు సృష్టించాయి. ఇప్పటికే విడుదల కావాల్సిన సినిమా వాయిదా పడుతూ వస్తోంది. అయినప్పటికీ సినిమాపై అంచనాలు ఎంతమాత్రం తగ్గలేదు.
దాదాపు మూడు నెలల గ్యాప్ తరువాత ఈ సినిమా షూటింగ్ ను పునః ప్రారంభించారు. ఈ సందర్భంగా చిత్రబృందం 'ఆర్ఆర్ఆర్' మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. ''ఆర్ఆర్ఆర్ గర్జన'' అంటూ విడుదలైన ఈ వీడియో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. లాక్ డౌన్, షూటింగులు లేకపోవడంతో ఈ మధ్యకాలంలో సినిమాలకు సంబంధించి సరైన అప్డేట్స్ రాలేదు. కానీ 'ఆర్ఆర్ఆర్' మేకింగ్ వీడియో వదిలి సినీ అభిమానులను ఉర్రూతలూగించారు.
ఈ సినిమా సెట్స్ ఎలా ఉండాలో స్కెచ్ వేసుకొని ప్లాన్ చేసినప్పటి నుండి.. సినిమా విజువల్ స్థాయికి వచ్చేసరికి రాజమౌళి ఎలా ఈ ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అయ్యారో మేకింగ్ వీడియో ద్వారా తెలియజేశారు. జూనియర్ ఆర్టిస్ట్ లను ప్రిపేర్ చేయడం దగ్గర నుండి.. షాట్స్ ఓకే చేసేవరకు ప్రతీ విషయాన్ని రాజమౌళి దగ్గరుండి చూసుకున్నారు. కథా చర్చల్లో పాల్గొనడంతో పాటు సెట్ డిజైనింగ్ విషయంలో సాబు సిరిల్ కి ఇన్ పుట్స్ ఇస్తూ కనిపించారు.
సంగీత దర్శకుడు కీరవాణి, రైటర్ విజయేంద్రప్రసాద్, కాస్ట్యూమ్ డిజైనర్ రమా రాజమౌళి ఈ మేకింగ్ వీడియోలో కనిపించారు. ఈ వీడియో మొదలైన నలభైవ సెకన్ నుండి లీడ్ యాక్టర్లు రామ్ చరణ్, ఎన్టీఆర్ లను రివీల్ చేశారు. సినిమాలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఎలా ఉండబోతున్నాయో చిన్న ఉదాహరణగా ఈ వీడియో ఉంది. గాల్లో ఎగురుతూ రామ్ చరణ్ బాణం వేసే సీన్.. బైక్ ను స్పీడ్ గా టర్న్ చేస్తూ ఎన్టీఆర్ బయలుదేరే సన్నివేశాలు వీడియోకి హైలైట్ గా నిలిచాయి. ఇద్దరు హీరోలు ఒకరిచేతులను మరొకరు పట్టుకునే సీన్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది.
భారీ ఎత్తున వేసిన సినిమా సెట్స్, వందల మందితో యుద్ధ సన్నివేశాలు అదిరిపోయేలా ఉన్నాయి. చివరిగా ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవగన్, అలియా భట్ లను చూపిస్తూ ఒక్కో విజువల్ ను ప్లే చేస్తుంటే గూస్ బంప్స్ రావడం ఖాయం. మొత్తానికి ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్' గర్జన ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోంది. అక్టోబర్ 13న ఈ సినిమా విడుదలవుతుందని చిత్రబృందం ప్రకటించింది.