RGV Birthday: రేపు నా బర్త్ డే, ఎవరూ విష్ చేయకండి - ఆర్జీవీ ఆసక్తికర ట్వీట్!
ఆర్జీవీ ఎవరి అంచనాలకు అందరు. ఎప్పుడు ఎలా ఆలోచిస్తారో అంతుపట్టరు. తన మాట్లాడే మాటలు, తను చేసే చేష్టలు అన్నీ వింతగానే ఉంటాయి. తాజాగా తన బర్త్ డే సందర్భంగా ఆసక్తికర ట్వీట్ చేశారు.
తెలుగుతో పాటు హిందీ చిత్ర పరిశ్రమలోనూ దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. తెలుగులో నాగార్జునతో కలిసి ‘శివ’ సినిమా తీసి సంచలన విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో అగ్ర దర్శకులుగా కొనసాగుతున్న చాలా మంది ఆర్జీవీ దగ్గర పాఠాలు నేర్చుకున్న వాళ్లే. హిందీలోనూ అమితాబ్ బచ్చన్ లాంటి సూపర్ స్టార్స్ తో పలు సినిమాలు తెరకెక్కించి అద్భుత విజయాలు అందుకున్నారు.
నిత్యం వార్తల్లో నిలుస్తున్న రామ్ గోపాల్ వర్మ
ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారానే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. సినిమాలు, రాజకీయాలు, సామాజిక అంశాలు ఒకటేమిటీ, ప్రతి అంశంపై ఆయన మార్క్ స్పందన కనిపిస్తుంటుంది. విషయం ఏదైనా తన స్టైల్లో ట్వీట్లు చేసుంటారు. వాస్తవానికి ఆర్జీవీ మాట్లాడే ప్రతి మాట చాలా లాజిక్ గా ఉంటుంది. తనకు నచ్చినట్లుగా ఉండటం, తనకు నచ్చింది చేయడంలో ఆయన తర్వాతే మరెవరైనా అని చెప్పుకోవచ్చు. వాస్తవానికి తను చేసే పనులన్నీ అందరికీ నచ్చుతాయి. కానీ, బయటకు చెప్పలేరు. పైగా ఆయనపై విమర్శలు చేస్తుంటారు. కానీ, పరిశీలించి చూస్తే, తను చేసేది కరెక్ట్ అనిపిస్తుంది. తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
నా బర్త్ డే సందర్భంగా విషెస్ చెప్పకండి- ఆర్జీవీ
ఏప్రిల్ 7న ఆర్జీవీ బర్త్ డే. అయితే, తన బర్త్ డే సందర్భంగా ఎవరూ శుభాకాంక్షలు చెప్పకూడదని ఆయన ట్వీట్ చేశారు. విషెస్ అనేవి దేనికీ పనికి రానివన్నారు. “రేపు (7వ తేదీ) నా పుట్టిన రోజు. దయచేసి నాకు శుభాకాంక్షలు చెప్పకండి. విషెస్ అనేవి ఉచితం అయినవి, పనికి రానివి కూడా. నేను చౌకైన బహుమతులతో సరిపెట్టుకుంటాను. ఉచితం కంటే చౌక ఉత్తమం అని నా అభిప్రాయం” అంటూ ఆర్జీవీ ట్వీట్ లో రాసుకొచ్చారు.
Tmrw the 7 th is my happy birthday..Please don’t wish me ..That’s because wishes are free and useless ..I am ok with cheap gifts ..CHEAP is better than FREE
— Ram Gopal Varma (@RGVzoomin) April 6, 2023
రామ్ గోపాల్ వర్మ తాజాగా తన డిగ్రీ పట్టా అందుకున్నారు. డిగ్రీ పూర్తయ్యాక 37 ఏళ్లకు ఆయన సర్టిఫికేట్ తీసుకోవడం విశేషం. ఎవరైనా డిగ్రీ పాస్ కాగానే సర్టిఫికేట్ తీసుకుంటారు. కానీ, అలా తీసుకుంటే వర్మ ఎందుకు అవుతారు? తాజాగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అకాడమిక్ ఎగ్జిబిషన్‌కి వర్మ అతిథిగా వెళ్లారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ అధికారులు ఆయనను సన్మానించారు. అదే సమయంలో బీటెక్ డిగ్రీ పట్టాని అందించి ఆశ్చర్యపరిచారు. ఈ పట్టాను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో వర్మ పంచుకున్నారు. నిజానికి ఆర్జీవీ సినిమాల్లోకి రాకముందు బీటెక్ చదివారు. గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో సివిల్ ఇంజినీరింగ్ చేశారు. అయితే, తనకు చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే పిచ్చి. ఎప్పుడూ సినిమాల గురించే ఆలోచించే వారు. చదివాం అంటే చదివాం అన్నట్లు బీటెక్ కంప్లీట్ చేశారు. చివరకు మోస్తారు మార్కులతో బయటపడ్డారు. పాసయ్యాక కనీసం డిగ్రీ పట్టా కూడా తీసుకోలేదు.
Read Also: రావణాసుర To శాకుంతలం, ఏప్రిల్ లో థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలు ఇవే!