Ravi Teja: 'మానాడు' రీమేక్‌లో రవితేజ - నెగెటివ్ రోల్ అంటే ఒప్పుకుంటారా?
'మానాడు' సినిమాలో ఎస్ జె సూర్య పోషించిన పాత్ర కోసం రవితేజను తీసుకోవాలనుకుంటున్నారు.
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ(Raviteja) హిట్టు, ప్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. 'క్రాక్' సినిమా తరువాత మళ్లీ ఆ రేంజ్ హిట్ అందుకోలేకపోయారాయన. ఈ మధ్యకాలంలో ఆయన నుంచి వచ్చిన 'ఖిలాడి', 'రామారావు ఆన్ డ్యూటీ' అనే రెండు సినిమాలు వచ్చాయి. ఈ రెండూ కూడా వర్కవుట్ కాలేదు. ఇప్పుడు 'ధమాకా' రిలీజ్ కు సిద్ధంగా ఉంది.
2023కోసం 'రావణాసుర', 'టైగర్ నాగేశ్వరరావు' లాంటి సినిమాలను రెడీ చేస్తున్నారు. అలానే మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'వాల్తేర్ వీరయ్య' సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు రవితేజ. ఈ సినిమా కూడా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు రవితేజను ఓ రీమేక్ కోసం సంప్రదిస్తున్నారట. కోలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన 'మానాడు'ని తెలుగులో రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమా రీమేక్ హక్కులను సురేష్ ప్రొడక్షన్స్ దక్కించుకుంది. స్క్రిప్ట్ బాధ్యతలను దర్శకుడు హరీష్ శంకర్ కి అప్పగించారు. స్క్రిప్ట్ పూర్తయ్యే దశలో ఉంది. ఇక దర్శకత్వ బాధ్యతలు చాలా కాలం నుంచి కనిపించకుండా ఉన్న దశరథ్ కు ఇచ్చే ఛాన్స్ ఉందని టాక్. 'మానాడు' సినిమాలో శింబు చేసిన పాత్రను తెలుగులో సిద్ధు జొన్నలగడ్డకు ఇచ్చారట.
ఎస్ జె సూర్య పోషించిన పాత్ర కోసం రవితేజను తీసుకోవాలనుకుంటున్నారు. అదొక పోలీస్ ఆఫీసర్ రోల్. కానీ నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్ర. ఆ పాత్రలో చాలా షేడ్స్ ఉంటాయి. పెర్ఫార్మన్స్ కి స్కోప్ ఉన్న పాత్ర. కానీ నెగెటివ్ రోల్ అంటే రవితేజ ఒప్పుకుంటారా..? అనే ప్రశ్న తలెత్తుతోంది. మరి మాస్ రాజా ఒప్పుకొని తీరేలా హరీష్ శంకర్ ఏమైనా మార్పులు చేశారా అనేది అధికార ప్రకటన వచ్చాకే క్లారిటీ వస్తుంది.
రవితేజ 'ఈగల్':
ఇది కాకుండా.. రవితేజ మరో సినిమా ఒప్పుకున్నారు. అదే 'ఈగల్'. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘట్టమనేని ఇప్పుడు మెగాఫోన్ పట్టుకోవడానికి రెడీ అవుతున్నారు. రవితేజ హీరోగా ఓ సినిమా తెరకెక్కించబోతున్నారు. దీనికి 'ఈగల్' అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
అదేంటంటే.. ఈ సినిమా ఓ హాలీవుడ్ సినిమాకి ఫ్రీమేక్ అని టాక్. హాలీవుడ్ లో 'జాన్ విక్' సినిమాలు ఎంత పాపులరో తెలిసిందే. 2014లో వచ్చిన 'జాన్ విక్' కథను అడాప్ట్ చేసుకొని రవితేజతో తీయాలనుకుంటున్నారు కార్తిక్ ఘట్టమనేని. 'జాన్ విక్' సినిమాలకు సంబంధించి రీమేక్ రైట్స్ అమ్మే ఛాన్స్ లేదు. కాబట్టి రవితేజ సినిమా ఫ్రీమేక్ అనే చెప్పుకోవాలి. తెలుగుకి తగ్గట్లు కథలో మార్పులు, చేర్పులు చేసి.. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందించాలనేది దర్శకుడి ప్లాన్.
Also read: ఇనయా - సూర్యల మధ్య ఏం జరుగుతోంది? ప్రశ్నించిన నాగార్జున, ఇనయాకు క్లాస్?