RGV on Rajamouli:ఆ రెండు పనులతో రాజమౌళి ఇండస్ట్రీని నాశనం చేశారు: రామ్ గోపాల్ వర్మ
ఇటీవల రామ్ గోపాల్ వర్మ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా బడ్జెట్, టికెట్ ధరలు, ఓటీటీ వంటి విషయాలపైన మాట్లాడారు. దర్శకుడు రాజమౌళిపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు
టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్టైలే వేరు. ఆయన ఏం మాట్లాడినా అది సెన్సేషన్ అవుతూ ఉంటుంది. మనసులో ఉన్న మాట నిర్మొహమాటంగా బయటపెట్టేస్తుంటారాయన. అదే ఒక్కోసారి ఆయన్ను విమర్శలకు గురిచేస్తుంది. ఆయన లైఫ్ స్టైల్ కూడా పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అలాగే ఇండస్ట్రీకి సంబంధించి ఎలాంటి వార్తలు వచ్చినా వాటిపై స్పందిస్తుంటారు ఆర్జీవి. ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా బడ్జెట్, టికెట్ ధరలు, ఓటీటీ వంటి విషయాలపైన మాట్లాడారు. అంతే కాదు ప్రముఖ దర్శకుడు రాజమౌళిపై కూడా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రామ్ గోపాల్ వర్మ. ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ప్రతీ ఫ్రైడే నిర్మాతల ఓపీనియన్ మారిపోతుంది: ఆర్జీవి
ఇంటర్వ్యూలో ఆర్జీవి మాట్లాడుతూ.. సినిమా టికెట్లు రేట్లు విషయంలో ఇండస్ట్రీలో ప్రతీ శుక్రవారం ఓపీనియన్లు మారిపోతాయని అన్నారు. ఇండస్ట్రీలో ఉండే బడా నిర్మాతలు కూడా అదే ఆలోచిస్తారని అన్నారు. ‘ఆర్ఆర్ఆర్’ లాంటి పెద్ద సినిమాలు వచ్చినపుడు టికెట్ ధరలు ఎక్కువ ఉండాలని అనుకుంటారని, కానీ తరువాత వారం చిన్న సినిమాలు విడుదలైతే టికెట్ రేట్ తగ్గించాలా అని ఆలోచిస్తారని చెప్పుకొచ్చారు. ఇలా ప్రతీ వారం టికెట్ల రేట్ల విషయంలో వారి తాలూకూ ఆలోచనలు మారిపోతూ ఉంటాయని తెలిపారు.
అయితే టికెట్ రేట్లు పెంచడం వల్లే థియేటర్లకు రావడం లేదు అనడం సరికాదని, దానికి సరైన రీజన్ ఏంటో ఎవరూ చెప్పలేమన్నారు. ఓటీటీలు వచ్చిన తర్వాత థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదు అని కరెక్ట్ గా చెప్పలేమన్నారు. ఎందుకంటే ఆడియన్స్ కౌంట్ ను మనం లెక్కగట్టలేమని అది ఒక్కోసారి ఒక్కోలా ఉంటుందని చెప్పారు. థియేటర్లకు జనం రాకపోవడానికి టికెట్ రేట్లు, ఓటీటీలు మాత్రమే కారణం కాదని అన్నారు. ఎందుకంటే ఈరోజుల్లో ప్రేక్షకులకు వినోదాన్ని అందిచడానికి చాలా ఫ్లాట్ ఫామ్ లు అందుబాటులో ఉన్నాయని అన్నారు. వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఆలోచించాలని చెప్పారు. ఉదాహరణకు.. ఒక సినిమా విడుదల అయి నెగిటివ్ టాక్ తెచ్చుకుంటే దాన్ని 8 వారాల తర్వాత ఓటీటీకు ఇస్తామంటే ఓటీటీ వాడు ఎందుకు ఎక్కువ రేటుకు కొంటారు అని వ్యాఖ్యానించారు. అందుకే ఇది సమిష్టి సమస్యలా చూడకుండా.. నిర్మాతలు సినిమాను ఎక్కడ విడుదల చేయాలా అనేది ఎవరికి వారు నిర్ణయాలు తీసుకోవాలని చెప్పుకొచ్చారు.
రాజమౌళి ఆ పనులు చేసి ఇండస్ట్రీను నాశనం చేశారు
ఇదే ఇంటర్వ్యూలో ఆర్జీవి మాట్లాడుతూ.. రాజమౌళి చేసిన రెండు పనుల వలన ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదని అన్నారు. అందులో ఒకటి.. సినిమా బాగుంటే రూ.2 వేల కోట్లు చేస్తుందని ప్రూవ్ చేశారని అన్నారు. రెండోది.. రాజమౌళి ఇచ్చిన క్వాలిటీతో చూస్తే ఏ సినిమాను చూసినా అంతగా ఎక్కట్లేదని తెలిపారు. దీనివల్ల సినిమా బాగా తీయాలనే పోటీ పెరిగిందన్నారు. కన్నడ నుంచి వచ్చిన ‘కేజీఎఫ్ 2’ సినిమా అందుకు ఉదాహరణ అని చెప్పారు. ఇలాంటి సినిమాలు ఇంకా రావచ్చని తెలిపారు. ఇక్కడ సమస్య ఏంటంటే ఒకవైపు సినిమా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించాలి అంటూనే మరోవైపు భారీ బడ్జెట్ పెట్టకపోతే ‘ఆర్ఆర్ఆర్’ లాంటి సినిమాలు చేయలేమని అంటారని అన్నారు. అందుకే బడ్జెట్ తో పాటు ప్రేక్షకుడు మెచ్చే విధంగా సినిమాలో కంటెంట్ కూడా ఉండాలని అప్పుడే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని పేర్కొన్నారు.