RC 15 Song Budget: RC 15 నుంచి బిగ్ అప్డేట్, ఒక్క పాట కోసం అన్ని కోట్లా ?
శంకర్ ప్రస్తుతం రామ్ చరణ్ తో ఓ సినిమా తీస్తున్నారు. ఇప్పుడీ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
భారతీయ దర్శకుడు శంకర్ సినిమాలు గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. ఆయన సినిమా వస్తుందంటే చాలు అందరూ ఎదురు చూస్తుంటారు. కేవలం వినోదం మాత్రమే కాకుండా మంచి సందేశాన్నిచ్చేలా ఉంటాయి ఆయన సినిమాలు. బడ్జెట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా మూవీలో సాంగ్స్ పై కూడా ఆయన ప్రత్యేక దృష్టి పెడతారు. శంకర్ ప్రస్తుతం రామ్ చరణ్ తో ఓ సినిమా తీస్తున్నారు. ఆర్.సి15 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా పనులు సాగుతున్నాయి. ఇప్పుడీ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆర్.సి 15 లో ఒక పాట కోసం ఏకంగా 15 కోట్లు ఖర్చు చేస్తున్నారట. ఈ ఖర్చు దాదాపు 'కాంతార' సినిమా బడ్జెట్ కు సమానం అని ఇండస్ట్రీలో టాక్. అత్యంత ఖరీదైన పాటల్లో ఇది రెండొ స్థానంలో ఉండబోతోందని సమాచారం.
ఈ పాటలో రామ్ చరణ్ సరసన కియార అద్వానీ మెరవనుంది. ఈ సాంగ్ షూటింగ్ ను న్యూజిలాండ్ లో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. నవంబర్ 20 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు దాదాపు రెండు వారాలుపాటు ఈ పాట చిత్రీకరణ జరగనుంది. శంకర్ గతంలో దర్శకుడు 'రోబో' సినిమాలో కీలిమాంజారో, రోబో2.O సినిమాలో యంత్ర లోకపు సుందరివే, విక్రమ్ నటించిన 'ఐ' సినిమాలో లాడియో లాంటి భారీ బడ్జెట్ సాంగ్స్ ను చిత్రీకరించారు. ఇప్పుడీ వరసలోకి ఈ ఆర్.సి 15 లో పాట కూడా చేరనుంది. దీనికి ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తుండగా జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేయనున్నారు.
శంకర్, రామ్ చరణ్ సినిమాతో పాటు కమల్ హాసన్ తో భారతీయుడు సినిమాకు సీక్వెల్ కూడా తీస్తున్నారు. ఈ సినిమాను 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. దేశంలో ఉన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను రూపొందించనున్నారు. అయితే ప్రస్తుతం భారతీయుడు సీక్వెల్ ప్రాజెక్ట్ ను పక్కనబెట్టి మరీ రామ్ చరణ్ సినిమాను తీస్తున్నారట శంకర్. ఈ సినిమా ఎలా ఉండబోతుంది, ఎలాంటి జోనర్ లో తీస్తున్నారు అనే దానిపై చర్చ నడుస్తోంది. రాజకీయాల నేపథ్యంలోనే మూవీ ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నారని ఇన్ సైడ్ టాక్. అయితే మూవీ లో ఎలాంటి విజువల్స్ గ్రాఫిక్స్ ఉండవట, కేవలం కథ ఆధారంగానే సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. 'శివాజీ' సినిమా తర్వాత శంకర్ నుంచి మామూలు చిత్రాలు రాలేదు. మధ్యలో తీసిన 'స్నేహితుడు' కూడా రీమేక్ కావడంతో ఇప్పుడీ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఇక 'ఆర్.ఆర్.ఆర్' తో రామ్ చరణ్ రేంజ్ దేశవ్యాప్తంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో చరణ్ శంకర్ దర్శకత్వంలో పొలిటికల్ డ్రామా చేయడంతో మూవీ పై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రాన్ని నిర్మాత దిల్ రాజు కూడా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఆయన తీసిన సినిమాల్లో ఇదే భారీ బడ్జెట్ మూవీ. మరి ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తుందో చూడాలి.