Stree 2 Movie Trailer: నవ్విస్తూనే, భయపెడుతున్న ‘స్త్రీ 2’ - ట్రైలర్ చూస్తే వెన్నులో వణుకు పుట్టాలంతే!
ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ‘స్త్రీ 2’ ట్రైలర్ వచ్చేసింది. సుమారు రెండున్నర నిమిషాల వ్యవధి ఉన్న ఈ ట్రైలర్ నవ్విస్తూనే, భయపెడుతోంది. ఈ ట్రైలర్ లో తమన్నా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.
Rajkummar Rao’s Stree 2 Movie Trailer Out: 2018లో బాలీవుడ్ లో విడుదలై సూపర్ డూపర్ హిట్ అందుకున్న చిత్రం ‘స్త్రీ’. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ హారర్, కామెడీ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఏకంగా రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి అందరినీ ఆశ్చర్య పరిచింది. 6 సంవత్సరాల తర్వాత ఆ సినిమాకు సీక్వెల్ గా ‘స్త్రీ 2’ వస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ నవ్విస్తూనే, భయపెడుతూ ఆకట్టుకుంటుంది.
జనాలను గడగడలాడిస్తున్న ‘సర్కటే’ దెయ్యం
రాజ్ కుమార్ రావ్, శ్రద్ధా కపూర్ ‘స్త్రీ 2’ సినిమాలో జంటగా నటిస్తున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేస్తోంది. హారర్ చిత్ర నిర్మాణాలకు పెట్టింది పేరుగా నిలిచిన మాడక్ ఫిల్మ్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ మూవీ ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. అమర్ కౌశిక్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ లో సినిమా కథ ఏంటనే అంశంపై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఓ వైపు నవ్వులు పూయిస్తూనే, మరోవైపు భయంతో వణికించారు.
ఈ సినిమా కథ అంతా ‘సర్కటే’ అనే దెయ్యం చుట్టూ తిరుగుతుంది. కేవలం తల మాత్రమే ఉండే ఈ దెయ్యం స్థానికులను భయాందోళనకు గురి చేస్తుంది. ఈ దెయ్యం పీడను వదిలించేందుకు హీరో విక్కితో పాటు జానా, బిట్టు ఏం చేశారు అనేది ‘స్త్రీ 2’లో చూపించనున్నారు. భయంతో వణికిపోయే సీన్లతో పాటు హీరో అండ్ గ్యాంగ్ చేసే కామెడీ అందరినీ ఫుల్ గా నవ్వించింది. ట్రైలర్ లో తమన్నాను కూడా చూపించారు. ఇందులో ఆమె స్పెషల్ సాంగ్ చేస్తున్నట్లు గా అర్థం అవుతోంది.
‘స్త్రీ 2’ మూవీ గురించి..
‘స్త్రీ 2’ సినిమాలో రాజ్ కుమార్ రావ్, శ్రద్ధా కపూర్, పంకజ్ త్రిపాఠీ, అభిషేక్ బెనర్జీ, అపర్‌శక్తి ఖురానా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వీరందరూ ‘స్త్రీ’ సినిమాలోనూ నటించారు. చక్కటి నటన, అద్భుతమైన కామెడీ, అంతకు మించి హారర్ అప్పట్లో ‘స్త్రీ’ని బ్లాక్ బస్టర్ హిట్ చేశాయి. అప్పటి నుంచి ఈ సినిమా సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. 6 సంవత్సరాల తర్వాత ‘స్త్రీ’ సీక్వెల్ ఆడియెన్స్ ను అలరించబోతోంది.
ఆగష్టు 15న ‘స్త్రీ 2’ విడుదల
ఇక రాజ్ కుమార్ రావు ఈ ఏడాది ‘శ్రీకాంత్’, ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ రెండు సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. అటు పంకజ్ త్రిపాఠీ రీసెంట్ గా ‘మీర్జాపూర్ 3’ వెబ్ సిరీస్ లో కనిపించారు. ‘స్త్రీ 2’ సినిమా ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే రోజున అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘ఖేల్ ఖేల్ మేతో’ సినిమా విడుదల కానుంది. ఇక తెలుగులో రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్ కాంబోలో తెరకెక్కిన ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకురానుంది.