Rajinikanth Notice: ఇక నుంచి అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు - రజనీకాంత్ పబ్లిక్ నోటీస్!
తన అనుమతి లేకుండా పేరు, ఫొటో, వాయిస్‌ను ఉపయోగించకూడదని రజనీకాంత్ బహిరంగ ప్రకటన విడుదల చేశారు.
Notice from Rajinikanth: నటుడు రజనీకాంత్ అనుమతి లేకుండా అతని పేరు, ఫోటో, వాయిస్‌ని ఉపయోగించకూడదని నోటీసు జారీ చేశారు. ఒకవేళ అలా ఉపయోగిస్తే చట్టపరమైన, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని రజనీకాంత్ తరఫు న్యాయవాది సుబ్బయ్య యం.భారతి బహిరంగ ప్రకటన చేశారు.
‘రజనీకాంత్ అని పిలిచే శివాజీ రావ్ గైక్వాడ్ దశాబ్దాలుగా వివిధ చిత్రాలలో నటిస్తూ అత్యంత గౌరవనీయమైన నటుడిగా మారారు. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌తో విపరీతమైన విలువలున్న వ్యక్తిగా పేరు తెచ్చుకున్న రజనీకి తన పేరును దుర్వినియోగం చేస్తే పెద్ద నష్టమే. రజనీ కాంత్ తన స్టార్ స్టేటస్‌తో పాటు దానికి సంబంధించిన వివిధ హక్కులను కలిగి ఉన్నాడు. వివిధ ప్లాట్‌ఫారమ్‌లు, నిర్మాణ సంస్థల తరపున రజనీ పేరు, ఫొటోలు, వాయిస్‌ని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రచారం చేసేందుకు అక్రమంగా వినియోగిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది.
రజనీ సూపర్‌స్టార్. అతని వాయిస్, ఫోటోలు, పేరు మొదలైనవి ప్రత్యేకమైనవి. సరైన అనుమతి లేకుండా ఇతరులు వాటిని ఉపయోగించడం వల్ల ప్రజల్లో గందరగోళం ఏర్పడవచ్చు. తన పేరు, ఫోటోలు మొదలైనవాటిని వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే హక్కు రజనీకి మాత్రమే ఉంది. వాటిని మరెవరూ ఉపయోగించలేరు. ముందస్తు అనుమతి లేకుండా రజనీ పేరు, ఫొటోలు, వాయిస్‌ని వాడితే చట్టపరమైన, క్రిమినల్ చర్యలు తీసుకుంటాం‘ అని రజనీకాంత్ తరఫు న్యాయవాది సుబ్బయ్య యంభారతి బహిరంగ ప్రకటనలో పేర్కొన్నారు.
రజనీకాంత్ ప్రస్తుతం ‘జైలర్’ సినిమాలో నటిస్తున్నారు. ‘కోకో కోకిల’, ‘డాక్టర్’, ‘ బీస్ట్’ చిత్రాల దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు నటుడు సునీల్ కూడా ‘జైలర్’లో నటిస్తున్నారు. దక్షిణ భారతదేశంలోని అన్ని పరిశ్రమల నుంచి టాప్ స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు. కన్నడ హీరో శివరాజ్ కుమార్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈ సినిమాలో కనిపించనున్నారు.
వీరితో పాటు రమ్యకృష్ణ, వసంత్ రవి, వినాయకన్, యోగి బాబు కూడా ఈ సినిమాలో ఉన్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ‘జైలర్’లో నటిస్తుంది. అయితే రజనీకాంత్‌కు జోడిగా కనిపించనుందా? లేకపోతే మరేదైనా ప్రత్యేకపాత్రలో కనిపించనుందా అనేది తెలియరాలేదు.
ఈ సినిమా ఫస్ట్‌లుక్ వీడియోను సూపర్ స్టార్ రజినీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేశారు. జైలు బ్యాక్‌డ్రాప్‌లో జరగనున్న ఈ సినిమాలో రజినీకాంత్ ‘జైలర్’ పాత్రలో కనిపించనున్నారు. ఒక సెంట్రల్ జైలు నేపథ్యంలో 24 గంటల వ్యవధిలో జరిగే కథ ఇది అని పుకార్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సౌత్ ఇండియాలో మోస్ట్ డిమాండ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తమిళ నూతన సంవత్సరం సందర్భంగా 2023 ఏప్రిల్ 14వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అనుకున్న తేదీకి విడుదల అవుతుందో చూడాల్సి ఉంది.
'జైలర్' సినిమాలో రజనీకాంత్‌తో పాటు రమ్యకృష్ణ కూడా నటిస్తున్నారు. గతంలో వీళ్లిద్దరి కలయికలో చాలా హిట్ సినిమాలు వచ్చాయి. వీటిలో 'నరసింహ' ఎవర్ గ్రీన్ ఫిల్మ్. ఆ సినిమాలో నీలాంబరిగా రమ్యకృష్ణ చేసిన రోల్ నటిగా ఆమెకు మంచి గుర్తింపు తీసుకు వచ్చింది. ఇప్పటికీ రమ్యకృష్ణ బెస్ట్ రోల్స్ అంటే నీలాంబరి పాత్ర పేరే చాలా మంది చెప్తారు. చాలా సంవత్సరాల విరామం తర్వాత రజనీతో రమ్యకృష్ణ సినిమా చేస్తున్నారు.