Rajamouli Oscar Nomination : ఆస్కార్స్ నామినేషన్స్‌లో రాజమౌళి - 72 శాతం కన్ఫర్మ్
దర్శక ధీరుడు రాజమౌళికి ఆస్కార్ వచ్చే ఆస్కారం ఉందా? అవార్డు సంగతి పక్కన పెడితే... నామినేషన్ లభిస్తుందా? ఆయనకు నామినేషన్ వచ్చే అవకాశం ఎంత ఉంది? అంటే...
Oscar For Rajamouli : ''రాజమౌళికి ఆస్కార్ అవార్డు రావాలని కోరుకుంటున్నాను. ఆ పురస్కారానికి ఆయన అర్హుడు'' - శుక్రవారం రాత్రి ఢిల్లీలో జరిగిన ఓ ప్రోగ్రామ్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) చెప్పిన మాట. యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) తో కలిసి ఆయన నటించిన 'ఆర్ఆర్ఆర్' ఆస్కార్ బరిలో ఉండటంపై ఈ విధంగా స్పందించారు.
ఆస్కార్... ఆస్కార్... ఆస్కార్... ప్రపంచ సినిమాలో చాలా మంది అత్యున్నత పురస్కారంగా భావించే అవార్డు. ఒక్కసారైనా ఆస్కార్ అందుకోవాలని ఆశించే కళాకారులు, సాంకేతిక నిపుణులు ఎంతో మంది ఉన్నారు. మరి, రాజమౌళికి ఆ ఆస్కార్ వచ్చే ఆస్కారం ఉందా? అవార్డు సంగతి పక్కన పెడితే... నామినేషన్ లభిస్తుందా? ఆయనకు నామినేషన్ వచ్చే అవకాశం ఎంత ఉంది? అంటే... 72 శాతం అని చెప్పాలి.
న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి
'ఆర్ఆర్ఆర్' (RRR Movie) ఆస్కార్ అవార్డు అందుకుంటే చూడాలని భారతీయ ప్రేక్షకులు చాలా మంది ఆశ పడుతున్నారు. సినిమాతో పాటు రాజమౌళికి కూడా వస్తే బావుంటుందని కోరుకుంటున్నారు. అవార్డు రావాలంటే ముందుగా నామినేట్ అవ్వాలి కదా! నామినేషన్స్ వస్తాయా? అంటే... ఆ దిశగా, ఆస్కార్ లక్ష్యమే ఒక్కో అడుగు పడుతోంది.
ఆస్కార్ కంటే ముందు విదేశాల్లో పేరున్న ఫిల్మ్ ఫెస్టివల్స్‌కు 'ఆర్ఆర్ఆర్'ను పంపిస్తున్నారు. దేశభక్తి కథతో రాజమౌళి తీసిన యాక్షన్ ఎంటర్‌టైనర్ చూసి విదేశీయులు ఫిదా అవుతున్నారు. అవార్డులు ఇస్తున్నారు. ప్రతి ఏడాదీ (1935 నుంచి) న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డులు ఇస్తోంది. ఈ ఏడాది 'ఆర్ఆర్ఆర్'కు గాను ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి అవార్డు ఇచ్చారు. దాంతో ఆస్కార్‌కు రాజమౌళి నామినేట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
గత 22 ఏళ్ళల్లో 16 మంది!
న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ ట్రాక్ రికార్డ్ చూస్తే... గత 22 ఏళ్ళలో ఉత్తమ దర్శకుడిగా వాళ్ళు ఎంపిక చేసిన దర్శకుల్లో 16 మందికి ఆస్కార్ నామినేషన్ దక్కింది. దాన్నిబట్టి... ఆస్కార్‌కు రాజమౌళి నామినేట్ అయ్యే పర్సెంటేజ్ 72. సో... లెట్స్ వెయిట్ ఫర్ ది బెస్ట్.
Also Read : హానీ రోజ్‌తో లక్ష్మీ మంచు లిప్ లాక్, మోహన్‌లాల్‌తో ఫైట్ - 'మాన్‌స్టర్' సినిమా ఎలా ఉందంటే?
సన్‌సెట్ సర్కిల్ అవార్డుల్లో దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఉత్తమ దర్శకుడి విభాగంలో రన్నరప్‌గా నిలిచారు. 'ఆర్ఆర్ఆర్'కు గాను ఆయనకు అది తొలి ఇంటర్నేషనల్ అవార్డు. ఇప్పుడీ న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ ఇచ్చినది రెండో అవార్డు. తెలుగు చిత్ర పరిశ్రమలో అపజయం ఎరుగని దర్శకుడు ఎవరు? అంటే ప్రేక్షకులు అందరూ ముక్త కంఠంతో చెప్పే ఏకైక పేరు రాజమౌళి. ఆయన్ను దర్శక ధీరుడిగా ప్రేక్షక లోకం ప్రశంసిస్తోంది.
'బాహుబలి : ది బిగినింగ్', 'బాహుబలి : ది ఎండింగ్', 'ఆర్ఆర్ఆర్' చిత్రాలతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన రాజమౌళిని, ఇప్పుడు హాలీవుడ్ అవార్డులు వరించడం మొదలుపెట్టాయి. ఆస్కార్ కూడా రావచ్చు ఏమో! అందరి కోరిక ఫలించే రోజు త్వరలో వస్తుందేమో!?