Raja Raja Chora: ‘రాజ రాజ చోర’ చిత్రంపై తమిళ ప్రజలు ఆగ్రహం.. ఇది ఘోర అవమానం!
శ్రీవిష్ణు నటించిన ‘రాజ రాజ చోర’ చిత్రంపై తమిళ ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సినిమా టైటిల్‌ను మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.
హీరో శ్రీవిష్ణు నటించిన ‘రాజ రాజ చోర’ చిత్రం ట్రైలర్‌కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆగస్టు 19న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తోందని భావిస్తున్నారు. శ్రీవిష్ణు కామెడీ, హీరోయిన్ మేఘా ఆకాశ్ అందం.. ఈ చిత్రానికి హైలెట్ కానున్నాయి. తమిళ నటి సునయన కూడా చిత్రంలో మరో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ట్రైలర్‌లో ‘‘దీనికి సొల్యూషన్ చెప్పనా?’’ అంటూ ఆకట్టుకుంది.
అయితే, ఈ చిత్రం సినిమా టైటిల్‌పై తమిళ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఆ టైటిల్‌ను మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. ‘రాజ రాజ చోర’ టైటిల్ చోళ రాజ్య చక్రవర్తి ‘రాజరాజ చోళ’ రాజును అవమానించేలా ఉందని అంటున్నారు. మీ రాజులను కూడా ఇలా కించపరుస్తూ తమిళ సినిమాల టైటిళ్లు పెడితే మీరు ఊరుకుంటారా? అని ప్రశ్నిస్తున్నారు. ఈ సినిమాలో నటించిన తమిళ నటులపై కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాంటి టైటిల్ ఉన్న చిత్రంలో మీరు ఎలా నటిస్తున్నారు? టైటిల్ మార్చకపోతే మిమ్మల్ని బహిష్కరిస్తామని అంటున్నారు.
ఈ చిత్రం టైటిల్‌పై ఇప్పటివరకు తమిళ సినీ ఇండస్ట్రీ నుంచి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. అయితే, ఇటీవల విడుదల చేసిన ‘రాజ రాజ చోర’ ట్రైలర్‌ను చూసి తమిళ నెటిజనులు కామెంట్ల ద్వారా తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమిళ సినీ పరిశ్రమ పెద్దలు వెంటనే ఆ టైటిల్ మార్పించేలా చర్యలు తీసుకోవాలని తెలుపుతున్నారు. ఆ టైటిల్ తమిళ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తోందని అంటున్నారు.
తమిళ ప్రజలు తమ భాషను, మహనీయులను ఎంతగా గౌరవిస్తారో తెలిసిందే. ప్రాచీన భారతదేశంలో 10వ శతాబ్దానికి చెందిన చోళ చక్రవర్తిని రాజరాజ చోళగా పిలిచేవారు. తమిళ రాజులుగా కీర్తి పొందిన రాజరాజ చోళ.. దేశంలోని దక్షిణాది రాజ్యాలతోపాటు శ్రీలంక, మల్దీవుల్లోని కొన్ని భాగాలకు సామ్రాజ్యం విస్తరించారు. వారి తర్వాత రాజ్యాధికారం పొందిన చోళ రాజులు తమ సామ్రాజ్యాన్ని తమిళనాడుతోపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక, ఒరిశా, పశ్చిమ బెంగాల్ వరకు విస్తరించారు. ఇంత ఘన చరిత్ర కలిగిన చోళ రాజులను చోరులుగా పేర్కొనడం తగునా? ఇది ఘోర అవమానం అని తమిళ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి, ఆ చిత్రం దర్శకనిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రానికి హసిత్ గోలి దర్శకత్వం వహించారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా, కీర్తి చౌదరి క్రియేటివ్ నిర్మాత. తనికెళ్ల భరణి, రవిబాబు, కాదంబరి కిరణ్, శ్రీకాంత్ అయ్యంగార్, అజయ్ ఘోష్, వాసు ఇంటూరి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతాన్ని అందించారు.
‘రాజ రాజ చోర’ టీజర్: