(Source: Poll of Polls)
Puri Jagannadh - Police Security : పూరి జగన్నాథ్ ఇంటి వద్ద పోలీసుల భద్రత
'లైగర్' బాక్సాఫీస్ రిజల్ట్ ఇప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. దర్శకుడు పూరి జగన్నాథ్ ఇంటి దగ్గర పోలీసులు భద్రత కల్పించారు.
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ (Puri Jagannath) దర్శకత్వంలో రూపొందిన సినిమా 'లైగర్'. యువతలో విజయ్ దేవరకొండ క్రేజ్... 'ఇస్మార్ట్ శంకర్' వంటి సర్‌ప్రైజింగ్ సక్సెస్ తర్వాత పూరి తీసిన సినిమా కావడంతో విడుదలకు ముందు భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టు బిజినెస్ కూడా జరిగింది. కానీ, వసూళ్లు మాత్రం లేదు.
'లైగర్' ఫ్లాప్ కావడంతో పూరికి, డిస్ట్రిబ్యూటర్ & ఫైనాన్షియర్లకు మధ్య గొడవలు వచ్చాయి. అది కాస్తా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడంతో ఇప్పుడు పూరి జగన్నాథ్ ఇంటి దగ్గర పోలీసులు భద్రత కల్పిస్తున్నారు. అసలు వివరాల్లోకి వెళితే...
జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్‌లో డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను (శ్రీనివాస్ ఆడెపు - Warangal Srinu) మీద బుధవారం పూరి జగన్నాథ్ ఫిర్యాదు చేశారు. తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, మానసిక క్షోభకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. వరంగల్ శ్రీనుతో పాటు ఫైనాన్షియర్ జి. శోభన్ పేరునూ ఫిర్యాదులో రాశారు. తనకు, తన కుటుంబానికి వ్యతిరేకంగా హింసకు పాల్పడే విధంగా శోభన్ వ్యక్తులను ప్రేరేపిస్తున్నారని పూరి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎగ్జిబిటర్లు, బయ్యర్లకు వరంగల్ శ్రీను డబ్బులు ఇవ్వకుండా తన పరువుకు భంగం కలిగే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆయన ఆరోపించారు.
పూరి జగన్నాథ్ కంప్లైంట్ తీసుకున్న జూబ్లీ హిల్స్ పోలీసులు, ఆయన ఇంటి దగ్గర భద్రత కల్పించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్. రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. డిస్ట్రిబ్యూటర్లు పూరి ఇంటి ముందు ధర్నా చేయడానికి సిద్ధమైన నేపథ్యంలో, వాట్సాప్ గ్రూపుల్లో ఆ మేరకు సందేశాలు షికార్లు చేయడంతో ఆ విషయాన్ని పోలీసుల దృష్టికి పూరి తీసుకు వెళ్లారు.
తాను ప్రస్తుతం ముంబైలో ఉన్నానని, తాను ఇంటి దగ్గర లేని సమయంలో తన కుటుంబ సభ్యులకు డిస్ట్రిబ్యూటర్లు ఏదైనా హాని తలపెట్టవచ్చని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పూరి జగన్నాథ్ పేర్కొన్నారు. అందుకని, పోలీసులు భద్రత కల్పించారు.
'లైగర్' డిజాస్టర్ కావడంతో కోట్లకు కోట్లు పోసి 'లైగర్' డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కొన్న ఎగ్జిబిటర్లు, బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు తమకు పూరి జగన్నాథ్ డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరుతున్నారు. అగ్రిమెంట్ ప్రకారం తాను ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని పూరి చెబుతున్నారు. పరువు పోకూడదని డబ్బులు ఇవ్వడానికి సిద్ధమైతే... అతి చేస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు.
Also Read : కడుపులో బిడ్డతో సమంత పోరాటం - కలియుగ పద్మవ్యూహంలో 'యశోద', ట్రైలర్ చూశారా?
'పోకిరి' నుంచి 'ఇష్మార్ట్ శంకర్' వరకూ తనకు బయ్యర్స్ నుంచి డబ్బులు రావాల్సి ఉందని పూరి జగన్నాథ్ తెలిపారు. బయ్యర్స్ అసోసియేషన్ తనకు ఆ డబ్బులు వసూలు చేసి పెడుతుందా? అని ఆయన ప్రశ్నించారు. ధర్నా చేస్తే... చేసిన వాళ్ళ లిస్టు తీసుకుని, వాళ్ళకు తప్ప మిగతా వాళ్ళకు డబ్బులు ఇస్తానని పూరి పేర్కొన్నారు. హిందీ డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడాని పక్కాగా లెక్కలు చెప్పారని, తెలుగులో ఆ విధంగా లేదని ఆయన వివరించారు.