Puri Jagannadh Audio Leaked : ప్లాన్ ప్రకారమే పూరి ఆడియో లీక్ - ఎగ్జిబిటర్లకు ధమ్కీ!?
'లైగర్' ఫ్లాప్ కావడంతో ఎగ్జిబిటర్లకు, చిత్ర దర్శక నిర్మాత పూరి జగన్నాథ్‌కు లెక్కలు, డబ్బుల సరుబాటు విషయంలో రచ్చ జరుగుతోంది. ఈ విషయమై పూరి జగన్నాథ్ మాట్లాడిన ఆడియో క్లిప్ లీక్ అయ్యింది, వైరల్ అవుతోంది.
'ఇస్మార్ట్ శంకర్' విజయం తర్వాత పూరి జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వం వహించిన సినిమా 'లైగర్' (Liger Movie). ఇందులో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కథానాయకుడు. దీనికి ముందు ఆయన నటించిన 'వరల్డ్ ఫేమస్ లవర్', 'డియర్ కామ్రేడ్', 'నోటా' సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ... 'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం' తరహా హిట్ కాకపోయినా 'టాక్సీవాలా' పెట్టుబడి వెనక్కి తీసుకు వచ్చింది. అయినప్పటికీ పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ క్రేజ్ దృష్ట్యా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వాటిని తల్లకిందులు చేస్తూ 'లైగర్' డిజాస్టర్ అయ్యింది.
'లైగర్' ఫ్లాప్ కావడంతో సినిమా కొన్నవాళ్ళకు భారీ నష్టాలు వచ్చాయి. ఇప్పుడు తమ డబ్బులు వెనక్కి ఇవ్వమని గొడవ చేస్తున్నారు. అందుకు పూరి జగన్నాథ్ సరేనని అన్నారు. అయితే... కొంత టైమ్ అడిగారు. అందుకు, ఎగ్జిబిటర్లు రెడీగా లేరట! పూరి జగన్నాథ్ ఇంటి ముందు ధర్నా చేయడానికి రెడీ అవుతున్నారట. ఈ మేరకు వాట్సాప్‌లో ఓ మెసేజ్ చక్కర్లు కొడుతోంది. దానికి పూరి గురువు, సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు.
ప్రతి ఎగ్జిబిటర్ నాలుగు రోజులకు సరిపడ్డా దుస్తులు, నలుగురు మనుషులతో పూరి జగన్నాథ్ ఇంటికి రావాలని... ఎవరైనా రాకపోతే లిస్టులో వాళ్ళ పేరు తీసేసి, వాళ్ళ డబ్బులు వెనక్కి ఇవ్వమని ఆ మెసేజ్‌లో ఉంది. దాని తర్వాత పూరి జగన్నాథ్ వాయిస్ కూడా రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. అందులో పూరి కాస్త పరుషంగా ధిక్కార ధోరణిలో తన స్వరాన్ని వినిపించారు.
తాను డబ్బులు తిరిగి ఇవ్వవలసిన అవసరం లేకపోయినా బయ్యర్లు కూడా నష్టపోయారని తిరిగి ఇవ్వడానికి అంగీకరించానని, ఒక నెలలో ఇస్తానని అంగీకరించానని, అయినప్పటికీ అతి చేస్తే ఇచ్చేది ఇవ్వబుద్ధి కాదని పూరి జగన్నాథ్ పేర్కొన్నారు. పరువు కోసం డబ్బులు ఇస్తున్నామని, తన పరువు తియ్యాలని చూస్తే మాత్రం ఒక్క రూపాయి కూడా వెనక్కి తిరిగి ఇవ్వనని ఆయన స్పష్టం చేశారు. ఏంటి? బ్లాక్ మెయిల్ చేస్తున్నారా? అంటూ ప్రశ్నించారు.
'పోకిరి' నుంచి 'ఇష్మార్ట్ శంకర్' వరకూ తనకు బయ్యర్స్ నుంచి డబ్బులు రావాల్సి ఉందని పూరి జగన్నాథ్ తెలిపారు. బయ్యర్స్ అసోసియేషన్ తనకు ఆ డబ్బులు వసూలు చేసి పెడుతుందా? అని ఆయన ప్రశ్నించారు. ధర్నా చేస్తే... చేసిన వాళ్ళ లిస్టు తీసుకుని, వాళ్ళకు తప్ప మిగతా వాళ్ళకు డబ్బులు ఇస్తానని పూరి పేర్కొన్నారు. హిందీ డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడాని పక్కాగా లెక్కలు చెప్పారని, తెలుగులో ఆ విధంగా లేదని ఆయన వివరించారు.
పూరి జగన్నాథ్ కాల్ రికార్డ్ లీక్ అయ్యిందని సోమవారం ప్రచారం జరిగింది. ఓసారి ఆ వాయిస్ వింటే... ఎవరితోనో ఫోనులో మాట్లాడినట్టు లేదు. ఎవరికో వాట్సాప్‌లో పూరి వాయిస్ మెసేజ్ చేసినట్టు ఉంది. తన అభిప్రాయాన్ని, నిర్ణయాన్ని అందులో సూటిగా, స్పష్టంగా, కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేశారు. ఒక విధంగా ధర్నా చేయాలని ప్లాన్ చేస్తున్న బయ్యర్లకు, ఎగ్జిబిటర్లకు ధమ్కీ ఇచ్చారు. రూల్స్ ప్రకారం చూస్తే ఎవరికీ రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చేశారు. ఇప్పుడు బాల ఎగ్జిబిటర్ల కోర్టులో ఉంది. వాళ్ళు ధర్నా చేసినా ఉపయోగం లేనట్టే!
Also Read : 'కాంతార'కు కొత్త సమస్య - కాపీ చేసినందుకు లీగల్ నోటీసులు తప్పవా?
'ఇస్మార్ట్ శంకర్' విజయం ఇండస్ట్రీలో చాలా మందికి హుషారు ఇచ్చింది. హీరోలకు టిపికల్ క్యారెక్టరైజేషన్‌లతో కూడిన కథలు, సినిమాలు ఇస్తూ కొత్త ఇమేజ్ తీసుకు వచ్చే పూరి జగన్నాథ్ మళ్ళీ ఫామ్‌లోకి రావడంతో చాలా మంది సంతోషం వ్యక్తం చేశారు. ఆయన హిట్ ట్రాక్ ఎక్కడంతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించారు. 'లైగర్' విడుదల తర్వాత సీన్స్ రివర్స్ అయ్యింది. ఆ సినిమా విడుదలకు ముందు పూరితో 'జన గణ మణ' స్టార్ట్ చేసిన విజయ్ దేవరకొండ... 'లైగర్' ఫ్లాప్ కావడంతో పక్కన పెట్టేశారు.