Kantara Movie - Copyright violation : 'కాంతార'కు కొత్త సమస్య - కాపీ చేసినందుకు లీగల్ నోటీసులు తప్పవా?
'కాంతార' సినిమాకు వసూళ్ళు వస్తున్నాయి. ప్రేక్షకుల ప్రశంసలూ లభిస్తున్నాయి. ఈ తరుణంలో సినిమాపై లీగల్ కేసు నమోదు కావడం, నోటీసులు రావడం చిత్ర బృందానికి షాక్ అని చెప్పాలి.
రిషబ్ శెట్టి (Rishab Shetty) కథానాయకుడిగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన కన్నడ సినిమా 'కాంతార' (Kantara) విజయయాత్ర కొనసాగుతోంది. బాక్సాఫీస్ బరిలో భారీ వసూళ్లు నమోదు చేస్తోంది. భాషలకు, ప్రాంతాలకు అతీతంగా సినిమాను ప్రజలు ఆదరిస్తున్నారు.
'కాంతార' విజయంలో రిషబ్ శెట్టి నటన, దర్శకత్వం, భూత కోలతో పాటు సంగీతం కూడా ప్రముఖ పాత్ర పోషించింది. నేపథ్య సంగీతానికి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ తరుణంలో తమ బాణీని కాపీ చేశారంటూ లీగల్ నోటీస్ రావడం చిత్ర బృందానికి షాక్ అని చెప్పాలి. అసలు వివరాల్లోకి వెళితే...
'వరాహ రూపం'....
'నవరస'కు కాపీనా?
'కాంతార' సినిమాలోని పతాక సన్నివేశాల్లో వచ్చే 'వరాహ రూపం...' సాంగ్ ఉంది కదూ! అది తమ 'నవసర'కు కాపీ అని 'తైక్కుడం బ్రిడ్జ్' (Thaikkudam Bridge) మ్యూజిక్ బ్యాండ్ ఆరోపణలు చేసింది. తమకు మద్దతు ఇవ్వవలసిందిగా సోషల్ మీడియాలో నెటిజనులకు విజ్ఞప్తి చేసింది.
Varaha Roopam Copied From Navasara? : ''మా శ్రోతలకు మేము చెప్పేది ఏంటంటే... 'కాంతార' చిత్రానికి, మాకు ఎటువంటి సంబంధం లేదు. మా సాంగ్ 'నవసర', 'కాంతార'లోని 'వరాహ రూపం...' పాట మధ్య సారూప్యతలు పూర్తిగా కాపీ రైట్ చట్టాలను ఉల్లఘించడమే. ఇన్స్పిరేషన్, కాపీ... మా దృష్టిలో ఈ రెండిటి మధ్య గీత చాలా భిన్నమైనది. అలాగే, వివాదాస్పదమైనది కూడా! అందువల్ల, ఈ కాపీకి కారణమైన వాళ్ళపై మేం చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి రెడీ అవుతున్నాం'' అని సోషల్ మీడియాలో 'తైక్కుడం బ్రిడ్జ్' పేర్కొంది. ఆ పోస్టును 'కాంతార' సంగీత దర్శకుడు బి. అజనీష్ లోకనాథ్, నిర్మాత విజయ్ కిరగందూర్, సినిమా హీరో & దర్శకుడు రిషబ్ శెట్టికి కూడా ట్యాగ్ చేసింది. ఈ ఆరోపణలపై చిత్ర బృందం ఇంకా స్పందించలేదు.
'తైక్కుడం బ్రిడ్జ్'బ్యాండ్‌ను మలయాళ సంగీత దర్శకుడు గోవింద్ వసంత, గాయకుడు సిద్ధార్థ్ మీనన్ స్థాపించారు. మలయాళ హిట్ 'ప్రేమమ్', తమిళ హిట్ '96', సాయి పల్లవి 'గార్గి' తదితర చిత్రాలకు గోవింద్ వసంత సంగీతం అందించారు. కాపీ రైట్ ఆరోపణలను పక్కన పడితే... రోజు రోజుకూ 'కాంతార'ను ప్రశంసిస్తున్న ప్రముఖల జాబితా పెరుగుతోంది. తాజాగా ఈ జాబితాలోకి ప్రముఖ కథానాయిక పూజా హెగ్డే చేరారు. చివరి 20 నిమిషాలు అద్భుతమని పేర్కొన్నారామె. పూజా హెగ్డేకు చిత్ర బృందం థాంక్స్ చెప్పింది.
Also Read : థియేటర్లలో సందడికి పది చిత్రాలు రెడీ - తెలుగులో ఈ వారం చిన్న సినిమాలదే రాజ్యం
View this post on Instagram
'కాంతార' నిజమైన పాన్ ఇండియా సక్సెస్ సాధించిందని చెప్పవచ్చు. 'కెజియఫ్' వంటి పాన్ ఇండియా హిట్ చిత్రాన్నినిర్మించిన విజయ్ కిరగందూర్ మరోసారి పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయం అందుకున్నారు. తెలుగులో ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) కు చెందిన గీతా ఆర్ట్స్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ విడుదల చేసింది.
'కాంతార' సాధించిన విజయంతో దీనికి సీక్వెల్ (Kantara Sequel) లేదా ప్రీక్వెల్ (Kantara Prequel) చేసే అంశాలను పరిశీలిస్తున్నారు. ఆ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని స్వయంగా రిషబ్ శెట్టి చెప్పారు. అయితే... మరో సినిమా స్టార్ట్ చేయడానికి ముందు రెండు నెలలు విశ్రాంతి తీసుకోవాలని ఉందని, ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయాలని ఉందని ఆయన పేర్కొన్నారు.