Telugu Movies This Week : థియేటర్లలో సందడికి పది చిత్రాలు రెడీ - తెలుగులో ఈ వారం చిన్న సినిమాలదే రాజ్యం
This Week Theatre Release Telugu Movies: 'రామ్ సేతు', 'థాంక్ గాడ్' నుంచి విజయ్ సేతుపతి, సమంత నటించిన 'సూపర్ డీలక్స్', రాజేంద్ర ప్రసాద్ 'అనుకోని ప్రయాణం' వరకూ ఈ వారం థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలు
అక్టోబర్ నెలాఖరు వచ్చేసింది. ఈ నెలలో బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలు నమోదు చేసిన చిత్రాలు ఉన్నాయి. అక్టోబర్ ఆఖరి వారంలో మరిన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాయి. తెలుగుకు వస్తే... అందులో చిన్న సినిమాలదే రాజ్యం! ఏడెనిమిది చిత్రాలు అయితే వస్తున్నాయి. అయితే... వాటిని చూడటానికి ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా? రారా? అన్నదే ప్రశ్న! అసలు, ఈ వారం ఏయే సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి? (Telugu Movies Releasing In October 2022) అనేది చూస్తే...
తెలుగులోనూ 'రామ్ సేతు' విడుదల
అక్షయ్ కుమార్ కథానాయకుడిగా నటించిన హిందీ సినిమా 'రామ్ సేతు' (Ram Setu Movie). దీంతో టాలీవుడ్ హీరో సత్యదేవ్ హిందీ చిత్రసీమకు పరిచయం అవుతున్నారు. జాక్వలిన్ ఫెర్నాండేజ్, నుష్రత్ బరూచా, నాజర్ ఇతర తారాగణం. హిందీతో పాటు తెలుగులోనూ ఈ సినిమా వస్తోంది. మంగళవారం... అనగా ఈ రోజు దీపావళి సందర్భంగా ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. అజయ్ దేవగణ్, సిద్ధార్థ్ మల్హోత్రా హీరోలుగా నటించిన 'థాంక్ గాడ్' విడుదల కూడా ఈ రోజే. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయిక. మరో హిందీ సినిమా 'తారా వర్సెస్ బిలాల్' విడుదల కూడా ఈ రోజే.
పవన్ కళ్యాణ్ 'సర్దార్ గబ్బర్ సింగ్'లో విలన్‌గా నటించడంతో పాటు పలు హిందీ సినిమాలు చేసిన శరద్ కేల్కర్ ప్రధాన పాత్రలో నటించిన మరాఠీ సినిమా 'హర హర మహాదేవ్'. ఈ నెల 25న మరాఠీతో పాటు హిందీ, తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నట్టు తెలిపారు. అయితే.... హైదరాబాద్‌లో మరాఠీ షోస్ తప్ప థియేటర్లలో ఎక్కడా తెలుగు షోస్ లేవు. శివాజీ, బాజీ ప్రభువు దేశ్‌పాండే కథతో ఈ సినిమా రూపొందింది.
పునీత్ రాజ్ కుమార్ చివరి సినిమా 'గాంధాద గుడి' విడుదల సైతం ఈ వారమే... 28న! అయితే... తెలుగులో విడుదల చేయడం లేదు! ప్రస్తుతానికి ప్రేక్షకులకు కన్నడలో చూసే అవకాశం మాత్రమే ఉంది. ఇక, తెలుగు సినిమాలకు వస్తే...
విజయ్ సేతుపతి, సమంత, 'పుష్ప' ఫేమ్ ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ సినిమా 'సూపర్ డీలక్స్'. తెలుగులో డబ్బింగ్ చేశారు. థియేటర్లలో ఈ 28న (శుక్రవారం) విడుదల చేస్తున్నారు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న మరో సినిమా 'వెల్కమ్ టు తీహార్ కాలేజ్'.
'సొంతూరు', 'గంగపుత్రులు', 'ఒక రొమాంటిక్ క్రైమ్ కథ', 'ఒక క్రిమినల్ ప్రేమకథ' వంటి చిత్రాలు తీసిన పి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వం వహించిన సినిమా 'వెల్కమ్ టు తీహార్ కాలేజ్'. విద్యావ్యవస్థ నేపథ్యంలో రూపొందించారు.
Also Read : 'అమ్ము' రివ్యూ : చిత్రహింసలు పెట్టే, కొట్టే భర్తను భార్య భరించాల్సిందేనా? ఐశ్వర్య లక్ష్మీ సినిమా ఎలా ఉందంటే?
నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్, నరసింహరాజు, ప్రేమ, తులసి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'అనుకోని ప్రయాణం'. కరోనా కాలంలో ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్య జరిగే కథతో తెరకెక్కించారు. తన కెరీర్ బెస్ట్ సినిమాల్లో ఇదొకటని రాజేంద్ర ప్రసాద్ చెబుతున్నారు. ఈ 28న సినిమా విడుదలవుతోంది. సుమన్ ఓ పాత్రలో నటించిన 'నిన్నే చూస్తూ'... సుహాసినీ మణిరత్నం, షాయాజీ షిండే, రఘుబాబు తదితరులు నటించిన 'ఫోకస్' చిత్రాలు కూడా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. 'రుద్రవీణ', 'ఐడెంటిటీ' అనే మరో రెండు చిన్న చిత్రాలు ఉన్నాయి.