Mahesh Babu Emotional Note: మీరే నా ధైర్యం - మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్
కృష్ణ మరణించిన చాలా రోజుల తర్వాత తన తండ్రి గురించి భావోద్వేగంగా స్పందిస్తూ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు మహేష్.
టాలీవుడ్ సీనియర్ హీరో సూపర్ స్టార్ కృష్ణ ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మరణంతో టాలీవుడ్ మరో లెజెండ్ యాక్టర్ ను కోల్పోయింది. ఆయన కుటుంబం ఓ పెద్ద దిక్కును కోల్పోయింది. మహేష్ బాబుకు తన తండ్రి కృష్ణతో ఉన్న అనుబంధం ఎలాంటిదో అందరికీ తెలుసు. అయితే ఓకే సంవత్సరంలో తన కుటుంబంలో ముగ్గురు ముఖ్యమైన వ్యక్తులను కోల్పోవడంతో మహేష్ ఆ బాధను తట్టుకోలేకపోయారు. ముందు మహేష్ బాబు అన్నయ్య రమేష్ మృతి చెందారు. ఇటీవల తన తల్లి ఇందిరా దేవి మరణించింది. ఆమె చనిపోయిన కొన్ని రోజులకే తండ్రి కృష్ణ కన్నుమూశారు. దీంతో మహేష్ తీవ్ర మనోవేదనకు గురయ్యారు. కృష్ణ మరణించిన చాలా రోజుల తర్వాత తన తండ్రి గురించి భావోద్వేగంగా స్పందిస్తూ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు మహేష్.
ఈ నోట్ కు కృష్ణ పాత కాలం ఫోటోను జతచేస్తూ ఇలా రాశారు మహేష్ "మీ జీవితం ఎంతో గొప్పగా సాగిందో అంతే గొప్పగా నిష్క్రమించారు. అదంతా మీ గొప్పతనమే. ఎలాంటి భయాలు లేకుండా డేరింగ్ అండ్ డాషింగ్‌గా మీ జీవితాన్ని గడిపారు. అదే మీ వ్యక్తిత్వం. మీరే నాకు స్ఫూర్తి, ధైర్యం. ప్రతీ విషయంలోనూ నేను మిమ్మల్ని అనుసరిస్తూ వచ్చాను. అయితే ఇప్పుడు అవన్ని మీతోనే వెళ్లిపోయాయి. విచిత్రమేమిటంటే ఇప్పుడు నేను అనుభూతి చెందుతున్న ఈ బలం ఇంతకు ముందెప్పుడూ నాలో లేదు. నేను ఇప్పుడు నిర్భయంగా ఉన్నాను. మీ ఆశీస్సులు ఎప్పుడూ నాపై ఉంటాయి. మీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తాను. మిమ్మల్ని మరింత గర్వపడేలా చేస్తాను. లవ్ యూ నాన్న. నా సూపర్ స్టార్ మీరు’’ అంటూ మహేశ్ బాబు ట్విట్టర్‌లో ఎమోషనల్ పోస్ట్ చేశారు.
సూపర్ స్టార్ కృష్ణ తన కుమారుల రమేష్, మహేష్ లతో కూడా సినిమాలు చేశారు. ముఖ్యంగా మహేష్ బాబు తో కృష్ణ ఎక్కువ సినిమాలు చేశారు. మహేష్ బాబును ఇండస్ట్రీకి పరిచయం చేసి మంచి నడుడిగా తయారు చేశారు కృష్ణ. తండ్రిగానే కాకుండా నట గురువుగా, మార్గదర్శిగా మహేష్ సినీ జీవితంలో ఆయన కీలక పాత్ర పోషించారు. కృష్ణ సినిమాతోనే మహేష్ సినీ కెరీర్ మొదలుకావడం విశేషం. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన 'పోరాటం' సినిమాలో కృష్ణ తమ్ముడి పాత్రలో తొలిసారి మహేష్ బాబు బాల నటుడిగా సిల్వర్ స్క్రీన్ పై కనిపించారు. అలాగే కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ముగ్గురు కొడుకులు, కొడుకు దిద్దిన కాపురం సినిమాల్లో మహేష్ బాబు నటించారు. తర్వాత శంఖారావం, గూఢచారి 117, అన్నా తమ్ముడు.. సినిమాల్లో కృష్ణ తో కలసి నటించారు మహేష్. తర్వాత మహేష్ హీరో గా చేసిన రాజ కుమారుడు, వంశీ సినిమాల్లో కృష్ణ కీలక పాత్రల్లో కనిపించారు. అయితే కృష్ణ తన మనవడు గౌతమ్ తో కలసి ఓ సినిమాలో నటించాలని అనుకున్నారు. కానీ కోరిక నెరవేరలేదు.
— Mahesh Babu (@urstrulyMahesh) November 24, 2022