Prabhas BDay Special: ప్రభాస్ వెరీ పాజిటివ్ గురూ... కాదంటారా? అయితే ఓ లుక్కేయండి!
ప్రభాస్ పాన్ ఇండియా స్టార్. అది సినిమాలకు! మరి, పర్సనల్ లైఫ్‌లో? పాజిటివ్ గురూ! వెరీ వెరీ పాజిటివ్!! అందుకే, ఎప్పుడూ అంత హ్యాపీగా ఉంటాడు ఏమో!?
ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రభాస్ గురించి ఎవర్ని అడిగినా చెప్పేది ఒక్కటే... 'డార్లింగ్' అని! ఒక్క రాత్రిలో అతడికి ఆ ఇమేజ్ రాలేదు. ఓవర్ ద ఇయర్స్... అతడి మంచితనం, కల్మషం లేని మనస్తత్వం, వ్యక్తిత్వం గురించి దగ్గరగా చూసిన వ్యక్తులు చెప్పడం వల్ల వచ్చింది.
బహుశా... ప్రభాస్ వ్యక్తిత్వం, పాజిటివ్‌నెస్ అతడిని ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానించడానికి ఓ కారణమని చెప్పవచ్చు. ప్రభాస్‌ను ఆదర్శంగా తీసుకుంటే... అనుసరిస్తే... పర్సనల్ లైఫ్‌లో, ప్రొఫెషనల్ లైఫ్‌లో అంతా బావుంటుందేమో!? అందుకే, ప్రభాస్‌ను పాజిటివ్ గురూ అనేది! ఇంతకీ, ప్రభాస్‌లో ఈ క్వాలిటీస్‌ను మీరు గమనించారా?? వాటిపై ఓ లుక్ వేయండి!
లైఫ్‌లో లేజీగా ఉన్నా... వర్క్‌లో వద్దు!
ప్రభాస్ లేజీ ఫెలో... అతడికి బద్ధకం! ఈ మాట అన్నది ఎవరో తెలుసా? 'బాహుబలి' తీసిన రాజమౌళి! ప్రభాస్ హీరోగా ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ తీసిన దర్శకుడు అంత మాట అన్నాడంటే ఆలోచించాలి... ప్రభాస్ బద్ధకస్తుడు అయితే... 'బాహుబలి' ఎలా తీశారని? ప్రభాస్ బద్ధకం వల్లే 'బాహుబలి'ని ఐదేళ్లు తీశారా? అని! అయితే... రాజమౌళి మరో మాట కూడా చెప్పారు. పర్సనల్ లైఫ్‌లో బద్ధకంగా ఉంటాడు గానీ, ప్రొఫెషనల్ లైఫ్‌లో బద్ధకంగా ఉండదు అని! సో... వర్క్‌లో సక్సెస్ అవ్వాలంటే లేజీగా ఉండకూడదు.
ఇగోలకు దూరంగా... గర్వం లేకుండా!
రీసెంట్‌గా 'రొమాంటిక్' సినిమా ట్రైలర్ ప్రభాస్ రిలీజ్ చేశాడు. సాధారణంగా స్టార్ హీరోల చేత ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ వంటివి రిలీజ్ చేయించాలంటే... ముందుగా అడగాలి. 'రొమాంటిక్' ట్రైలర్ రిలీజ్ చేయమని ప్రభాస్‌ను ఎవరూ అడగలేదు. పూరి జగన్నాథ్ ట్వీట్ చూసి... ప్రభాసే ఏదో ఒకటి చేస్తానని పూరికి ఫోన్ చేశాడు. ప్రభాస్ ఎంత ఎత్తుకు వెళ్లినా... విజయాలు అందుకున్నా ఇగోలకు దూరంగా, గర్వం లేకుండా ఉంటాడని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. అంతే కాదు... ప్రభాస్ అందరితో సరదాగా ఉంటాడు. డ్రైవర్లతో సహా అందరినీ 'డార్లింగ్' అని పిలుస్తాడు. ఈ విషయం కూడా పూరి జగన్నాథ్ చెప్పారు. సో... విజయాలు తలకు ఎక్కించుకోకుండా మనిషిని మనిషిగా చూడాలని ప్రభాస్‌ను చూస్తే తెలుస్తుంది.
అతిథి దేవో భవ
'సాహో' షూటింగ్‌కు బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హైదరాబాద్ వచ్చినప్పుడు ప్రభాస్ పంపిన ఫుడ్ చూసి నోరెళ్లబెట్టింది. టేబుల్ మీద అన్ని రకాల వంటలను వడ్డించేసరికి ఆశ్చర్యపోయింది. ఇటీవల 'సలార్' షూటింగ్‌లో శ్రుతీ హాసన్ కూడా అంతే! ప్రభాస్ ఆతిథ్యం గురించి ప్రత్యేకంగా చెప్పింది. అతడు పంపిన బిర్యానీ చాలా బావుందంటూ కరీనా కపూర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఎవరో ఒక్కరు, ఇద్దరు కాదు... ప్రభాస్‌తో పనిచేసిన వ్యక్తులు, సన్నిహితులు అతడి ఆతిథ్యం గురించి ప్రత్యేకంగా చెబుతారు. మన పెద్దలు అతిథి దేవో భవ అన్నారు. మన ఇంటికి వచ్చిన అతిథులను దేవుడిలా చూసుకోమని చెప్పారు. ప్రభాస్ ఆ విషయంలో నిజంగా బాహుబలి.
స్వార్థం లేదు... పరిస్థితులను బట్టి మారడు!
'బాహుబలి'లో 'నా మాటే శాసనం' అని ఓ డైలాగ్ ఉంది. శివగామిగా నటించిన రమ్యకృష్ణ ఆ మాట చెబుతుంది. రియల్ లైఫ్‌లో ప్రభాస్ పర్సనాలిటీకి ఆ డైలాగ్ సరిపోతుంది. అతడు ఒక్కసారి మాట ఇచ్చాడంటే... అది శాసనం కింద లెక్కే! 'మిర్చి' సక్సెస్ తర్వాత ప్రభాస్ 'బాహుబలి' చేశాడు. దానికి ఐదేళ్లు పట్టింది. ఆ టైమ్‌లో వేరే సినిమాలు చేస్తే... అతడికి చాలా రెమ్యునరేషన్ వచ్చేది. కానీ, తనను నమ్మి అన్ని కోట్లు ఖర్చుపెడుతున్న నిర్మాతల గురించి ఆలోచించాడు. ఇచ్చిన మాటకు కట్టుబడి సినిమా చేశాడు. 'బాహుబలి'సక్సెస్ తర్వాత ప్రభాస్‌తో సినిమాలు చేయడానికి చాలామంది టాప్ డైరెక్టర్స్ ముందుకొచ్చారు. కానీ, ప్రభాస్ మాత్రం ఒక్క సినిమా తీసిన సుజీత్ దర్శకత్వంలో 'సాహో' చేశాడు. 'బాహుబలి'కి ముందు సుజీత్‌కు ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోలేదు. డబ్బు కంటే మాటకు విలువ ఇస్తాడు. వ్యక్తిత్వానికి ఇంపార్టెన్స్ ఇస్తాడు. తన స్వార్థం మాత్రమే చూసుకునే అలవాటు ప్రభాస్‌కు ఎప్పుడూ లేదు. పరిస్థితులను బట్టి అతడు ఎప్పుడూ మారలేదు. అదీ ప్రభాస్ అంటే!