Ponniyin Selvan 2: కమల్ హాసన్ ఆఫర్‌ను తిరస్కరించిన విక్రమ్ - ఎందుకంటే..
మణిరత్నం డైరెక్షన్ లో తెరకెక్కిన 'పొన్నియిన్ సెల్వన్ 2'కు ముందు కమల్ 'పీఎస్'లో ఆఫర్‌ను తిరస్కరించానని హీరో విక్రమ్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కమల్ తనను నచ్చిన పాత్రను ఎంచుకోమని కూడా చెప్పారన్నారు
Vikram : హిస్టారిక్ డ్రామా రెండో భాగం 'పొన్నియిన్ సెల్వన్ 2' ఏప్రిల్ 28న థియేటర్లలో విడుదల కానుంది. సినిమా విడుదలకు కేవలం మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున, ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో చిత్ర బృందం ఫుల్ బిజీగా ఉంది. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన నటుడు విక్రమ్.. ‘పొన్నియన్ సెల్వన్‘ పార్ట్ 2లో - ఆదిత కరికాలన్ పాత్రలో నటించారు. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ప్రచార ఇంటర్వ్యూలో మాట్లాడిన విక్రమ్... తాను ప్రారంభంలో 'పొన్నియిన్ సెల్వన్'లో నటించే అవకాశాన్ని తిరస్కరించినట్లు వెల్లడించారు.
గతంలో ఎమ్‌జి రామచంద్రన్ నుంచి 'పొన్నియిన్ సెల్వన్' హక్కులను పొందిన నటుడు కమల్ హాసన్ .. దాన్ని టీవీ సిరీస్ గా చేయాలని నిశ్చయించుకున్నారు. ఆ తర్వాత తనకు ఫోన్ చేసి 'పొన్నియన్ సెల్వన్' నవలను టీవీ సిరీస్ గా తీయాలనుకుంటున్నానని, అందులో నీకిష్టమైన పాత్ర ఏదైనా ఎంచుకోమని ఆఫర్ ఇచ్చినట్టు హీరో విక్రమ్ తెలిపారు. కానీ తాను చిన్న స్క్రీన్‌లో నటించే ఉద్దేశం లేదని, ప్రస్తుతానికి వెండితెరపై నటించడానికే ఇష్టపడుతున్నట్టు సున్నితంగా కమల్ ఆఫర్ ను తిరస్కరించినట్టు ఆయన పేర్కొన్నారు. అయితే ఆ సమయంలో 'పొన్నియన్ సెల్వన్' కథలో తనకు ఎలాంటి పాత్రనైనా ఎన్నుకునే స్వేచ్ఛను ఇచ్చినందుకు గానూ కమల్ హాసన్ కు హీరో విక్రమ్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
ప్రస్తుతం విక్రమ్ 'పొన్నియిన్ సెల్వన్ -పార్ట్ 2' ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో ఆయనతో పాటు ఐశ్వర్యరాయ్ కూడా నటిస్తోంది. 2010లో విమర్శకుల ప్రశంసలు పొందిన 'రావణ్' చిత్రం తర్వాత ఐశ్వర్య, విక్రమ్‌ల కలయికలో మూడోసారి ఈ చిత్రం రాబోతుంది.
ప్రజాదరణ పొందిన ఒక నవల ఆధారంగా తీసిన 'పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1' గతేడాది రిలీజై, బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని మూటగట్టుకుంది. డిస్ట్రిబ్యూటర్‌లకు కళ్లు చెదిరే లాభాలు తీసుకొచ్చిన ఈ హిస్టారికల్ డ్రామా ఫిల్మ్.. మణిరత్నంతో పాటు విక్రమ్, ఐశ్వర్యరాయ్ లాంటి పలువురు నటులకు మరింత పాపులారిటీని తీసుకొచ్చాయి. పొన్నియన్ సెల్వన్ రెండవ భాగం ఏప్రిల్ 28న థియేటర్లలోకి రానుంది.
కమల్ ప్రస్తుతం 'భారతీయుడు 2' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. షూటింగ్ జరుగుతుండగా ఇటీవల జరిగిన క్రేన్ ప్రమాదంలో ముగ్గురు సిబ్బంది మృతి చెందగా,10 మంది గాయపడ్డారు. దీంతో ఈ సినిమా షూటింగ్ తాత్కాలికంగా నిలిపివేశారు. దాదాపు రెండేళ్ల తర్వాత గత నెలలో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లిన ఈ సినిమాకు దర్శకుడు శంకర్ డైరెక్ట్ చేస్తున్నారు.
డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహించిన 'పొన్నియన్ సెల్వన్' చిత్రంలో హీరో విక్రమ్ తో పాటు త్రిష, జయం రవి, కార్తీ, ఐశ్వర్యరాయ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. పతిబన్, శరత్‌కుమార్, జయరామ్, ఐశ్వర్య లక్ష్మి, శోభిత ధూళిపాళ్ల, ప్రకాష్ రాజ్, నాజర్ లాంటి తదితరులు సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకుర్చారు.