Pawan Kalyan As God : ప్రేమికుల రోజు నుంచి దేవుడిగా పవన్ కళ్యాణ్
వచ్చే వారంలో, అదీ ప్రేమికుల రోజు నుంచి పవన్ కళ్యాణ్ మోడ్రన్ దేవుడి అవతారంలోకి ఎంటర్ అవుతారని సమాచారం. ఎందుకు? ఏమిటి? అంటే...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేతి నిండా సినిమాలే. ఇప్పుడు ఆయన చేయాల్సిన సినిమాలు అక్షరాలా ఐదు ఉన్నాయి. అందులో ఏ సినిమా ముందు? ఏ సినిమా వెనుక? అని ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు.
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతోన్న 'హరి హర వీర మల్లు' (Hari Hara Veera Mallu) సెట్స్ మీద ఉంది. ఆ సినిమా ఎప్పుడో స్టార్ట్ అయ్యింది. ఇటీవల హరీష్ శంకర్ 'ఉస్తాద్ భగత్ సింగ్', సుజీత్ సినిమాకు కొబ్బరికాయ కొట్టారు. ఈ రెండు సినిమాల కంటే ముందు మరో సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనున్నారని టాక్...
పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) కలిసి ఓ సినిమా చేయనున్నారు. దీనికి ప్రముఖ నటుడు, గతంలో తెలుగులో రవితేజ 'శంభో శివ శంభో' తీసిన సముద్రఖని దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా తమిళ హిట్ 'వినోదయ సీతమ్'కి రీమేక్. ఒరిజినల్ సినిమా తీసింది కూడా సముద్రఖనే. గత ఏడాది జూన్ నెలలో కొబ్బరికాయ కొట్టినట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు తెలిపాయి. అయితే, ఆ విషయాన్ని ఎప్పుడూ అధికారికంగా ప్రకటించలేదు. లేటెస్ట్ టాక్ ఏంటంటే... వచ్చే వారం ఈ సినిమా సెట్స్ మీదకు వెళుతుందట.
ప్రేమికుల రోజు నుంచి...
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రేమకుల రోజైన ఫిబ్రవరి 14న స్టార్ట్ కానుందని తెలిసింది. కారు యాక్సిడెంట్‌లో మరణించిన యువకుడికి దేవుడు రెండో అవకాశం ఇవ్వడం అనేది 'వినోదయ సీతమ్' సినిమాలో మెయిన్ కాన్సెప్ట్. తెలుగులో భగవంతుని పాత్రను పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. రోడ్డు ప్రమాదానికి గురైన యువకుడిగా సాయి ధరమ్ తేజ్ నటించనున్నారు.
పవన్ మోడ్రన్ దేవుడి పాత్ర చేయడం రెండోసారి. ఇంతకు ముందు 'గోపాల గోపాల'లో మోడ్రన్ శ్రీ కృష్ణుని పాత్ర చేశారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ కొంత సేపే ఉంటుంది. షూటింగ్ చేయడానికి ఎక్కువ రోజులు అవసరం లేదు. అందుకని, ముందు ఈ సినిమా కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ 20 డేస్ కేటాయించారట.
Also Read : కృతితో ప్రభాస్ ఎంగేజ్‌మెంట్ - రెబల్ స్టార్ టీమ్ క్లారిటీ
'వినోదయ సీతమ్' తెలుగు వెర్షన్ విషయానికి వస్తే... ఇందులో సాయి ధరమ్ తేజ్ సరసన 'రొమాంటిక్' కథానాయిక కేతికా శర్మ నటించనున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ సినిమాను నిర్మిస్తోంది. ఈ ఏడాదే సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట.
ఏడాదిలో రెండు రిలీజులు కన్ఫర్మ్!?
'హరి హర వీర మల్లు' 2023లో విడుదల కావడం కన్ఫర్మ్. దాంతో పాటు 'వినోదయ సీతం' రీమేక్ కూడా విడుదల అవుతుంది. మరి, ముచ్చటగా మూడో సినిమా విడుదల అవుతుందా? లేదా? అనేది చూడాలి. హరీష్ శంకర్ స్పీడుగా షూటింగ్ చేస్తారు. ఆల్రెడీ బౌండ్ స్క్రిప్ట్ రెడీగా ఉంది. అయితే, చిత్రీకరణను బట్టి విడుదల ఉంటుంది. రాజకీయాలకు పవన్ ఎంత సమయం కేటాయిస్తారు? షూటింగులకు ఎంత సమయం కేటాయిస్తారు? అనేదానిపై మిగతా రిలీజులు డిసైడ్ అవుతాయి.
Also Read : కన్నీళ్లు పెట్టుకున్న శివన్న - ఓదార్చిన బాలకృష్ణ