Pawan Kalyan: మోహన్ బాబు గారూ.. వైఎస్ కుటుంబీకులు మీ బంధువులే కదా.. కావాలంటే నన్ను బ్యాన్ చేసుకోమని చెప్పండి
నటుడు మోహన్ బాబుపై జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ కామెంట్స్ చేశారు. చిత్ర పరిశ్రమ సమస్యలు గురించి పట్టించుకోవాలని చెప్పారు.
సాయి ధరమ్ తేజ్ హీరోగా దేవకట్ట దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రిపబ్లిక్. ఈ సినిమాను అక్టోబర్ 1న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా.. నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా పవన్ కల్యాణ్ హాజరయ్యారు. చిత్ర పరిశ్రమలోని ఇబ్బందులపై పవర్ స్టార్ కామెంట్స్ చేశారు. సినీ పరిశ్రమపై ప్రభుత్వ విధానాల పట్ల మాట్లాడారు. ఈ సందర్భంగా వైఎస్ కుటుంబానికి, మోహన్ బాబు కుటుంబానికి ఉన్న సన్నిహిత్యంపైనా పవన్ మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చిత్ర పరిశ్రమ పట్ల ఉన్న వైఖరిపై మోహన్ బాబు స్పందించాలని పవన్ డిమాండ్ చేశారు. 'వైఎస్ఆర్ కుటుంబీకులు మీ బంధువులు కదా.. చిత్ర పరిశ్రమను హింసించొద్దని చెప్పండి. కావాలంటే పవన్ కల్యాణ్‌ను బ్యాన్ చేసుకోండి. అతను, మీరూ తేల్చుకోండి. కానీ చిత్రపరిశ్రమ జోలికి మాత్రం రావొద్దు అని మీరు వైసీపీ పెద్దలకు చెప్పండి. మీరు మాజీ ఎంపీ కూడా. ఈ అంశంపై మాట్లాడాల్సిన నైతిక బాధ్యత మీపై ఉంది. ఎందుకంటే.. ఇవాళ చిత్రపరిశ్రమకు అమలు చేసిన చేసిన రూల్స్.. రేపటి రోజున మీ విద్యానికేతన్ స్కూళ్లకు కూడా అప్లై చేయొచ్చు. నా వరకు రాలేదు కదా? అని గమ్మునుండటం సరికాదు. ఈ చర్యలు రేపటి రోజున అది మీకు కూడా సమస్యగా మారొచ్చు. అప్పుడు మీరూ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావొచ్చు. ఈ విషయాన్ని గుర్తుంచుకోని స్పందించండి.' అంటూ మోహన్ బాబుపై పవన్ కామెంట్స్ చేశారు.
సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్‌కి గురైతే మీడియాలో రకరకాల కథనాలు వచ్చాయన్న పవన్ కల్యాణ్ మీడియాకి చురకలేస్తూ.. ఆ ఇష్యూని వైసీపీ వైపు డైవర్ట్ చేశారు. వెదవలు, సన్నాసులు, వైసీపీ సెక్స్ రాకెట్లూ అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. తన సినిమాలను ఆపడం కోసం మొత్తం ఇండస్ట్రీని ఇబ్బందులకు గురి చేస్తున్నారన ఆవేదన వ్యక్తం చేశారు. సాయిధరమ్ తేజ్ ప్రమాదంపై కొందరు వివాదాస్పదంగా మాట్లాడారని... తేజ్ ప్రమాదం కంటే వైఎస్ వివేకా హత్యపై ఎందుకు మాట్లడరని ప్రశ్నించారు. కోడి కత్తి గొడవ కేసు ఏమైందో గిరిజనులకు పోడు భూములు ఎందుకు దక్కడం లేదో మాట్లాడరెందుకన్నారు.