Vishwak Sen: ‘దాస్ కా ధమ్కీ’కు సీక్వెల్, ‘ఆహా’తో బిగ్ డీల్ - జోరుమీదున్న విశ్వక్ సేన్
విశ్వక్ సేన్ ‘దాస్ కా ధమ్కీ’ సినిమా ఆహా ఓటీటీ లో మంచి వ్యూస్ ను రాబడుతోంది. ఈ మేరకు మూవీ టీమ్ ఓ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. త్వరలో ఈ మూవీకు సీక్వెల్ ను కూడా తీసుకురానున్నట్లు చెప్పారు విశ్వక్ .
టాలీవుడ్ లో ఎంతో మంది యంగ్ హీరోలు ఉన్నారు. వారిలో కొంతమంది మల్టీ టాలెండెడ్ హీరోలు కూడా ఉన్నారు. అలాంటి వారిలో విశ్వక్ సేన్ ఒకరు. హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ గా గడుపుతున్నారు. ఆయన రీసెంట్ గా నటించిన సినిమా ‘దాస్ కా ధమ్కీ’. విశ్వక్ స్వీయ దర్శకత్వంలో నటించిన సినిమా ఇది. నివేదా పేతురాజ్ హీరోయిన్ గా చేసింది. ఈ మూవీ మార్చి 22 న థియేటర్లలో విడుదల అయింది. సినిమాకు మొదట్లో పాజిటివ్ టాక్ వచ్చినా తర్వాత మిశ్రమ స్పందన వచ్చింది. ఇటీవలె ఈ మూవీను ‘ఆహా’ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో ఏప్రిల్ 14 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో యావరేజ్ టాక్ వచ్చినా ఓటీటీలో మాత్రం మంచి విజయాన్ని అందుకుంది ఈ మూవీ. సక్సెస్ ఫుల్ గా స్ట్రీమింగ్ అవుతూ ట్రెండింగ్ లో ఉంది. ఈ నేపథ్యంలో హీరో హీరోయిన్లు విశ్వక్, నివేదా ఆహా ఓటీటీ కంటెంట్ హెడ్ వాసుతో కలసి విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
డిసెంబర్ లోపు మూడు సినిమాలు చేస్తా: విశ్వక్ సేన్
ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో ‘దాస్ కా ధమ్కీ’ సినిమా సక్సెస్ ఫుల్ గా స్ట్రీమింగ్ అవుతుండటం పట్ల విశ్వక్ సేన్ హర్షం వ్యక్తం చేశారు. సినిమాను ఇంత బాగా ప్రమోట్ చేస్తున్న ఆహా టీమ్ కు ధన్యవాదాలు తెలిపారు. ఓ వైపు ఐపీఎల్ సీజన్ నడుస్తున్నా తమ సినిమాను మాత్రం ప్రేక్షకులు చక్కగా చూస్తున్నారని అన్నారు. సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని అందుకే అందరూ మూవీను రిపీటెడ్ గా చూస్తున్నారని అన్నారు. ఇదే ఉత్సాహంతో వచ్చే ఏడాది మూవీకి సీక్వెల్ ను ప్లాన్ చేస్తున్నామని అన్నారు. ఇంతకంటే పదిరెట్లు సీక్వెల్ లో వినోదం ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇక తాను ప్రస్తుతం ‘గామి’ అనే సినిమా చేస్తున్నానని, దానితో పాటు ఈ ఏడాది డిసెంబర్ లోపు మూడు సినిమాలు కంప్లీట్ చేయడానికి రెడీ అవుతున్నానని అన్నారు.
రికార్డు స్థాయిలో ‘దాస్ కా ధమ్కీ’కి వ్యూస్..
ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఎన్నో తెలుగు సినిమాలకు వేదిక అయింది. గతంలో విశ్వక్ సేన్ నటించిన ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ సినిమా కూడా ఆహా లోనే స్ట్రీమింగ్ అయింది. తర్వాత విశ్వక్ నటించిన ‘ఓరి దేవుడా’ సినిమా కూడా ఆహా లోనే స్ట్రీమింగ్ అయింది. ఈ రెండు సినిమాలకు ఓటీటీ లో మంచి వ్యూస్ వచ్చాయి. ఈ నేపథ్యంలో రీసెంట్ గా రిలీజ్ అయిన ‘దాస్ కా ధమ్కీ’ ను కూడా ఆహాలోనే స్ట్రీమింగ్ చేస్తున్నారు మేకర్స్. ఈ మూవీకు ఇప్పటికే 100 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్ వచ్చాయి. మరో రెండు, మూడు రోజుల్లో 250 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్ ను క్రాస్ చేస్తుందని భావిస్తున్నారు. ఇక ఆహాతో కలిసి విశ్వక్ ఓ సర్‌ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారట. దాని వివరాలు త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు విశ్వక్.