Best OTT Horror Movies: చిన్న కన్నం.. పెద్ద సీక్రెట్ - అమ్మమ్మ తాతయ్యలు అంత డేంజరా? ట్విస్టులతో పిచ్చెక్కించే మూవీ ఇది
పిమ్, పుత్ ఇద్దరూ అక్కాతమ్ముళ్లు. వాళ్లమ్మ కోమాలోకి వెళ్లిన తర్వాత వేరే దారి లేక, వాళ్ల అమ్మమ్మ వాళ్లింట్లో ఉంటారు. అక్కడ ఒక కన్నంలో నుంచి చూస్తే దెయ్యం కనపడుతుంది.
అనుకోని పరిస్థితుల్లో వాళ్ల అమ్మమ్మ, తాతయ్యల ఇంటికి వెళ్లిన ఆ అక్కా తమ్ముళ్లు వారి గదిలో ఒక కన్నం చూస్తారు. అందులో నుంచి చూస్తే.. ఒక రూమ్ ఉంటుంది. ఆ గదిలో ఒక అమ్మాయి రక్తం కక్కుకుని చనిపోతూ కనిపిస్తుంది. అసలు ఏం జరిగిందనేది.. ఎన్నో ట్విస్టుల తర్వాత బయటపడుతుంది. ఇంతకీ ఈ మూవీ పేరేమిటో చెప్పలేదు కదూ.
ఈ మూవీ పేరు The Whole Truth. 2021లో రిలీజైంది.
కథలోకి వెళ్తే..
పిమ్, పుత్ ఇద్దరూ అక్కాతమ్ముళ్లు వాళ్లమ్మ మాయి సింగిల్ పేరెంట్. వీళ్లు ముగ్గురు సరదాగా కార్లో వెళ్తూ ఉంటారు. మాయి తనకు ప్రమోషన్ వచ్చిందని సాయంత్రం పిల్లలిద్దరికీ పార్టీ ఇస్తానని చెప్తుంది. పిమ్ స్కూల్లో ఛీర్ లీడర్. ఈ సంవత్సరం కూడా తనే ఛీర్ లీడర్‌గా ఉండాలని టీచర్ చెప్తుంది. తన ఫ్రెండ్స్ కూడా సపోర్ట్ చేస్తూ తనకే ఓట్లు వేస్తామని చెప్పటంతో సంతోషంగా ఉంటుంది. ఆరోజు సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి, తన తమ్ముడు పుత్ కూడా ఇంటికి వచ్చి, తన ఫ్రెండ్‌తో కలిసి వీడియో గేమ్స్ ఆడుతూ ఉంటాడు. పిమ్ బట్టలు మార్చుకోవటానికి పైకి వెళ్తుంది. పుత్ ఫ్రెండ్ కూడా ఆమెను ఫాలో అయ్యి చూస్తుంటాడు. అది గమనించిన పిమ్ గట్టిగా తలుపు మూసేయటంతో బయట ఉన్న పుత్ ఫ్రెండ్ కాలికి పెద్ద గాయం అవుతుంది. మీ అక్క బాగా ఎక్కువ చేస్తుంది. ఆమె నాతో డేటింగ్ చేయకపోతే, తను బట్టలు మార్చుకుంటున్నప్పుడు తీసిన వీడియో లీక్ చేస్తానని పుత్‌ను బ్లాక్ మెయిల్ చేస్తుంటాడు.
మాయి ఆఫీస్ నుంచి వచ్చే దారిలో విపరీతంగా వర్షం పడుతూ ఉంటుంది. ఆమెకు యాక్సిడెంట్ అవుతుంది. దీంతో కోమాలోకి వెళ్తుంది. ఆఫీస్ నుంచి రావటానికి లేట్ అవుతుందని ముందే చెప్పటంతో విషయం తెలియక పిమ్, పుత్ ఇద్దరూ ఇంట్లో నిద్రపోతుంటారు. ఒక పెద్దాయన వచ్చి.. ‘‘నేను మీ అమ్మ వాళ్ల నాన్నను. అంటే మీకు తాతయ్యను’’ అని చెప్పి హాస్పిటల్‌కు తీసుకెళ్తాడు. ‘‘మీరిద్దరూ భయపడాల్సిన అవసరం లేదు. మా దగ్గర ఉండొచ్చు’’ అని పిమ్, పుత్‌లను వాళ్ల అమ్మమ్మ, తాతయ్య వాళ్లింటికి తీసుకెళ్తారు. అక్కడ మాయి చిన్నపుడు ఉన్న గదిలో పిమ్, పుత్ నిద్రపోతారు. ఆ గదిలో వాళ్లకు రాత్రి పూట భయంకరమైన శబ్దాలు వినిపిస్తాయి. కొత్త ప్రదేశం కదా ఇంకా అలవాటు అవ్వాలని సర్దుకుంటారు.
ఆ తర్వాతి రోజు తమ ఇంట్లో ఉన్న సామాన్లు, పెంపుడు పిల్లిని తాత ఇంటికి తీసుకొస్తాడు. ఒకరోజు పుత్‌కు ఆ గదిలో ఒక కన్నం కనపడుతుంది. అందులో నుంచి చూస్తే, అవతలివైపు గదిలో దెయ్యం ఉంటుంది. ఆ విషయం వాళ్ల అమ్మమ్మ తాతయ్యలకు చెప్తే.. వారికి అక్కడ కన్నం ఏమీ కనపడదు. వీళ్లిద్దరికి మాత్రమే అది కనిపిస్తుంది. ఒకరోజు పుత్ ని తన ఫ్రెండ్ బెదిరిస్తూ కనపడుతాడు. పిమ్ వచ్చి ఏంటని అడిగితే.. కొత్తింటికి వెళ్లారంట కదా అక్కడికి వస్తానని చెప్తాడు. చెప్పినట్టుగానే ఆరోజు సాయంత్రం వాళ్లింటికి వస్తాడు పుత్ ఫ్రెండ్. పుత్ తన ఫ్రెండ్‌ను ఆ కన్నం నీకు కనపడుతుందా అని అడుగుతాడు. ‘‘ఇక్కడేం లేదు కదా’’ అంటాడు. ఆ తర్వాత కన్ను కొంచెం దగ్గరగా పెట్టి చూస్తాడు. ఇంతలో అతన్ని ఎవరో వెనుక నుంచి కొడతారు. దీంతో ముక్కు పగిలి రక్తం కారుతుంది. పుత్ తనను కొట్టాడు అనుకొని, కోపంగా ఆ వీడియో బయటపెడతాను అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
ఇంట్లో ఆ కన్నం నుంచి చూసినప్పుడల్లా ఒక అమ్మాయి రక్తం కక్కుకుని చనిపోయినట్టు కనపడుతూ ఉంటుంది. వాళ్ల అమ్మమ్మ.. పుత్ ని మాటిమాటికీ పాలు తాగు బలం వస్తుంది అని తాగిస్తూ ఉంటుంది. అటు వాళ్లమ్మ మాయి కోమాలోంచి బయటకు వస్తుంది. పిల్లలెక్కడా? అని డాక్టర్ ని అడిగితే, వాళ్ల తాతయ్య వాళ్లింట్లో సేఫ్ గా ఉన్నారని డాక్టర్ చెప్తాడు. అక్కడా? అక్కడికి వెళ్లటం డేంజర్ అని కంగారుగా అంటుంది. ఇక్కడి నుంచి సినిమాలో చాలా ట్విస్టులు బయటపడుతాయి. అవి సినిమాలో చూస్తేనే బాగుంటుంది.
Also Read: అద్దె ఇంట్లో అడల్ట్ మూవీ షూటింగ్ - చాటుగా చూసిన ముసలమ్మ, ఆ తర్వాత దబిడి దిబిడే - పిల్లలతో చూడొద్దు!