మాధురీ దీక్షిత్‌పై అసభ్య వ్యాఖ్యలు - ‘నెట్‌ఫ్లిక్స్’కు లీగల్ నోటీసులు జారీ
బిగ్‌బ్యాంగ్ ఎపిసోడ్‌లో మాధురీ దీక్షిత్‌ను అవమానించడంపై నెట్‌ఫ్లిక్స్‌కు లీగల్ నోటీస్ జారీ అయ్యింది. వెంటనే ఆ ఎపిసోడ్‌ను తొలగించాలని నోటీస్ పంపిన మిథున్ విజయ్‌కుమార్ డిమాండ్ చేశారు.
ప్రముఖ బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్‌ను అవమానించారంటూ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌కు లీగల్ నోటీస్ జారీ అయ్యింది. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమయ్యే ‘బిగ్ బ్యాంగ్ థియరీ’ ఎపిసోడ్‌లో బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్‌ను అవమానించేలా అభ్యంతరకరమైన భాష వాడారంటూ రాజకీయ విశ్లేషకుడు మిథున్ కుమార్ ఆరోపిస్తూ ఈ నోటీసులు పంపారు. ‘బిగ్ బ్యాంగ్ థియరీ’లో సెక్సిజం, స్త్రీ ద్వేషాన్ని ప్రోత్సహిస్తున్నారని.. వ్యక్తులను కించపరిచే భాష వాడుతున్నారని ఆయన మండిపడ్డారు. నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫారం నుంచి ‘బిగ్‌బ్యాంగ్ థియరీ’ ఎపిసోడ్‌ను స్ట్రీమింగ్ కాకుండా తొలగించాలని డిమాండ్ చేశారు. తన డిమాండ్లకు స్పందించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని మిథున్ కుమార్ హెచ్చరించారు.
‘బిగ్ బ్యాంగ్ థియరీ’ రెండవ సీజన్ మొదటి ఎపిసోడ్‌లో షెల్డన్ కూపర్‌గా నటించిన జిమ్ పార్సన్స్, ఐశ్వర్య రాయ్‌ని మాధురీ దీక్షిత్‌తో పోల్చాడు. ఒక సన్నివేశంలో అతను ఐశ్వర్యను ‘పేదవాడి మాధురీ దీక్షిత్’ అని అభివర్ణిస్తాడు. దీనికి ప్రతిస్పందనగా రాజ్ కూత్రపల్లి పాత్ర పోషించిన కునాల్ నయ్యర్ "మాధురీ దీక్షిత్ లాంటి కుష్ఠురోగంతో బాధపడుతున్న వ్యభిచారితో పోలిస్తే ఐశ్వర్యరాయ్ ఒక దేవత" అంటూ బదులిస్తాడు.
ఈ సన్నివేశాన్ని ప్రస్తావించిన మిథున్ విజయ్ కుమార్ తన డిమాండ్లపై స్పందించడంలో విఫలమైనా, నోటీసులో సూచించిన డిమాండ్లకు కట్టుబడి ఉండకపోయినా నెట్‌ఫ్లిక్స్‌పై తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. “తమ చర్యలకు జవాబుదారీగా ఉండడం, ప్రసారాల్లో సామాజిక, సాంస్కృతిక విలువలను కించపరచకుండా, ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవడం నెట్‌ఫ్లిక్స్ వంటి సంస్థలకు చాలా ముఖ్యం. స్ట్రీమింగ్ సర్వీస్ ప్రొవైడర్లు తమ ప్లాట్‌ఫారమ్‌లలో అందించే కంటెంట్‌ను జాగ్రత్తగా పరిశీలించి ప్రసారం చేయాల్సిన బాధ్యత ఉందని నేను గట్టిగా నమ్ముతున్నాను. వారు ప్రదర్శించే అంశాల్లో అవమానకరమైన, అభ్యంతరకరమైన లేదా పరువు నష్టం కలిగించే కంటెంట్ ఉండదని నిర్ధారించుకోవడం వారి బాధ్యత. నెట్‌ఫ్లిక్స్ - ‘బిగ్ బ్యాంగ్ థియరీ’లోని షోలలో ఒకదానిలో అవమానకరమైన పదాన్ని ఉపయోగించడం వల్ల నేను చాలా బాధపడ్డాను. ఆ పదాన్ని ప్రజల నుంచి ఎన్నో ప్రశంసలు, భారీగా అభిమానులు ఉన్న నటి మాధురీ దీక్షిత్‌ను ఉద్దేశించి ఉపయోగించారు. ఇది అత్యంత అభ్యంతరకరం, తీవ్రంగా బాధించేది మాత్రమే కాకుండా ఆమె ఆత్మ గౌరవాన్ని, పరువును కించపరిచేలా ఉంది" అని మిథున్ కుమార్ తన ప్రకటనలో పేర్కొన్నారు.
స్ట్రీమింగ్ సర్వీస్ ప్రొవైడర్లు ఇటువంటి సమస్యలను సీరియస్‌గా తీసుకుని అభ్యంతరకరమైన, పరువు నష్టం కలిగించే కంటెంట్‌పై త్వరగా చర్య తీసుకుని సమస్య పరిష్కరిస్తారని తాను భావిస్తున్నానని మిథున్ విజయ్ కుమార్ పేర్కొన్నారు. ఇలాంటి కంటెంట్ ప్రసారం కాకుండా నిరోధించడంలో స్ట్రీమింగ్ సర్వీస్ ప్రొవైడర్లు చురుకుగా ఉండాలని సూచించారు. ప్రసారం చేసే మొత్తం కంటెంట్‌పై స్పష్టమైన మార్గదర్శకాలు, కఠినమైన స్క్రీనింగ్ ప్రక్రియల ద్వారా ఇది సాధ్యమవుతుందని తెలిపారు. లక్షలాది మంది వినియోగించే స్ట్రీమింగ్ సేవలు ప్రసారం చేసే కంటెంట్ ప్రేక్షకులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని.. అందువల్ల తాము అందించే కంటెంట్ గౌరవప్రదంగా, ఏ ఒక్కరికీ ఇబ్బంది కలిగించని, ప్రమాదకర పోకడలు లేకుండా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత వారిపై ఉందని స్పష్టంచేశారు. ఈ ఘటన అన్ని స్ట్రీమింగ్ సర్వీస్ ప్రొవైడర్లకు కనువిప్పు లాంటిదన్న మిథున్ విజయ్ కుమార్ ఇకపై ఇలాంటివి పునరావృతం కాకుండా మరింత బాధ్యతతో, మీడియా గౌరవాన్ని కాపాడేలా పనిచేస్తారని భావిస్తానని తెలిపారు.