Poonam Kaur: దుర్భర పరిస్థితుల్లో ఉన్న మహిళపై కన్నేసిన వాడు రాక్షసుడే! 'నాతి చరామి' ప్రెస్‌మీట్‌లో సంచలన వ్యాఖ్యలు చేసిన పూనమ్ కౌర్
తాను 2007లో పెళ్లి చేసుకోవాలని అనుకున్నట్టు పూనమ్ కౌర్ తెలిపారు. అయితే... సినిమాయే జీవితం అయ్యిందన్నారు. 'నాతి చరామి' ప్రెస్‌మీట్‌లో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.
"దుర్భర పరిస్థితుల్లో ఉన్న ఏ మహిళ మీదైనా సరే... కన్నేసిన మగాడు రాక్షసుడే. ఏ కాలమైనా కథ ఇదే. సీతాదేవి, ద్రౌపది, దుర్గాదేవి కథలు మనకు అదే విషయం చెప్పాయి. నేను ఆ కథలు చదివా. వారంతా ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు. ఇదీ అటువంటి కథే. చెన్నైలో ఉన్నప్పుడు దర్శకుడు నాగు గవర వచ్చి ఈ కథ చెప్పారు. బాగా నచ్చింది. ఓకే చెప్పాను. నా జీవితానికి దగ్గరగా ఉన్న చిత్రమిది. క్రైమ్ నేపథ్యంలో తీసిన ఫ్యామిలీ డ్రామా ఇది" అని పూనమ్ కౌర్ అన్నారు.
అరవింద్ కృష్ణ, పూనమ్ కౌర్, సందేశ్ బురి ప్రధాన తారాగణంగా శ్రీ లక్ష్మీ ఎంటర్‌ప్రైజెస్ సమర్పణలో ఎ స్టూడియో 24 ఫ్రేమ్స్ ప్రొడక్షన్ పతాకంపై జై వైష్ణవి .కె నిర్మించిన సినిమా 'నాతి చరామి'. నాగు గవర దర్శకత్వం వహించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో, హంగామా, సోనీ, టాటా స్కై, ఎయిర్ టెల్ ఎక్స్‌ట్రీమ్, ఎంఎక్స్ ప్లేయర్... తదితర ఓటీటీ వేదికల్లో మార్చి 10 నుంచి సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పెళ్లి గురించి పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
"నేను 2007లో పెళ్లి చేసుకుని విదేశాలు వెళ్లాలని అనుకున్నాను. కానీ, సినిమాయే నా జీవితం అయ్యింది. మధ్య తరగతి అమ్మాయిలకు చాలా కలలు ఉంటాయి. ఆ కలలు అందరూ నెరవేర్చుకోలేరు. అయితే, మన బలం ఏమిటి? బలహీనత ఏమిటి? అనేది తెలుసుకుని ముందుకు వెళ్ళాలి" అని పూనమ్ కౌర్ వ్యాఖ్యానించారు.
Also Read: 'ఫ్యామిలీ మాన్ 2'లో సమంత చేసినట్టు పూనమ్ కౌర్ చేసిందా?
వాస్తవ ఘటనల ఆధారంగా సినిమా రూపొందించామని దర్శకుడు నాగు గవర తెలిపారు. అమెరికాలోని వై2కె సమస్య, ఇండియాలోని హైదరాబాద్ సిటీలో ఒక ఫ్యామిలీలో ఎటువంటి మార్పులకు కారణం అయ్యిందనేది ఆయన చెప్పారు. పూనమ్ కౌర్ ఇంత వరకూ చేయనటువంటి రోల్ చేశారని ఆయన తెలిపారు. "నాకు క్రైమ్ కంటే దాని చుట్టూ జరిగిన డ్రామా నచ్చింది. సరైన యాక్టర్ ఉంటే కథను చాలా పవర్‌ఫుల్‌గా చెప్పవచ్చని ఫీలయ్యా. శ్రీలత క్యారెక్టర్ డిజైన్ చేసుకొని, పూనమ్ కౌర్ అయితే బాగుంటుందని... ఆమెకు కథ చెప్పా. క్యారెక్టర్ కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు. అద్భుతంగా నటించారు. సినిమా చూశాక... ఆమె పాత్ర మిమ్మల్ని వెంటాడుతుంది. అరవింద్ కృష్ణ సెటిల్డ్‌గా నటించారు. హీరో హీరోయిన్లు ఇద్దరికీ సినిమా మంచి పేరు తెస్తుంది. మార్చి 10న ఓటీటీలో విడుదలవుతున్న మా సినిమాను అందరూ చూసి ఆశీర్వదించండి" అని నాగు గవర అన్నారు.
Also Read: అక్కా, బావా సినిమా హిట్! - పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్