Nithya Menen: ‘కుమారి శ్రీమతి’గా వస్తున్న నిత్యా మీనన్ - స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
ఒకవైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్‌లు మ్యానేజ్ చేస్తున్న నటీనటులు ఎంతోమంది ఉన్నారు. అందులో నిత్యామీనన్ కూడా ఒకరు. తాజాగా తను నటించిన ‘కుమారి శ్రీమతి’ సిరీస్ విడుదల తేదీని ఖరారు చేసుకుంది.
కథ బాగుంటే, కంటెంట్ బాగుంటే అది సినిమా అయినా, ఓటీటీ అయినా ప్రేక్షకులు వాటిని కచ్చితంగా ఆదరిస్తారు. ఇక గత కొన్నేళ్లలో సినిమాలకు ఉన్న పాపులారిటీకి సమానంగా వెబ్ సిరీస్‌లు కూడా పాపులారిటీని సాధించాయి. స్టార్ హీరో, హీరోయిన్స్ సైతం సినిమాలు చేయడానికి ఎంత ఆసక్తి చూపిస్తున్నారో.. సిరీస్‌లు చేయడానికి కూడా అలాగే ముందుకొస్తున్నారు. చాలావరకు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌కు వెబ్ సిరీస్‌ల వల్ల కూడా పాపులారిటీ వస్తోంది. అందుకే నిత్యామీనన్ లాంటి టాలెంటెడ్ నటి కూడా అప్పుడప్పుడు వెబ్ సిరీస్‌లలో మెరవడానికి వెనకాడడం లేదు. ఇప్పటికే పలు వెబ్ సిరీస్‌లలో నటించిన నిత్యా.. మరో సిరీస్‌లో మెరవడానికి, తన ఫ్యాన్స్‌ను మెప్పించడానికి సిద్ధమవుతోంది. తాజాగా నిత్యా నటించిన ‘కుమారి శ్రీమతి’ వెబ్ సిరీస్ ఎప్పుడు, ఎక్కడ విడుదల అవుతుంది అనే విషయాలను ప్రకటించారు మేకర్స్.
దాదాపు సంవత్సరం తర్వాత..
కథ నచ్చాలి, అందులో తన పాత్ర కూడా నచ్చాలి.. అప్పుడే సినిమాలను చేయడానికి ఒప్పుకుంటుంది నిత్యామీనన్. అందుకే ఎక్కువగా సినిమాల్లో కనిపించకపోయినా.. తను కనిపించిన సినిమాలు, అందులో తన పాత్రలు మాత్రం స్పెషల్‌గా ఉంటాయి. నిత్యామీనన్ చివరిగా తెలుగులో ‘భీమ్లా నాయక్’లో కనిపించింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినా.. అవి తెలుగులో డబ్ అయినా.. నేరుగా తెలుగు సినిమా చేసి మాత్రం సంవత్సరంపైనే అయ్యింది. సినిమాలు మాత్రమే కాదు.. మధ్యమధ్యలో వెబ్ సిరీస్‌లతో కూడా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తుంది నిత్యా మీనన్. దాదాపు ఏడాది తర్వాత మరోసారి వెబ్ సిరీస్‌తో ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే నిత్యా నటించిన మూడు సిరీస్‌లు విడుదలయిన అమెజాన్ ప్రైమ్‌లోనే.. తన నాలుగో సిరీస్ కూడా విడుదల కానుంది.
‘బ్రీథ్’ సిరీస్‌తో ఆదరణ..
ఇప్పటివరకు నిత్యామీనన్ రెండు హిందీ వెబ్ సిరీస్‌లు, ఒక తెలుగు సిరీస్‌లో నటించింది. ఆ మూడు సిరీస్‌లో అమెజాన్ ప్రైమ్‌లోనే విడుదల అయ్యాయి. ముఖ్యంగా తను అమితాబ్ బచ్చన్‌తో జతకడుతూ చేసిన ‘బ్రీథ్ ఇంటూ ది షాడోస్’ వెబ్ సిరీస్ అయితే ఇప్పటికీ రెండు సీజన్లుగా విడుదల అయ్యింది. ఇందులో నిత్యా.. ముందెన్నడూ చేయని పాత్రలో కనిపించి అందరినీ అలరించింది. ఇప్పుడు కేవలం ఒకటి కాదు.. రెండు బ్యాక్ టు బ్యాక్ వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి సిద్ధపడింది నిత్యా మీనన్. అందులో ఒకటైన ‘కుమారి శ్రీమతి’ వెబ్ సిరీస్ విడుదల తేదీని ఖరారు చేసుకుంది.
తెలుగుతో పాటు..
గోమ్టేష్ ఉపాధ్యే దర్శకత్వం వహించిన ‘కుమారి శ్రీమతి’ సెప్టెంబర్ 28న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల అవుతున్నట్టుగా మేకర్స్ అనౌన్స్ చేశారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళం, హిందీ భాషల్లో కూడా ఒకేసారి ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది. ఈ సిరీస్‌లో మొత్తంగా ఏడు ఎపిసోడ్స్ ఉంటాయని, చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుందని మేకర్స్ అంటున్నారు. ఇందులో నిత్యా మీనన్‌తో పాటు నిరుపమ్, గౌతమీ, తిరువీర్, తాళ్లూరీ రామేశ్వరి, నరేశ్, మురళీ మోహన్ వంటి నటీనటులు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతి ఎంటర్‌టైన్మెంట్స్‌కు సంబంధించిన నిర్మాణ సంస్థ ఎర్లీ మాన్సూన్ టేల్స్.. ‘కుమారి శ్రీమతి’ వెబ్ సిరీస్‌ను నిర్మించాయి.
View this post on Instagram
Also Read: హారర్ వెబ్ సిరీస్‌తో వస్తోన్న ఓంకార్ - ఆకట్టుకుంటున్న 'మాన్షన్ 24' ఫస్ట్ లుక్!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial