Killer Clown: రియల్ IT, 33 మందిని చంపేసి ఇంట్లోనే పూడ్చేసిన ‘జోకర్’ - ఇతడి వాంగ్మూలం దడ పుట్టిస్తుంది
అతడు ‘జోకర్’ వేషంలో నవ్విస్తాడు. అబ్బాయిలను కవ్విస్తాడు.. ఆ తర్వాత తన ఇంటికి తీసుకెళ్లి ‘జోకర్’ నవ్వుల వెనుక ఉన్న అసలైన ఉన్మాదిని నిద్రలేపుతాడు. వారిని రేప్ చేసి దారుణంగా చంపేస్తాడు.
మీరు ‘IT’ సినిమా చూశారా? సాధారణంగా జోకర్‌ను చూస్తే నవ్వు వస్తుంది. కానీ, ఆ చిత్రంలో జోకర్‌ను చూస్తే మాత్రం గుండెల్లో దడ పుడుతుంది. అయితే, ఈ పాత్రకు స్ఫూర్తినిచ్చిన ఈ సీరియల్ కిల్లర్ గురించి తెలిస్తే.. అంతకంటే రెట్టింపు భయం మిమ్మల్ని వెంటాడుతుంది. జోకర్‌ను చూస్తే చాలు వెన్నులో వణుకుపుడుతుంది. అమెరికా ప్రజలకు నిద్రలేకుండా చేసిన ఆ హంతకుడి పేరు జాన్ వేన్ గేసీ(John Wayne Gacy). ఇల్లినాయిస్‌లోని నార్వుడ్ పార్క్‌లో నివసించేవాడు. పిల్లలు అతడిని ‘పోగో అంకుల్’ అని పిలిచేవారు. అతడి హత్యకాండ బయటడిన తర్వాత గేసిని అంతా ‘ది కిల్లర్ క్లౌన్’(The Killer Clown) అని పిలవడం మొదలుపెట్టారు. ‘నెట్‌ఫ్లిక్స్’ (Netflix)లో ‘Conversations with a Killer: The John Wayne Gacy Tapes’ పేరుతో ఇతడి డాక్యూమెంటరీ ప్రసారవుతోంది. తాను చేసిన హత్యలు గురించి ఈ సీరియల్ కిల్లర్ చెప్పిన మాటలను కూడా ఈ డాక్యుమెంటరీలో ప్రసారం చేశారు. అతడి వాగ్మూలం విని చాలామంది ఇంత క్రూరమైన రాక్షసుడి గురించి ఎప్పుడూ వినలేదని అంటున్నారు. ఇంతకీ అతడు ఏం చేశాడు? నెట్‌ఫ్లిక్స్ వీక్షకులు ఈ డాక్యుమెంటరీ చూసిన తర్వాత ఎందుకు ఆందోళనకు గురవ్వుతున్నారు?
జాన్ వేన్ గేసీ 1942లో చికాగోలో పుట్టాడు. తల్లి చిన్నతనంలో చనిపోవడం, తండ్రి తాగుబోతు కావడంతో కుటుంబాన్ని అతడే నడిపేవాడు. అప్పట్లో మూడు కేఎఫ్‌సీ రెస్టారెంట్లకు మేనేజర్‌గా పనిచేశాడు. అదే సమయంలో మార్లియన్ మేయర్స్‌ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక కూతురు కూడా పుట్టింది. బయటకు ఎంత కూల్‌గా కనిపించే గేసీలో ఓ కామాంధుడు దాగివున్నాడనే విషయం భార్యకు తెలిసింది. 1968లో గేసి మొదటిసారి 16 ఏళ్ల యువతిని లైంగికంగా వేధిస్తూ ఆమె కంటపడ్డాడు. అంతే, ఆమె అతడికి విడాకులిచ్చి కూతురిని తన వెంట తీసుకెళ్లిపోయింది.
ఈ సారి అమ్మాయిలు కాదు.. అబ్బాయిలే టార్గెట్: కాలక్రమేనా గేసీ.. అమ్మాయిలపై కాకుండా మగ పిల్లలు, యువకులపై మళ్లింది. యువతిని లైంగికంగా వేదించినందుకు పోలీసులు గేసిని అరెస్టు చేశారు. రెండేళ్ల జైలు శిక్ష తర్వాత 1970లో పెరలో మీద బయటకు వచ్చాడు. సొంతంగా వ్యాపారం ప్రారంభించి 1972లో కారోలే అనే యువతిని వివాహం చేసుకున్నాడు. వ్యాపారంతోపాటు పార్ట్ టైమ్ జాబ్ కూడా చేసేవాడు. ముఖానికి జోకర్‌లా రంగులు పూసుకుని పార్టీల్లో పిల్లలను ఆటలాడించేవాడు. దీంతో పిల్లలు అతడిని ‘పోగో అంకుల్’ అనేవారు. అతడికి బాగా దగ్గరయ్యారు. అప్పుడప్పుడు చారిటీ షోలు నిర్వహిస్తూ స్థానికుల నుంచి మంచి మార్కులు కొట్టేశాడు. అదే అతడికి అవకాశంగా మారింది. మగ పిల్లలను ఎత్తుకెళ్లి, వారితో అసహజ శృంగారంలో పాల్గొని దారుణంగా చంపేసేవాడు.
ఇలా వల వేసేవాడు: పోగో అంకుల్‌గా పిల్లలకు దగ్గర కావడం వల్ల గేసీకి పిల్లలను అపహరించడం చాలా సులభమైంది. ముఖ్యంగా మగ పిల్లలకు చాక్లెట్లు, గేమస్ ఆశ చూపించి ఇంటికి తీసుకెళ్లేవాడు. కానీ, యువకులను వలలో వేసుకోవడం అంత సులభం కాదు. అందుకు అతడు ఓ సైంటిఫిక్ రీసెర్చ్ చేస్తున్నానని, తనకు అసిస్టెంట్‌గా పనిచేస్తే జీతమిస్తానని యువకులకు ఆశ చూపేవాడు. ఆ తర్వాత వారిని తన రూమ్‌కు తీసుకెళ్లి మద్యం తాగించేవాడు. తనకు మ్యాజిక్ కూడా వచ్చని.. చూస్తే ఆశ్చరపోతారని చెప్పేవాడు. వారి చేతికి సంకెళ్లు వేసి అత్యాచారానికి పాల్పడేవాడు. ఆ తర్వాత వారి ముఖాలను చెక్కేసి తన గదిలోనే పూడ్చిపెట్టేవాడు. కొందరిని నదీలో పడేసేవాడు. పిల్లలను మచ్చిక చేసుకోడానికి ముందు వారిపై ప్రత్యేకంగా నిఘా పెట్టేవాడు. వారి వల్ల తనకు ముప్పు ఉండదని తెలుసుకున్న తర్వాతే వారితో మాట్లాడేవాడు. అలా సుమారు 33 మంది పిల్లలు, యువకులు కనిపించకుండా పోయారు.
తలనొప్పిగా మారిన కేసు: ఈ కేసు పోలీసులకు తలనొప్పిగా మారింది. నగరంలో వరుసగా పిల్లలు మాయవుతున్నా పట్టించుకోవడం లేదంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. తమ పిల్లల ఆచూకీ తెలుసుకోవలంటూ తల్లిదండ్రులు పోలీసులపై ఒత్తిడి తెచ్చేవారు. గేసీ మారణకాండ 1972 నుంచి 1976 వరకు కొనసాగింది. సుమారు నాలుగేళ్లపాటు పోలీసులకు కంటి మీద కునుకులేదు. మరోవైపు గేసీ హత్య చేసిన కొందరి మగ పిల్లల శవాలు నదిలో కొట్టుకొని వచ్చేవి. వారి ముఖాలు చెక్కేసి ఉండటం వల్ల వారు ఎవరి పిల్లలో గుర్తించడం కష్టంగా ఉండేది. పైగా ఆ శవాలన్నీ ఉబ్బిపోయి కుళ్లిన స్థితిలో ఉండటంతో తల్లిదండ్రులు గుండెలు అవిసేలా ఏడ్చేవారు. అప్పట్లో డీఎన్ఏ పరీక్షలు అందుబాటులో లేవు. ‘‘ఆ సీరియల్ కిల్లర్ దొరికితే మాకు అప్పగించండి. మా చేతులతోనే కొట్టి చంపేస్తాం’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసేవారు. కానీ, చేసిన పాపానికి ఏదో ఒక రోజు మూల్యం చెల్లించుకోవాలి. ఆ రోజు రానే వచ్చింది.
Also Read: ‘యుద్ధం’ చూడాలని ఉందా? ఈ 8 వెబ్‌సీరిస్‌లు కట్టిపడేస్తాయ్, డోన్ట్ మిస్!
ఇలా దొరికిపోయాడు: డిసెంబరు 11, 1978 మధ్యాహ్నం గేసీ ఓ మెడికల్ స్టోర్ యజమాని ఫిల్ టోర్ఫ్‌ను కలిశాడు. ఆ సమయంలో అక్కడ పార్ట్‌టైమ్ జాబ్ చేస్తున్న 15 ఏళ్ల రాబర్ట్ పీస్ట్‌పై కన్ను పడింది. తన సంస్థలో పనిచేసే టీనేజ్ అబ్బాయిలకు గంటకు 5 డాలర్లు చెల్లిస్తున్నానని పీస్ట్‌కు చెప్పాడు. ఆ మొత్తం మెడికల్ స్టోర్‌లో ఇచ్చే జీతం కంటే రెట్టింపు. దీంతో పీస్ట్‌కు గేసీ సంస్థలో చేరాలనే ఆశ కలిగింది. అదే సమయంలో పీస్ట్ తల్లి మెడికల్ స్టోర్‌కు వచ్చింది. అయితే, పీస్ట్ ఆమెతో వెళ్లలేదు. తాను ఓ కాంట్రాక్టర్‌తో ఉద్యోగం గురించి మాట్లాడాల్సి ఉందని, తాను తర్వాత ఇంటికి వస్తానని చెప్పాడు. రాత్రి 9 గంటల తర్వాత పీస్ట్ మెడికల్ స్టోర్ నుంచి గేసీ ఇంటికి వెళ్లాడు. అతడి ఇంటికి వెళ్లిన పీస్ట్‌కు గేసి సంకెళ్లు వేశాడు. అతడి మెడకు తాడును చుట్టి.. ఊపిరి ఆడకుండా చేసి చంపేశాడు. పీస్ట్ తల్లి తన కొడుకు కనిపించడం లేదని పోలీసులను ఆశ్రయించింది. టోర్ఫ్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు గేసీని విచారించారు. పీస్ట్‌కు తాను ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించానని తెలిపాడు. అతడు తన వద్దకు రాలేదని చెప్పాడు. కానీ, పోలీసులు అనుమానం అలాగే ఉంది. గతంలో అతడు చేసిన లైంగిక దాడులను దృష్టిలో పెట్టుకుని పోలీసులు ఎట్టకేలకు సెర్చ్ వారెంట్ పొందారు.
Also Read: వామ్మో, జోంబీలు - ఈ వెబ్ సీరిస్‌లు చూస్తే నిద్రలోనూ వణికిపోతారు
ఇంటి నిండా శవాలే: పోలీసులు ఎట్టకేలకు గేసీని అదుపులోకి తీసుకుని విచారించారు. గేసీ కూడా తన నేరాలను అంగీకరించాడు. శవాలను ఏయే గదుల్లో ఎక్కడెక్కడ పూడ్చి పెట్టాడో చెబుతూ ఓ మ్యాప్‌ను గీసి.. పోలీసులకు ఇచ్చాడు. దీంతో పోలీసులు అక్కడ తవ్వి చూస్తే శవాల దిబ్బలు కనిపించాయి. కొన్ని కుళ్లిన స్థితిలో ఉంటే మరికొన్ని పూర్తిగా అస్థిపంజరంలా మారిపోయాయి. సుమారు 26 శవాలను పోలీసులు ఆ ఇంటి నుంచి బయటకు తీశారు. మిగతా శవాలను పూడ్చి పెట్టేందుకు ఇంట్లో స్థలం లేకపోవడంతో నదిలో పడేశానని గేసీ చెప్పాడు. 33 మంది పిల్లలు, యువకుల హత్యలపై జరిగిన విచారణలో గేసి నేరాన్ని అంగీకరించాడు. 1980లో జరిగిన తుది విచారణలో కోర్టు అతడికి మరణ శిక్ష విధించింది. 1994లో విషపూరిత ఇంజెక్షన్‌తో గేసీకి మరణదండన విధించారు.