Netflix: ‘యూట్యూబ్’ బాటలో ‘నెట్‌ఫ్లిక్స్’, అలా చేస్తే ప్రేక్షకులకు టార్చరే!
గత పదేళ్లలో ఎన్నడూలేని స్థాయిలో ‘నెట్‌ఫ్లిక్స్’ చందాదారులను కోల్పోయింది. ఈ నేపథ్యంలో యూట్యూబ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మార్గంలో ప్రయాణించాలని చూస్తున్నట్లు సమాచారం.
‘యూట్యూబ్’లో వీడియోలు ఉచితమే. కానీ, ప్రకటనలు లేకుండా ప్రశాంతంగా వీడియోలు చూడాలంటే తప్పకుండా డబ్బులు చెల్లించాల్సిందే. అయితే, ఓటీటీల్లో ఈ సాంప్రదాయం లేదు. ‘సబ్‌స్క్రైబ్’ పొందిన వినియోగదారుడు ఎలాంటి ప్రకటనలు లేకుండానే వీడియోలను వీక్షించవచ్చు. కానీ, కొన్ని ఓటీటీలు తమ ఆదాయాన్ని పెంచుకోవడం కోసం ఇప్పుడు ప్రకటనల ప్రసారాన్ని కూడా మొదలుపెట్టాయి. ఆ ప్రకటనల గోల లేకుండా ఉండాలంటే.. కాస్త ఎక్కువ చెల్లించి పెద్ద ప్యాకేజీ పొందాలని కోరుతున్నాయి. ఇప్పుడు ‘నెట్‌ఫ్లిక్స్’ కూడా అదే బాటలో ప్రయాణించేందుకు సిద్ధమవుతోంది. ఎందుకంటే..
ఒకప్పుడు ‘నెట్‌ఫ్లిక్స్’లో సబ్‌స్క్రైబర్లు తక్కువగానే ఉన్నా.. మంచి ఆదాయం లభించేది. కానీ, ఇతర ఓటీటీల నుంచి పోటీని తట్టుకోవడం కోసం ‘నెట్‌ఫ్లిక్స్’ ధరలను తగ్గించింది. కానీ, అది పెద్దగా వర్కవుట్ కాలేదు. ఎందుకంటే.. ‘నెట్‌ఫ్లిక్స్’ తక్కువ ప్యాకేజీలో ఇచ్చే ఆప్షన్స్ వినియోగదారులకు నచ్చకపోవడమే. పైగా ‘నెట్‌ఫ్లిక్స్’కు పైరసీ ముఠాల నుంచి కూడా సవాళ్లు ఎదురవ్వుతున్నాయి. ఈ నేపథ్యంలో ధరలు మరింత తగ్గించి వినియోగదారులను పెంచుకోవాలని భావిస్తోంది. అలా కోల్పోయే ఆదాయాన్ని ప్రకటనల ద్వారా పొందాలనే ప్రయత్నం చేస్తోంది.
కాబట్టి.. భవిష్యత్తులో తక్కువ ధరతో వినోదాన్ని పొందాలని భావించేవాళ్లు భవిష్యత్తులో టీవీ షోలు, సినిమాలను ప్రకటనలతోపాటు చూడాల్సిందే. ‘నెట్‌ఫ్లిక్స్’ కో-సీఈవో రీడ్ హేస్టింగ్స్ తాజాగా ‘నెట్‌ఫ్లిక్స్’ ఆదాయ వివరాలను గురించి ప్రస్తావిస్తూ.. ఈ విషయాన్ని తెలిపారు. టీవీ షోలు, సినిమాల మధ్య ప్రకటనలను ప్రసారం చేయడం తమకు అస్సలు ఇష్టం లేదన్నారు. కానీ, భవిష్యత్తులో అలా చేయాల్సి రావచ్చని వెల్లడించారు. ‘నెట్‌ఫ్లిక్స్’ తక్కువ ధరకే కావాలని కోరుకొనే వినియోగదారులు ప్రకటనలను భరించేందుకు సిద్ధమైతే.. అలా చేయడానికి సిద్ధం కావల్సిందేనని అన్నారు.
‘నెట్‌ఫ్లిక్స్’ పదేళ్ల కాలంలో ఎన్నడూలేనంతగా వినియోగదారులను కోల్పోయింది. ఫలితంగా కంపెనీ షేర్లు 20 శాతానికి పైగా పడిపోయాయి. ఈ ఏడాది త్రైమాసికంలో సుమారు 2.5 మిలియన్ల కొత్త సబ్‌స్క్రైబర్‌లు లభించవచ్చని ‘నెట్‌ఫ్లిక్స్’ అంచనా వేసింది. కానీ, రెండో త్రైమాసికంలో అదనంగా 2 మిలియన్ల గ్లోబల్ సబ్‌స్క్రైబర్‌లను కోల్పోయే అవకాశాలున్నట్లు అంచనా వేసింది. హులు, పీకాక్, పారామౌంట్+ తదితర ఓటీటీలు వాణిజ్య ప్రకటనలతో అందుబాటులో ఉంన్నాయి. అలాగే డిస్నీ+ కూడా ప్రకటనలతో స్ట్రీమింగ్‌కు సిద్ధమైనట్లు ధృవీకరించింది.
అయితే, ‘నెట్‌ఫ్లిక్స్’ ఇప్పటివరకు ఈ పద్ధతిని పాటించేందుకు సిద్ధంగా లేదు. డేటా ట్రాకింగ్‌తో యాడ్‌లను ప్రసారం చేసే అవసరం తమ సంస్థకు రాబోదనే భావిస్తోంది. ‘‘లాభాలపరంగా చూస్తే కచ్చితంగా ఆన్‌లైన్ ప్రకటన మార్కెట్ బాగా అభివృద్ధి చెందింది. కానీ, మేం ముందుగా వినియోగదారులను పెంచుకొనే దిశలోనే ఆలోచిస్తున్నాం’’ అని హేస్టింగ్స్ తెలిపారు.
Also Read: నెట్‌ఫ్లిక్స్‌లో సరికొత్త పీచర్- నచ్చిన సినిమా, సిరీస్‌లకు కొత్త రేటింగ్ సిస్టమ్
‘నెట్‌ఫ్లిక్స్ తాజా ఆర్థిక నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 222 మిలియన్ల చెల్లింపుదారులు ఉన్నారు. అదనంగా 100 మిలియన్ కుటుంబాలు దీన్ని షేర్ చేసుకుంటున్నారు. చందాదారుల్లో చాలామంది తమ పాస్‌వర్డ్‌ను ఇతరులతో పంచుకోవడం వల్ల కొత్త సభ్యులను పొందడం కష్టతరంగా మారినట్లు ‘నెట్‌ఫ్లిక్స్’ అంగీకరించింది. ఈ నేపథ్యంలో ‘నెట్‌ఫ్లిక్స్’ పాస్‌వర్డ్‌లను షేర్ చేసుకోవడంపై ఏమైనా ఆంక్షలు విధిస్తుందా అనే సందేహాలు నెలకొన్నాయి.
Also Read: వామ్మో, జోంబీలు - ఈ వెబ్ సీరిస్‌లు చూస్తే నిద్రలోనూ వణికిపోతారు