Mission Impossible 7 OTT: ఓటీటీలో ఫ్రీగా 'మిషన్ ఇంపాజిబుల్' - ఎప్పుడు, ఎక్కడంటే?
Mission Impossible 7: గతేడాది థియేటర్లలో విడుదలయ్యి హాలీవుడ్ యాక్షన్ మూవీ లవర్స్‌ను ఆకట్టుకున్న ‘మిషన్ ఇంపాజిబుల్’ త్వరలోనే ఓటీటీలో ఫ్రీగా చూసే అవకాశం లభిస్తుంది.
Mission Impossible 7 OTT Release: హాలీవుడ్‌లోనే అన్నింటికంటే పాపులర్ ఫ్రాంచైజ్ ‘మిషన్ ఇంపాజిబుల్’. ఇక ఈ మూవీ 'మిషన్ ఇంపాజిబుల్ : డెడ్ రికానింగ్ పార్ట్ వన్' పేరుతో గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2023 జూన్‌లో ఈ మూవీ థియేటర్లలో విడుదలయ్యి.. హాలీవుడ్ యాక్షన్ మూవీ లవర్స్ అంచనాలను అందుకుంది. ‘మిషన్ ఇంపాజిబుల్’ ఫ్రాంచైజ్‌లో వచ్చే సినిమా ఎలా ఉంటుంది, ఎలా ఉండాలని ప్రేక్షకులు అనుకుంటారో.. అంతకు మించి ఉంది. జూన్ నెలలో థియేటర్లలో విడుదలయిన తర్వాత అక్టోబర్‌లో ‘మిషన్ ఇంపాజిబుల్’ అమెజాన్ ప్రైమ్‌లో రెంట్‌కు అందుబాటులోకి వచ్చింది. ఇక ఈ రెంట్ ఫార్మాట్‌ను తీసేసి అమెజాన్ సబ్‌స్క్రైబర్స్‌కు ఉచితంగా చూసేందుకు అందుబాటులోకి తెచ్చింది.
‘మిషన్ ఇంపాజిబుల్’ కథ ఇదే..
న్యూ ఇయర్‌లోకి ఎంటర్ అయిన సందర్భంగా ‘మిషన్ ఇంపాజిబుల్’ను రెంట్ లేకుండా ఫ్రీగా తమ సబ్‌స్కైబర్లకు అందించాలని అమేజాన్ ప్రైమ్ యాజమాన్యం నిర్ణయించుకుంది. సముద్రంలో ఓ సబ్ మెరైన్ అనూహ్య రీతిలో మునిగిపోతుంది. అందులో ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (AI) 'ది ఎంటిటీ' సోర్స్ కోడ్ ఉంటుంది. దానిని కంట్రోల్ చేయాలంటే 'కీ' కావాలి. ఆ 'కీ' తమ చేతికి చిక్కితే ఈ ప్రపంచాన్ని శాసించవచ్చని కొందరు ప్రయత్నిస్తారు. ఆ 'కీ' వాళ్ళ చేతికి చిక్కకుండా ప్రపంచాన్ని కాపాడే బాధ్యత ఈథన్ హంట్ (టామ్ క్రూజ్)కు వస్తుంది. అప్పుడు ఎటువంటి యుద్ధం చేశాడు? కంటికి కనిపించని శత్రువుతో ఎటువంటి ప్రమాదాలు ఎదుర్కొన్నాడు? అతని ప్రయాణంలో గ్రేస్ (హైలీ యాట్‌వెల్), మాజీ ఏజెంట్ ఎల్సా (రెబెక్కా) పాత్రలు ఏమిటి? వైట్ విడో (వనేసా కొర్బీ), గాబ్రియేల్ (ఇసై మోరల్స్) ఎవరు? అనేది వెండితెరపై మనం చూసే చిత్రం.
ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్‌తో ఫైట్..
కాలంలో పాటు మనిషికి ఎదురయ్యే ప్రమాదాలు కొత్త రూపం తీసుకుంటున్నాయి. ఈ కథలోనూ ఆ మార్పు కనిపించింది. ఇప్పుడు టెక్నాలజీలో ఎక్కువ వినిపిస్తున్న పదం ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్. దాంతో ప్రపంచాన్ని ఎవరైనా నాశనం చేస్తే? ఈ ఊహ భయంకరంగా ఉంది కదూ! మరి, ఏఐను హీరో ఎదుర్కొంటే? హీరోయిజానికి ఎక్కువ స్కోప్ ఉన్న పాయింట్. దర్శకుడు క్రిస్టోఫర్ దీన్ని తీసుకున్నాడు. కథలో కొత్త పాయింట్ ఉంది. హీరోయిజం బావుంది. యాక్షన్ సీన్లు అదిరిపోయాయి. కానీ, కథను నడిపించిన తీరులో థ్రిల్ ఏమీ లేదు. మనకు థ్రిల్ ఇచ్చేవి యాక్షన్ సీన్లే. హాలీవుడ్‌కు మాత్రమే కాదు.. అన్ని భాషల మూవీ లవర్స్‌కు నచ్చే యాక్షన్ సీన్లను ఈ సినిమాలో చేర్చారు కాబట్టే ‘మిషన్ ఇంపాజిబుల్’ అంటూ యాక్షన్ లవర్స్‌కు చాలా ఇష్టం.
టామ్ క్రూజ్ నటనకు ఫిదా..
ఈథన్ హంట్ అంటే టామ్ క్రూజ్. ఆ పాత్రలో మరొక హీరోను ఊహించుకోలేం. 'మిషన్ ఇంపాజిబుల్ 7' చూసిన తర్వాత టామ్ క్రూజ్ తప్ప ఇంకెవరూ ఆ తరహాలో నటించలేరని, స్టంట్స్ చేయలేరని అనిపిస్తుంది. వన్స్ ఎగైన్... టామ్ క్రూజ్ ఇరగదీశారు. గ్రేస్ పాత్రలో హైలీ యాట్‌వెల్ సెటిల్డ్ ఎమోషన్స్ చూపించారు. సైమన్ పెగ్ డైలాగ్స్ నవ్విస్తాయి. పారిస్ పాత్రలో పోమ్ యాక్షన్ సీన్లు చేశారు. ఆమె నటన కూడా ఆకట్టుకుంటుంది. రెబెక్కా పాత్రను ముగించడం ఆమె అభిమానులను డిజప్పాయింట్ చేయవచ్చు. టామ్ క్రూజ్ అభిమానులకు, యాక్షన్ సినిమా ప్రేమికులకు విపరీతంగా నచ్చే సినిమా 'మిషన్ ఇంపాజిబుల్ 7'. ప్రేక్షకులు ఎవరైనా సరే ఉత్కంఠ భరితంగా సాగే ఆ యాక్షన్ సీక్వెన్సులను ఊపిరి బిగబట్టి చూడటం ఖాయం. టామ్ క్రూజ్ టాప్ లేపేశాడు. అందుకే వెండితెరపై చూసినవారు కూడా మళ్లీ ఈ మూవీని ఓటీటీలో చూడడానికి ఎదురుచూస్తున్నారు.