Orange Re-release: ‘ఆరెంజ్’ రీరిలీజ్ నుంచి వచ్చే ప్రతీ రూపాయి జనసేనకే!
హీరో రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ‘ఆరెంజ్’ మూవీని మరోసారి థియేటర్లలో రీరిలీజ్ చేయనున్నారు. దాని ద్వారా వచ్చే మొత్తాని జనసేనకు విరాళంగా ఇవ్వనున్నారు.
దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన ‘ఆర్ఆర్ఆర్’తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రపంచ వ్యాప్తంగా ఎనలేని ఖ్యాతిని సాధించారు. ఆ సినిమాలోని ‘‘నాటు నాటు’’ సాంగ్ కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో సెలక్ట్ అయ్యి ఆస్కార్ ను కూడా సొంతం చేసుకుంది. తాజాగా చెర్రీ మరోసారి వార్తల్లో నిలిచారు. మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రామ్ చరణ్ నటించిన ‘ఆరెంజ్’ సినిమాను మరోసారి థియేటర్లలో రీరిలీజ్ చేస్తున్నట్లుగా కొణిదెల నాగబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. తాజాగా ‘ఆరెంజ్’ రిరిలీజ్ ట్రైలర్ కూడా విడుదల చేశారు.
మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ‘ఆరెంజ్’ చిత్రాన్ని మేకర్స్ మరోసారి థియేటర్లలో విడుదల చేయనున్నారు. కాగా ఈ చిత్రం ద్వారా రాబోయే ప్రతి రూపాయి జనసేన పార్టీకి ఇవ్వాలని నిర్ణయించినట్టు జనసేన అధికారికంగా తెలిపింది. వినోదంతో పాటు జనసేనని బలోపేతం చేసే ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలి అని కోరింది. తెలుగు వారి ఖ్యాతి ప్రపంచ నలుదిశలా చాటి చెప్పి, ఆస్కార్ వరకు పయనించిన ఆర్ఆర్ఆర్ చిత్ర కథానాయకుడు, మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదనం సందర్భంగా మార్చి 25, 26న కల్ట్ క్లాసిక్ ప్రేమ కథా చిత్రం ‘ఆరెంజ్’ ను విడుదల చేసి, ఆ చిత్రం ద్వారా రాబోయే ప్రతి రూపాయి జనసేన పార్టీకి ఇవ్వాలని నిర్ణయించినట్టు పేర్కొంది.
ఆరెంజ్ చిత్రాన్ని విడుదల చేసి, ఆ చిత్రం ద్వారా రాబోయే ప్రతి రూపాయి మన జనసేన పార్టీకి విరాళం ఇవ్వాలని నిర్ణయించాం. వినోదంతో పాటు జనసేనని బలోపేతం చేసే ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలి అని ఆశిస్తూ.. @NagaBabuOffl pic.twitter.com/QG4EW7ZSq3
— JanaSena Party (@JanaSenaParty) March 23, 2023
మెగా అభిమానులు, జన సైనికులు తమ వంతుగా ఈ కార్యక్రమంలో భాగమై, వినోదంతో పాటు జనసేనను బలపేతం చేసే ఈ కార్యక్రమంలో భాగం కావాలని కోరుతూ జనసేన తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేసింది. ఈ ట్వీట్ పై నెటిజన్లు పలురకాలుగా కామెంట్లు పెడుతున్నారు. కొందరు గ్రేట్ అని ప్రశంసలు గుప్పిస్తుంటే.. మరికొందరేమో.. ఇలాంటివి చేస్తే వచ్చే ఎన్నికల్లో ఓటేసే ఫ్యాన్స్ కూడా ఓటెయ్యడం మానేస్తారంటూ ఏకి పారేస్తున్నారు.
క్లాసిక్ లవ్ స్టోరీగా రూపొందిన ‘ఆరెంజ్’ చిత్రానికి ఇప్పటికీ కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ నేపథ్యంలోనే మార్చి 25, 26 తేదీల్లో ‘ఆరెంజ్’ స్పెషల్ షోస్ ప్లాన్ చేశారు. 2010లో రిలీజైన ఈ చిత్రాన్ని అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై మెగా బ్రదర్ నాగబాబు నిర్మించారు. ఇక ఇప్పుడు రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ‘ఆరెంజ్’ సినిమాను రీరిలీజ్ చేసి, వచ్చిన నగదును జనసేనకు విరాళంగా ఇస్తామని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.
మొన్నటివరకూ టీవీ షోస్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన నాగబాబు.. ఇప్పుడిప్పుడే జనసేన పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందున తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు అండగా ఉంటూ తోడుగా ఉంటున్నారు. అందులో భాగంగానే రామ్ చరణ్ నటించిన ‘ఆరెంజ్’ రీ రిలీజ్ చేసి, దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా జనసేన పార్టీకి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించడం పట్ల జన సైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ‘ఆరెంజ్’ రీరిలీజ్ సందర్భంగా కొత్తగా విడుదల చేసిన టీజర్ మరోసారి మెగా ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చింది. అప్పట్లో ఈ సినిమా అంతగా ఆడకపోయినా సాంగ్స్ మాత్రం యూత్ ను ఎంతో ఆకట్టుకున్నాయి. దీంతో మరోసారి సిల్వర్ స్క్రీన్‌పై ఈ మ్యూజికల్ హిట్ మూవీని చూసి ఎంజాయ్ చేసేందుకు మెగా ఫ్యాన్స్ ఆత్రుతగా ఉన్నారు.