Nayanathara Vignesh Shivan: ప్రాణం, ప్రపంచం - పిల్లల పేర్లు ప్రకటించిన నయన్, విఘ్నేష్!
నయనతార, విఘ్నేష్ శివన్ తమ పిల్లల పేర్లను సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.

Nayanathara Vignesh Shivan: నయన తార, విఘ్నేష్ శివన్ తమ పిల్లలకు పేర్లు నిర్ణయించారు. సరోగసి ద్వారా వీరిద్దరూ కవలలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. వీరికి ‘ఉయిర్ రుద్రోనీల్ ఎన్ శివన్’, ‘ఉలగ్ దైవిక్ ఎన్ శివన్’ అని పేర్లు పెట్టారు. నిజానికి పిల్లలు పుట్టినప్పుడే వీరు ‘ఉయిర్’, ‘ఉలగం’ అని ఇన్‌డైరెక్ట్‌గా పిల్లల పేర్లను హింట్ ఇచ్చారు. తమిళంలో ఉయిర్ అంటే ప్రాణం అని, ఉలగం అంటే ప్రపంచం అని అర్థం. తమ ప్రాణం, ప్రపంచం పిల్లలే అని అర్థం వచ్చేలా ఈ పేర్లు పెట్టారని అనుకోవచ్చు.
నయనతార, విఘ్నేశ్ శివన్‌ల సరోగసీ అప్పట్లో పెద్ద వివాదంగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా నయనతార, విఘ్నేశ్ శివన్ సరోగసీ విధానాన్ని ఆశ్రయించారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై తమిళనాడు ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుంది. ఈ సరోగసీ వ్యవహారంపై విచారణ కమిటీకి ప్రభుత్వం ఇంతకు ముందే ఆదేశించింది. ఈ కమిటీ బుధవారం తమ నివేదికను సమర్పించింది.
ఈ విచారణ కమిటీ ఇచ్చిన నివేదికలో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. నయనతార, విఘ్నేశ్ దంపతుల సరోగసీ వ్యవహారం చట్టబద్ధంగానే జరిగినట్లు కమిటీ తన నివేదికలో పేర్కొంది. చెన్నైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో సరోగసీ ప్రక్రియ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఆస్పత్రి వైద్యులను, సిబ్బందిని విచారించినట్లు తమ నివేదికలో పేర్కొన్నారు. సరోగసీ ప్రక్రియలో నయనతార, విఘ్నేశ్ శివన్ దంపతులు చట్టబద్ధమైన నిబంధనలు అన్ని అనుసరించారని విచారణలో తేలింది. ఈ వివాదంలో అద్దె గర్భం దాల్చిన మహిళకు ఇప్పటికే వివాహమైందని కమిటీ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో తేల్చి చెప్పింది.
2016 మార్చి 11వ తేదీన నయనతార, విఘ్నేశ్ దంపతులకు వివాహం అయినట్లు వారు అఫిడవిట్‌లో తెలిపారు. ఈ సరోగసీ ప్రాసెస్ 2021 ఆగస్టులో మొదలైందని పేర్కొన్నారు. అదే సంవత్సరం నవంబర్‌లో సరోగసీ విధానంపై ఒప్పందం కుదుర్చుకున్నట్లు తమ విచారణలో తేలింది. దీంతో నయనతార, విఘ్నేశ్ జంటపై వస్తోన్న వార్తలకు ఫుల్‌స్టాప్ పడినట్లే. ఈ జంట చట్టబద్ధంగానే వివాహమైన ఐదేళ్లకు సరోగసీ విధానాన్ని అనుసరించినట్లు విచారణలో తేలింది. నయనతార, విఘ్నేశ్ శివన్‌లు అరెస్ట్ అవుతారంటూ వచ్చిన వార్తలకు చెక్ పడింది.
నయన తార ప్రేమలో రెండు సార్లు పెళ్లి దాకా వెళ్లి వెనక్కి వచ్చింది. ఆమె లవ్ ఫెయిల్యూర్ స్టోరీలు కూడా ఆసక్తికరమే. చివరికి విఘ్నేష్ తో ఏడేళ్ల నుంచి ప్రేమలో ఉంది. వారిద్దరూ సహజీవనం కూడా చేశారని చెబుతారు. ఇరువురి కుటుంబీకుల సమ్మతితో ఈ ఏడాది జూన్ 9న తమిళనాడులోని మహాబలేశ్వరంలోని ఓ పెద్ద రిసార్టులో పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి స్ట్రీమింగ్ హక్కులను పాతికకోట్ల రూపాయలకు నెట్ ఫ్లిక్స్ కొనుక్కుంది. వీరి పెళ్లికి బాలీవుడ్ నుంచి షారూఖ్ ఖాన్ హాజరయ్యారు. ఇక తమిళ నటులు రజనీకాంత్, సూర్య, జ్యోతిక, మణిరత్నం వంటి దిగ్గజాలు పాల్గొన్నారు. తెలుగు ఇండస్ట్రీకి చెందిన వారిని ఒక్కరిని నయన తార పిలవకపోవడం ఆశ్చర్యం. పోనీ ఇక్కడ తెలుగు సెలెబ్రిటీల కోసం రిసెప్షన్ ఏర్పాటు చేస్తుందేమో అనుకున్నారు అభిమానులు. కానీ అలాంటిదేమీ జరగలేదు.
View this post on Instagram





















