Nandamuri Balakrishna: ‘నా సినిమా ఇంట్లో కూర్చుని చూస్తే ఆనదు’ - ‘భగవంత్ కేసరి’ ప్రెస్‌మీట్‌లో బాలయ్య సూపర్ స్పీచ్!
‘భగవంత్ కేసరి’ ప్రెస్‌మీట్‌లో నందమూరి బాలకృష్ణ మాట్లాడారు.
నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘భగవంత్ కేసరి’. ఈ సినిమా అక్టోబర్ 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. దీంతో ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశారు. ఇటీవల విడుదల అయిన ట్రైలర్‌కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ ఆదివారం నిర్వహించారు. అందులో నందమూరి బాలకృష్ణ మాట్లాడారు.
ఈ కార్యక్రమం మాట్లాడుతూ తన సినిమా ఇంట్లో కూర్చుని చూస్తే ఆనదని, థియేటర్లలో పెద్ద స్క్రీన్‌పై చూస్తేనే కిక్ లభిస్తుందని తెలిపారు. అలాగే తాము ట్రైలర్‌లో చూపించింది చాలా తక్కువ అని, ఇంకా సినిమాలో మరో గెటప్ కూడా ఉందని చెప్పారు. ఈ విషయం రివీల్ చేసేటప్పుడు వెనక దర్శకుడు అనిల్ రావిపూడి టెన్షన్ పడుతూ ఉండగా, అంతా చెప్పట్లేదులే అని ఫన్నీగా మాట్లాడారు.
అనిల్ రావిపూడి ఇప్పటివరకు తీసిన సినిమాలన్నీ వేటికవే వైవిధ్యంగా ఉంటాయని, ఒకే తరహా సినిమాలు ఆయన ఎప్పుడూ చేయలేదని, అదే తనకు అనిల్‌లో నచ్చిందని పేర్కొన్నారు. అనిల్ రావిపూడి సినిమాలు చూసి తాను గర్వపడ్డానని పొగడ్తలతో ముంచెత్తారు. ఇతర హీరోలతో ఎక్కువ సినిమాలు తీసిన దర్శకులు, ఆ హీరో బాడీ లాంగ్వేజ్‌కు సూటయ్యే కథలతో తన వద్దకు వచ్చే వారన్నారు.
అనిల్ రావిపూడి చాలా అద్భుతమైన కథతో వచ్చారని, తాము ఈ సినిమా ఒక సవాల్ గా తీసుకున్నామని, చాలా హోం వర్క్ చేశామని తెలిపారు. ఏది చేసినా తన అభిమానులని దృష్టిలో పెట్టుకుంటానని పేర్కొన్నారు. భగవంత్ కేసరి ట్రైలర్ అభిమానులు, ప్రేక్షకులు, అందరినీ ఆకట్టుకుందని చెప్పారు. అనిల్ లాంటి దర్శకుడు ఇండస్ట్రీకి ఒక వరం అన్నారు.
సంగీత దర్శకుడు తమన్ అఖండతో బాక్సులు బద్దలగొట్టాడని పేర్కొన్నారు. కాజల్ అద్భుతమైన నటి అని, చాలా మంచి పాత్ర చేశారని తెలిపారు. శ్రీలీల బోర్న్ ఆర్టిస్ట్ అని ఆకాశానికి ఎత్తేశారు. తమ ఇద్దరి మధ్య చాలా బరువైన సీన్స్ వుంటాయని క్లారిటీ ఇచ్చారు. ఆడ మగా అనే తేడా లేకుండా అందరూ చప్పట్లు కొట్టి కన్నీళ్ళతో థియేటర్ నుంచి బయటికి వస్తారన్నారు. అర్జున్ రామ్ పాల్ నటన అదరగొట్టారని, తనే డబ్బింగ్ చెప్పారని పేర్కొన్నారు.
‘సినిమాలో చాలా వుంది. దాచిపెట్టాం. సినిమా చాలా కూల్‌గా మొదలవుతుంది. తర్వాత దబిడి దిబిడే. ప్రేక్షకులందరినీ సినిమాలో కి తీసుకెళ్ళిపోతుంది. సమరసింహారెడ్డి, నరసింహానాయుడు.. అఖండ... ఇలా గుర్తుండిపోయే పాత్రలు చేయడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. భగవంత్ కేసరి పాత్ర కూడా గుర్తుండిపోతుంది. సినిమాతో పాటు ఇందులో పాత్రలు కూడా చిరస్థాయిగా నిలిచిపోతాయి.’ అన్నారు. అలాగే అనిల్ రావిపూడితో మళ్లీ పని చేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు. ‘భగవంత్ కేసరి’ అక్టోబర్ 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్ ‘లియో’, రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’లో ఈ సినిమా పోటీ పడనుంది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial